కామారెడ్డి, గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ పోటీ
సిట్టింగులకే ప్రాధాన్యత
కాంగ్రెస్ నుంచి వొచ్చిన వారందరికీ టిక్కెట్లు
ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుకు నిరాశ
కంటోన్మెంటులో దివంగత సాయన్న కూతరుకు టిక్కెట్
స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి పోటీ
115 అసెంబ్లీ సీట్ల జాబితాను విడుదల చేసిన బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్
పెండింగ్‌లో జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి స్థానాల అభ్యర్థుల పేర్లు

భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముందుగా ప్రకటించినట్లే తన మాట నిలుపుకున్నారు. ఈసారి సిట్టింగ్‌లకే తిరిగి టికెట్లు ఇస్తామని చెప్పినట్లుగానే 119 స్థానాలకు గాను ప్రకటించిన 115 స్థానాల్లో అధిక స్థానాలు పాతవారికే ఇచ్చారు. వారిలో 108 మంది పాతవారు కాగా, కెసిఆర్ రెండవ నియోజకవర్గం కామారెడ్డి, స్టేషన్‌ఘనపూర్‌లో డాక్టర్ రాజయ్యకు బదులుగా కడియం శ్రీహరికి కేటాయించిన స్థానాలను కలుపుకుని మొత్తం తొమ్మిది స్థానాల్లో మార్పులు జరిగాయి. కాగా మరో నాలుగు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. ఎన్నికల పరిశీలనా కమిటి వీటి విషయంలో మరోసారి చర్చించిన తర్వాతే ఆ నాల్గింటిని ప్రకటిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. ముఖ్యంగా ఈ సారి కెసిఆర్ రెండు స్థానాల నుండి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడం విశేషం. ఆయన నియోజకవర్గమైన గజ్వెల్‌తో పాటు ఈసారి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. కాగా కెటిఆర్, హరీష్‌రావు నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులేదు.
ఈ నెల 21న బిఆర్‌ఎస్ అభ్యర్దుల జాబితాను ప్రకటిస్తున్నట్లు వార్త వొచ్చినప్పటి నుండీ పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు విడుతల శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అఖండ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మూడవ సారి జరిగే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలన్న ఉత్సాహంగా ఆ పార్టీ ముందుకు పోతున్నది. అయితే రాష్ట్రంలోని అధిక శాతం శాసనసభ్యులపైన చాలా కాలంగా అనేక ఆరోపణలు వొచ్చాయి. చాలా మంది అక్రమ ఆస్తులు కూడబెట్టారని, భూ అక్రమణ కేసుల్లో ఉన్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. దానికి తగినట్లుగా ఆ పార్టీ అధినేత హోదాలో కెసిఆర్ కూడా ఈ ఆరోపణలపై తనకు సమాచారం ఉందని పార్టీ సమావేశాల్లోనే బహిరంగంగా ప్రకటించారు. చాలామంది కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని వారి ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. అలాంటి వారు 30 మంది వరకు ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. కాగా రానున్న ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ఆరోపణలున్నవారిని కాదని కొత్తవారికి టికెట్టు ఇచ్చే అవకావాలున్నట్లుగా కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో ఇరవై మంది సీట్లు గల్లంతు అవుతాయన్నది బలంగా వినవచ్చింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని సెకండ్ క్యాడర్ లీడర్లలో ఆశ చిగురిస్తూ వొచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో వారి అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వొచ్చారు. సిట్టింగ్ ఎంఎల్‌ఏలను వ్యతిరేకిస్తూ వారికి ఎట్టి పరిస్థితిలో టికెట్ ఇవ్వవద్దని పెద్ద ఎత్తున ప్రదర్శనలే చేశారు. ఒక వేళ తమను కాదని ఇస్తే, అతన్ని ఓడిస్తామని భీష్మ ప్రతిజ్ఞలు కూడా చేశారు. ఇదిలా ఉంటే ఉద్వాసనకు గురయ్యే 20 మంది ఎంఎల్‌లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు కూడా కాచుకు కూర్చున్నాయి. ఇప్పటికీ అసంతృప్తితో ఉన్న రెండవ క్యాడర్‌కు గాలం వేసేందుకు ఆ పార్టీలు సిద్దమవుతున్నాయి. అయితే అందరి ఆలోచనకు భిన్నంగా కెసిఆర్ పాతవారికే టికెట్లు ఖాయం చేస్తూ సోమవారం ప్రకటించడం స్వీయ పార్టీతో పాటు ప్రతిపక్షాలను ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా తమకు టికెట్ వొస్తుందో రాదో అని ఆవేశపడుతూ పరోక్షంగా పార్టీపై విరుచుకుపడిన వారి నోర్లకు కూడా ఈ జాబితా ప్రకటనతో తాళాలు పడ్డాయి.
గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రకటించని విధంగా మొదటి విడుతలోనే 115 మంది అభ్యర్థులను ప్రకటించి బిఆర్‌ఎస్ పార్టీ ఒక విధంగా రికార్డును సృష్టించింది. మొదటి విడుతలో ప్రకటించిన వారంతా తప్పకుండా గెలుస్తారని ఆ పార్టీ నమ్మకంగా ఉంది. అయితే ఏడు స్థానాల్లో మాత్రం మార్పు చేసింది. వేములవాడలో చాలకాలంగా స్థానిక ఎంఎల్యే చెన్నమనేని విద్యాసాగర్‌రావు పౌరసత్వంపైన వివాదం కొనసాగుతుంది. నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధిపర్చిన వ్యక్తిగా పేరున్నప్పటికీ పౌరసత్వ వివాదం దృష్ట్యా ఆయనకు ఈసారి టికట్‌ను కేటాయించలేదు. జాబితా ప్రకటనకు ముందే ఈ విషయాన్ని పసిగట్టిన చెన్నమనేని బిఆర్‌ఎస్ అధిష్టానంపైన ఘాటైన విమర్శలు చేశారు. ఆయన స్థానంలో చల్మెడ లక్ష్మీనరసింహకు టికట్లు కేటాయించారు. అలాగే ఆసిఫాబాద్ టికెట్‌ను రేఖా నాయక్‌కు బదులుగా కోవా లక్ష్మీకి, బోథ్ స్థానాన్ని బాపురావ్‌కు బదులుగా అనిల్ జాదవ్‌కు కేటాయించారు.
ఖానాపూర్ టికెట్ బూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కు, కోరుట్ల స్థానాన్ని స్థానిక ఎంఎల్‌ఏ విద్యాసాగర్‌రావు కోరిక మేరకు ఆయన కుమారుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కి, వైరా స్థానాన్ని రాములు నాయక్‌కు బదులుగా బానోత్ మదన్‌లాల్‌కు, ఉప్పల్ టికెట్టును సుభాష్‌రెడ్డికి బదులుగా బండారు లక్ష్మారెడ్డికి, స్టేషన్ ఘనపూర్ టికెట్‌ను డాక్టర్ రాజయ్యకు బదులుగా కడియం శ్రీహరికి కేటాయించారు. ఇకపోతే పెండింగ్‌లో పెట్టిన నాలుగు నియోజకవర్గాల్లో జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ ఉన్నాయి. జనగామలో స్థానిక ఎంఎల్‌ఏ పైన అనేక ఆరోపణలున్నాయి. స్వయంగా ఆయన కూతురే ఆయనకు వ్యతిరేకం కావడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. దీంతో రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎంఎల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న ప్రచారం ముమ్మరంగా జరుగటంతో నియోజకవర్గంలో రెండు గ్రూపులైనాయి. వీరి పంచాయితీ తీవ్రస్థాయికి చేరుకోవడంతో ప్రస్తుతానికి దాన్ని అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది.