నీటిపారుదల సలహా మండళ్ల పునరుద్ధరణ

– ఎల్‌నినోపై రైతులకు ముందస్తు మార్గదర్శకాలు
– సాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పీలో నీటి నిల్వలు ఇంకా తక్కువే
– తాగునీటి నిల్వలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం
– రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల రేషన్ స్మార్ట్ కార్డులు
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 7:  ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా నీటిపారుదల సలహా మండళ్లను తక్షణమే పునరుద్ధరించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటవీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సంబంధిత వర్గాలతో కూడిన జిల్లా నీటిపారుదల సలహా మండళ్లు ప్రతి పంట కాలానికి ముందు, పంట సీజన్‌లో తప్పనిసరిగా సమావేశమై జలాశయాల నీటి నిల్వలు, ఆశించదగిన నీటి ప్రవాహాలు, స్థానిక వర్షపాతం, తాగునీటి అవసరాలు, కమాండ్ ఏరియాల్లోని సాగు పరిస్థితులను సమగ్రంగా సమీక్షించి రైతులకు శాస్త్రీయమైన, విశ్వసనీయమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీలైన జిల్లాల్లో రేపటి నుంచే నీటిపారుదల సలహా మండళ్ల సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మండళ్లు కేవలం నీటి విడుదలలపై నిర్ణయాలు తీసుకునే వేదికలు మాత్రమే కాకుండా రైతులు ఏ పంట వేస్తే భవిష్యత్తులో నష్టపోకుండా ఉంటారో ముందుగానే తెలియజేసే బాధ్యతాయుతమైన వ్యవస్థగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న జలాశయాల నీటి నిల్వలు, రుతుపవనాల మిగిలిన కాలంలో వర్షపాతం అంచనాలను పరిశీలిస్తే అత్యంత జాగ్రత్తతో పంటల ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాజెక్టుల కింద రైతులు వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలను సాగు చేయవద్దని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. ఆగస్టు తొలి వారంలో కురిసిన వర్షాలతో కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఆ వర్షాలను ఆధారంగా చేసుకుని రైతులు వరి సాగుకు వెళ్లడం సముచితం కాదన్నారు. ఒకసారి తడిపే అవకాశం లభించినా, రెండోసారి నీరు అందించే పరిస్థితి అనిశ్చితంగా మారే అవకాశం ఉందని, ప్రస్తుతం ప్రోత్సహించి రైతులను పంట వేయించి రెండుమూడు నెలల తర్వాత ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ప్రతి కమాండ్ ఏరియాలో ఎంతమేర సాగునీరు అందించగలమో, ఎక్కడ పరిమితులు ఉన్నాయో కలెక్టర్లు, నీటిపారుదల ఇంజినీర్లు, వ్యవసాయ అధికారులు రైతులకు అధికారికంగా తెలియజేయాలని సూచించారు. ప్రధాన జలాశయాల పరిస్థితిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ సూచించారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదంటూ ఆయా కమాండ్ ఏరియాల్లో నేల స్వభావం, నీటి లభ్యత, వ్యవసాయ శాఖ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని ఆయన ఆదేశించారు. వచ్చే వేసవిలో రాష్ట్రంలో ఎలాంటి తాగునీటి సంక్షోభం తలెత్తకుండా ఇప్పటి నుంచే అవసరమైన నీటి నిల్వలను పరిరక్షించాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. స్థానిక లేదా రాజకీయ ఒత్తిళ్లకు లోనై విచక్షణారహితంగా నీటిని విడుదల చేయరాదని హెచ్చరిస్తూ గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్, నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్(జనరల్) ఓ.వి. రమేష్ బాబుతో సమన్వయం చేసుకుని భవిష్యత్తు తాగునీటి అవసరాలకు తప్పనిసరిగా ఎంత నీటిని నిల్వ ఉంచాలనే అంశాన్ని నిర్ణయించాలని ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *