– పాలిమర్ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను సవాళ్లుగా కాకుండా కొత్త అవకాశాలుగా మలచుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సంక్షోభ సమయాల్లో కొత్త సాంకేతికత, నాణ్యత, ఆవిష్కరణలపై పెట్టుబడులు పెట్టే పరిశ్రమలే భవిష్యత్తులో మార్కెట్‌ను శాసిస్తాయన్నారు. పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో హిప్లెక్స్-2026 (Hyderabad International Plastics Expo-2026) ప్లాస్టిక్స్, పాలిమర్స్, ప్రాసెసింగ్ టెక్నాలజీ, యంత్రాల అంతర్జాతీయ ప్రదర్శనను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ప్రదర్శనల్లో తనకు యంత్రాలు మాత్రమే కనిపించవని, వాటి వెనుక వేలాది కుటుంబాల జీవనోపాధి, దేశాభివృద్ధికి కృషి చేస్తున్న పారిశ్రామికవేత్తల సంకల్పం, యువత భవిష్యత్తు కనిపిస్తాయని అన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పెట్టుబడులు, విస్తరణ, ఆవిష్కరణలను కొనసాగిస్తున్న పరిశ్రమల ఆత్మవిశ్వాసమే భారతదేశ బలమని చెప్పారు.
పాలిమర్ రంగం దేశ తయారీ రంగానికి వెన్నెముక
ప్లాస్టిక్స్, పాలిమర్ పరిశ్రమ దేశ తయారీ రంగంలో అత్యంత కీలకమైందని మంత్రి తెలిపారు. గృVŸ నిర్మాణం, తాగునీటి సరఫరా, వ్యవసాయం, వైద్యరంగం, ఔషధ తయారీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆహార ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాల రంగాలకు అవసరమైన ముడి పదార్థాలను ఈ రంగమే అందిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఈ పరిశ్రమ ద్వారా 50 లక్షల మందికి ప్రత్యక్షంగా, కోటి మందికి పైగా పరోక్షంగా ఉపాధి లభిస్తోందని, తెలంగాణలోనే ఈ రంగంపై సుమారు రెండు లక్షల మంది జీవనోపాధి ఆధారపడి ఉందని వివరించారు. పాలిమర్ రంగం అభివృద్ధి చెందితే తయారీ రంగం విస్తరిస్తుందని, దాంతో ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.
మందగమనం తాత్కాలికమే.. పరిశ్రమల ధైర్యం శాశ్వతం
గత ఆర్థిక సంవత్సరంలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, పాలిమర్ ధరల అస్థిరత, రవాణా, విద్యుత్ వ్యయాల పెరుగుదల, కార్మికుల కొరత వంటి అంశాలు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపాయని మంత్రి పేర్కొన్నారు. దేశ జీడీపీ వృద్ధికి సమాంతరంగా అభివృద్ధి చెందే పాలిమర్ రంగం గత ఏడాది కేవలం 2.4 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసిందన్నారు. పీవీసీ పైపులు, హెచ్‌డీపీఈ పైపులు, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల్లో మందగమనం కనిపించినప్పటికీ పరిశ్రమల్లో విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని అన్నారు. హిప్లెక్స్-2026కు లభించిన విశేష స్పందనే దేశ పారిశ్రామిక రంగం భవిష్యత్తుపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. చరిత్ర చెబుతున్నదేమిటంటే సంక్షోభ సమయాల్లోనే గొప్ప పరిశ్రమలు ఆవిర్భవిస్తాయని వ్యాఖ్యానించారు.
సమగ్ర ప్రతిపాదనలు ఇస్తే పరిశీలిస్తాం
పరిశ్రమలతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. ఏఐపీఎంఏ, టాప్మా, ఐపీఐ వంటి పరిశ్రమల సంఘాలు విధానపరమైన అంశాలు, మౌలిక సదుపాయాల అవసరాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర ప్రతిపాదనలు అందిస్తే ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి విధానపరమైన సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. పరిశ్రమలతో నిరంతర సంప్రదింపులే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
పాలిమర్ రంగంలోనూ తెలంగాణకు అగ్రస్థానం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఎదిగిందని మంత్రి పేర్కొన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో సాధించిన విజయాలను పాలిమర్ రంగంలోనూ పునరావృతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్, మెడికల్ ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్ టెక్నాలజీలు, పాలిమర్ కాంపౌండింగ్, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ, ఈవీ విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ తయారీ, బయో ఆధారిత పాలిమర్ల రంగాల్లో తెలంగాణకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
2030 నాటికి 20 లక్షల టన్నుల వినియోగ లక్ష్యం
ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కలిపి సుమారు 13 లక్షల టన్నుల పాలిమర్ వినియోగం ఉందని, ప్రభుత్వం-పరిశ్రమలు సమన్వయంతో పనిచేస్తే 2030 నాటికి ఇది 20 లక్షల టన్నులకుపైగా చేరుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. మౌలిక వసతులు, నైపుణ్య మానవ వనరులు, పారిశ్రామిక వాతావరణం తెలంగాణలో ఉన్నందున దేశంలోనే ప్రముఖ పాలిమర్ తయారీ, ప్రాసెసింగ్ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామిక అభివృద్ధి రెండూ సమాంతరంగా సాగాలని పేర్కొంటూ గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ విధానాలను అనుసరించే పరిశ్రమలకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. పెట్టుబడులు కొనసాగిస్తూ ఉపాధి అవకాశాలను సృష్టించాలని, ప్రతి అడుగులోనూ ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రదర్శనలో 550కు పైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులు, అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించనుండగా భారత్‌తోపాటు విదేశాల నుంచి 50వేలకు పైగా వ్యాపార సందర్శకులు హాజరుకానున్నారు. ఈ ప్రదర్శనలో గుజరాత్‌కు చెందిన సుమారు 160 కంపెనీలు, తెలంగాణ, ఏపీలకు చెందిన 110 ఎగ్జిబిటర్లు, చైనాకు చెందిన దాదాపు 40 కంపెనీలు పాల్గొంటున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో టాప్మా అధ్యక్షుడు నరేంద్ర బద్వా, హిప్లెక్స్ కన్వీనర్ మీలా జయదేవ్, ఏఐపీఎమ్ ఏ ఉపాధ్యక్షుడు వెన్నం అనిల్ రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





