భారత రక్షణ రంగానికి దశ-దిశ చూపిన మహనీయుడు

– అబ్దుల్ కలాంకు బీజేపీ చీఫ్ రామచందర్ రావు నివాళులు
– సాగునీరు, విద్యుత్ కొరతతో రైతుల అరిగోస
– పాలనను గాలికొదిలేసి వోట్ చోరీ డ్రామాలాడుతున్న కాంగ్రెస్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న డాక్టర్ ఏ.పి.జె.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించిన కలాం తన అసాధారణ ప్రతిభాపాటవాలతో భారత రాష్ట్రపతిగా, దేశ రక్షణ రంగంలో అత్యున్నత క్షిపణులు, రాకెట్ వ్యవస్థలను ఆవిష్కరించి జాతిని అగ్రరాజ్యాల సరసన నిలిపారని కొనియాడారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీవోలో పనిచేస్తూ దేశ రక్షణకు అవసరమైన ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాలను అందించారని ఆయన గుర్తు చేశారు. వాజ్‌పేయి నాయకత్వంలో పోఖ్రాన్‌లో విజయవంతంగా నిర్వహించిన అణుపరీక్షలతో యావత్ ప్రపంచం భారతదేశ సత్తాను గుర్తించి ఆశ్చర్యపోయిందన్నారు. అయితే దేశ గౌరవాన్ని పెంచిన అబ్దుల్ కలాంను, అణుపరీక్షలను సైతం కాంగ్రెస్ పార్టీ కించపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు పార్లమెంటు వేదికగా సోనియా గాంధీ, చిదంబరం లాంటి నేతలు కలాంను ‘బాంబ్ మ్యాన్‌’ అంటూ హేళన చేస్తూ మాట్లాడిన రికార్డులు ఉన్నాయన్నారు. నేటి యువత అబ్దుల్ కలాం నిస్వార్థ దేశ భక్తిని ఆదర్శంగా తీసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

దివ్యాంగులకు కేంద్రం చేయూత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాటి కేంద్ర మంత్రివర్గ సమావేశం ఉద్యోగులు, దివ్యాంగుల సంక్షేమం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని రామచందర్ రావు తెలిపారు. రైల్వే శాఖలోని 11.4 లక్షల మంది ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక ఆధారిత బోనస్ కింద రూ.2,009.61 కోట్లు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతేకాక జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద గతంలో 80 శాతంగా ఉన్న వైకల్య అర్హత ప్రమాణాన్ని 40 శాతానికి తగ్గించడం ద్వారా లక్షలాదిమంది దివ్యాంగులకు చేయూతనిచ్చిందని పేర్కొన్నారు. దివ్యాంగుల పట్ల కేంద్ర ప్రభుత్వం కనబరుస్తున్న ఈ సానుకూల దృక్పథానికి ప్రజల తరఫున పధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలన అస్తవ్యస్తంగా మారిందని రామచందర్‌రావు విమర్శించారు. సాగునీరు అందక, విద్యుత్ సరఫరా లేక రైతులు తీవ్ర కష్టాల్లో కూరుకుపోయారన్నారు. బోర్లపై ఆధారపడిన అన్నదాతలకు రోజుకు రెండుమూడు గంటలు కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లోనే కాక పట్టణాల్లోనూ కరెంట్ కోతలు విధిస్తున్నారని, విద్యుత్ సరఫరాపై ప్రభుత్వానికి సరైన ప్రణాళికే లేదని ఆరోపించారు. అధికారులు మాట వినడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 22-ఎ నిషేధిత భూముల జాబితా పేరుతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ నిత్యం అవినీతి దందాలు సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించడం చేతగాక కాంగ్రెస్ నేతలు దిల్లీ వెళ్లి వోట్ చోరీ అంటూ బూటకపు ఆరోపణలు, రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇది వోట్ చోరీ కాదని, కాంగ్రెస్ నాయకులు ‘నామ్ చోరీ’ (పేర్ల దొంగతనం) చేశారని మండిపడ్డారు. రాహుల్, ప్రియాంక, సోనియా.. వీరంతా గాంధీ పేరును అక్రమంగా వాడుకుంటున్న నకిలీ గాంధీలు అని ఎద్దేవా చేశారు. దేశంలో అంతర్గత కల్లోలాలు సృష్టించేందుకు విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయని అమెరికాకు చెందిన ఓ గాయకురాలు చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. నాడు సీఏఏ వ్యతిరేక ఉద్యమం పేరిట షహీన్ బాగ్‌ను నెలరోజులపాటు దిగ్బంధించి దేశద్రోహ శక్తులకు కాంగ్రెస్ వత్తాసు పలికిందని, అమెరికా అధ్యక్షుడి పర్యటన వేళ దేశ పరువు తీసేలా అల్లర్లకు ఆజ్యం పోసిన చరిత్ర వీరిదని ధ్వజమెత్తారు. కాగా, అంతర్జాతీయ ‘వైట్ కేన్ డే’ సందర్భంగా బీజేపీ దివ్యాంగుల సెల్ ఆధ్వర్యంలో పలువురు దృష్టి లోపం ఉన్న దివ్యాంగులకు వైట్ కేన్ స్టిక్స్‌ను రామచందర్ రావు అందజేశారు. కార్యక్రమంలో మైనారిటీ మోర్చా, దివ్యాంగుల సెల్ రాష్ట్ర నాయకులు, పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *