హెప్టాతలాన్ విభాగంలో బంగారు పతకం సాధించిన నందిని
•మొత్తం ఏడు ఈవెంట్లలో ప్రతిభ చాటిన విద్యార్థిని
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6 : 38వ జాతీయ స్థాయి పోటీల్లో అథ్లెటిక్స్ హెప్టాతలాన్ విభాగంలో సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ విద్యార్థిని సత్తా చాటింది. గత నెల ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 12 వరకు ఉత్తరాఖండ్ రాష్టంలోని డెహ్రాడూన్ లో నిర్వహించిన 38వ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో సంగారెడ్డి జిల్లా బుదేరా సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనల్ ఇయర్ విద్యార్థిన అగసారా నందిని బంగారు పథకం సాధించింది. ఈ జాతీయ క్రీడల్లో 38 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 10,000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. హరిద్వార్, నైనిటాల్, హల్ద్వానీ, రుద్రపూర్, శివపురి, న్యూ టెహ్రీ అనే ఆరు నగరాల్లో పోటీలు జరిగాయి.
అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్, హాకీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్‌బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ వంటి ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహించారు. భారతదేశంలోని అన్ని రాష్టాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడగా కేవలం 10 మందికి మాత్రమే ఫైనల్ పోటీకి అర్హత సాధించారు. ఇక ఫైనల్ పోటీల్లో అగసారా నందిని బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అథ్లెట్‌లో హెప్టాతలాన్ విభాగంలో నందిని తన సత్త చాటింది. హెప్టాతలాన్ లో మొత్తం ఏడూ రకాలైన ఈవెంట్స్ ఉంటాయి అందులో 1. 100 మీటర్ల హర్డిల్స్ 2. హైజంప్ 3. షార్ట్ ఫుట్ 4. 200 మీటర్స్ 5. జావెలిన్ త్రో 6. లాంగ్ జంప్ 7. 800 మీటర్స్ ఇలా ఏడు ఈవెంట్స్ లో పూర్తిగా పైచేయి సాధిస్తేనే క్వాలిఫై అవుతారు. ఇలా మొత్తం ఏడు ఈవెంట్స్ లో నందిని తన సత్తా చాటి మొదటి స్థానంలో నిలవడం తో గోల్డ్ మెడల్ సాధించింది.
చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం
ఈ సందర్బంగా టిజిఎస్ డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి డాక్టర్ విఎస్ అలగు వర్షిణి మాట్లాడుతూ .. గురుకులాల విద్యార్థులు కేవలం చదువు మాత్రమే కాకుండా, క్రీడల్లో కూడా తమ ప్రతిభను ప్రదర్శించి, విజయం సాధించవచ్చని నందిని నిరూపించిందని అన్నారు. క్రీడలు, విద్యతో పాటు, నైపుణ్యాలను, సహనాన్ని పెంచేందుకు గురుకులాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాలను మరింత తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. యువతను క్రీడలో పాల్గొనేందుకు ఎంతో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. క్రీడాకారులకు కావాల్సిన తర్ఫీదు ఇచ్చేందుకు కోచ్ లను వారికి కావాల్సిన వసతులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అలగు వర్షిణి చెప్పారు. గోల్డ్ మెడల్ అందుకోవడం పట్ల క్రీడాకారిణి ఆగసారా నందిని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు అన్నిరకాలుగా సహకరించిన గురుకుల కార్యదర్శి వర్షిణికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో పాటు కోచ్ తనను ఎంతగానో ప్రోత్సహించారని పేర్కొంది.





