మోదీ హిందూ రాజ్య చక్రవర్తిగా ఊహించుకున్నారు

  • 2019 నుంచి 24 వరకు ఒక సర్కస్ వలే పాలన కొనసాగింది
  • మత తత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజల తీర్పునిచ్చారు
  • నియతృత్వానికి, అరాచకానికి ఒక హద్దు ఉంటుంది
  • గత పదేళ్ళలో ఎన్నో ఇబ్బందులు, వేధింపులకు గురయ్యాను
  • గత ఎన్నికలల్లో మోదీ మైనార్టిలపై విషం చిమ్ముతూ ప్రచారం
  • రచయితలు, ఉద్యమకారులపై అణిచివేత దోరణి
  • ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని ప్రజలు రుజువు చేశారు
  • ఎన్నికల తీర్పు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకాన్ని కలిగించింది
  • ది వైర్ సీనియర్ సంపాదకురాలు అర్ఫా ఖానుమ్ షెర్వాణి
హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జూలై 28 : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత పదేళ్ళ కాలంలో ప్రజా, పేదల, మహిళల, కార్మికుల, రైతుల, మైనార్టిల వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ విద్వాంసాన్ని సృష్టించిందని ది వైర్ సీనియర్ సంపాదకురాలు అర్ఫా ఖానుమ్ షెర్వాణి ఆరోపించారు. రచయితలు, ఉద్యమకారులు, మైనారిటీలపై అణిచివేత దోరణి అవలంబించిందని ఆమె ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విద్యా వంతుల వేదిక(టీవీవీ) ఆధ్వర్యంలో వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య అధ్యక్షత జరిగిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 13వ స్మారకోపన్యాసం సందర్భంగా ‘సమకాలిన భారతీయ సమాజం-ముందున్న నవా ళ్ళు’ అనే అంశంపై ఆమె ప్రసంగిస్తూ 2019 నుంచి 2024 వరకు కేంద్రంలో పాలన ఒక సర్కస్ వలే పాలన కొనసాగిందని, ఇది అత్యంత దారుణమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ తొలుత తనకు తానుగా సమతా ధర్మ పరిరక్షకుడిగా, నూతన హిందూ రాజ్య చక్రవర్తిగా ఉహించుకున్నారని ఆమె ఆరోపించారు.
గడిచిన ఎన్నికల సందర్బంగా మోదీ బడుగు బలహీన వర్గాలు, మైనార్టిలు, ఆదివాసీ వర్గాలపై విషం చిమ్ముతూ ప్రచారం కొనసాగించారని, 400 సీట్లు సాధించాలని పదే, పదేగా ప్రజలకు విజ్ఞప్తి చేశారని ఆమె ఆరోపించారు. అయినప్పటికి ప్రజలు గుత్తాధివత్యానికి, మత తత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య భావనకు తీర్పు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం ఇబ్బందికరమైనదని, ఎంతటి కష్టమైన ప్రజలు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని గత ఎన్నికల్లో రుజువు చేశారని ఆమె తెలిపారు. నియతృత్వ అరాచకానికి ఒక హద్దు ఉంటుందని దానికి ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని ఆమె చెప్పారు.
ఎన్నికల ఫలితాల అనంతరం అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల పాత్రలో తేడా లేనప్పటికీ ప్రజాస్వామ్య పట్ల ఒక కిటికి లాంటి ఆశ చిగురించిందన్నారు. త్వరలో ఈ కిటికి తలుపుగా మారగలదన్న అశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకాన్ని అశను కలిగించి వివిధ వర్గాలకు స్వేచ్ఛా కలిగించేందుకు ఒక మహిళగా తాను కృషి చేస్తుంటే గత పదేళ్ళ కాలంలో ఎన్నో ఇబ్బందులు, వేధింపులకు గురైనానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభలో వేదిక ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, ఉపాధ్యక్షులు రమాదేవి, కొండా నాగేశ్వర్ రావు, ప్రముఖులు చంద్రశేఖర్, జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *