లక్షన్నర కోట్లు పెట్టి ఏం సాధిస్తారు..?
ఇళ్లు ఇస్తామని..ఇప్పుడు కూలుస్తారా
మూసీలో పట్టాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ..
మొదట కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీస్‌ను.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఫైర్..
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 30: మూసీ రివర్ ఫ్రంట్ పెద్ద స్కామ్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కెటిఆర్ ఆరోపించారు. లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి ఎవరిని ఉద్దరిస్తారని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మూసీ ప్రాజెక్టు విషయంలో సీఎంని ప్రశ్నిస్తున్నా. నామా గంగే డీపీఆర్, ప్రాజెక్ట్ వివరాలు.. ప్రాజెక్టు పూర్వపరాలు తెప్పించాం. నమా గంగే ప్రాజెక్టుపై ఆసక్తితో వివరాలు తెప్పించాను. 2400 కిలోమీటర్ల గంగానది ప్రక్షాళన కోసం కేంద్రం ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు పెట్టిన బడ్జెట్ రూ.40 వేలకోట్లు. 2400 కిలోమీటర్ల గంగా నదికి రూ.40వేలు కోట్లు. 50 కిలోమీటర్ల మూసీ సుందరీకరణ కోసం ఈ ముఖ్యమంత్రి రూ.1.50 లక్షల కోట్ల ఖర్చు అవుతుందని సీఎం చెబుతున్నారు.
దీన్ని స్కామ్ అనక ఏమనాలి? అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడమంటే ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద, తన యంత్రాంగం, పరిపాలనపై తనకే పట్టులేనితనానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రిగా నేను ఎనిమిదేళ్లు పని చేశాను. కూల్చాల్సి వస్తే.. మొదట కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీస్‌ను. రెండోది ఏ జీహెచ్‌ఎంసీ పర్మిషన్‌లు ఇస్తదో.. ఆ జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని కూల్చాలి. జీహెచ్‌ఎంసీ ఆఫీస్ కూడా నాలాపైనే ఉన్నది. మరి ఇతరులకు సుద్దులు చెప్పే ముందు ఇక్కడి నుంచే మొదలిపెట్టాలి. అని అన్నారు.
మూసీ బాధితుల ఆక్రందనలు చేస్తున్నా.. ఇబ్బంది పడుతుంటే.. నిన్న మొన్నటి వరకు డైలాగ్‌లు కొట్టిన అధినాయకులు ఎక్కడా? రాహుల్ గాంధీ యేడీ? ప్రియాంక గాంధీ ఎక్కడ? అని ప్రశ్నించారు. కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఒక పంటకు 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు.. పరిశ్రమలకు 10 శాతం నీళ్లు వస్తాయి. హైదరాబాద్ మహానగరంతో పాటు వేలాది గ్రామాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు. కానీ మూసీ ప్రాజెక్టులో రిజర్వాయర్ ఉన్నదా? పంప్ హౌస్ ఉన్నదా? అండర్‌గ్రౌండ్ టన్నెల్ ఉన్నదా? ఏం లేకున్నా రూ.1.50లక్షలకోట్లంటే స్కామ్ కాదా? అని తెలిపారు.
థేమ్స్ నదికి కూడా ఖర్చుపెట్టింది దాదాపు రూ.40వేలకోట్లు. వీటన్నింటికంటే అద్భుతాన్ని ఆవిష్కరిస్తా నంటే.. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? రాష్ట్ర ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఎంత? ఎవరి కోసం మూసీ ప్రాజెక్టు చేపడుతున్నవ్ చెప్పాలి. కేటీఆర్ ప్రశ్నించారు.
మూసీ పరీవాహక ప్రజల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తోన్న తీరు సరైంది కాదు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇళ్లకు పట్టాలు వచ్చాయని పలువురు ప్రజలు చెప్తున్నారు. రిజిస్టేష్రన్ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు చెప్తున్నారని పేదలు అడుగుతున్నారు. గతంలో 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. చెరువులకు హద్దులు ఎందుకు గుర్తించలేదన్నారు. ఎఫ్‌టీఎల్ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని అన్నారు. ఇళ్లు కట్టిస్తామన్నారు కానీ.. కూల్చుతామని ఎన్నికల ముందు చెప్పారా? సాగరహారం లాంటి ఉద్యమాలు మళ్లీ రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు తిరగబడితే మంత్రులు ఊళ్లల్లో కూడా తిరగలేరు. పేద ప్రజల ఇళ్లను ఇలా కూల్చేస్తూ ఉంటే మేం చూస్తూ ఊరుకోం. ఇకపై బుల్డోజర్లకు భారాస నేతలు అడ్డుగా ఉంటారని కేటీఆర్ హెచ్చరించారు.





