– ముందస్తు చర్యలకు కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ టి.ఎస్.దివాకరతో టెలిఫోన్‌లో మాట్లాడి గోదావరి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతున్న దృష్ట్యా నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అలాగే ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములుగా చేయాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే వరద ముప్పు ఉన్న గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్, పారిశుధ్యం వంటి వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, ఎన్‌డీఆరఎఫ్, ఎస్‌డీఆరఎఫ్ బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు ప్రాజెక్టుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ దిగువ ప్రాంత ప్రజలకు ముందస్తు సమాచారం అందిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, వదంతులను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు పభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చినందున మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, ఎగువ నుంచి వచ్చి చేరుతున్న భారీ వరదతో నీటి మట్టం మధ్యాహ్నానికి ఏకంగా 48 అడుగులకు చేరుకుందని కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 11,44,507 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు.





