– వేలంలో పాల్గొనక కోయగూడెం, సత్తుపల్లి గనులను కోల్పోయింది
– రెండేళ్లలోనే నైనీ, తాడిచర్ల-2 గనులకు మైనింగ్ అనుమతులు సాధించాం
– బహుళ అంచెల నిఘా వ్యవస్థతో బొగ్గు మాయమయ్యే ప్రసక్తే లేదు
– ఆధారాలు ఉంటే బయటపెట్టాలి, లేకపోతే దుష్ప్రచారం మానాలి
– బీఆర్ఎస్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు ఘాటు కౌంటర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : సింగరేణి సంస్థపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఆ, పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే సింగరేణికి తీరని నష్టం జరిగిందని, ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో ఇంధన సరఫరా ఒప్పందాలు ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏటా సగటున సుమారు 4 మిలియన్ టన్నుల జీ-9 గ్రేడ్ బొగ్గు సరఫరా అయిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి 25 మిలియన్ టన్నులకుపైగా బొగ్గు సరఫరా చేయగా, అందులో జీ-9 గ్రేడ్ బొగ్గు 1.20 మిలియన్ టన్నులు మాత్రమేనని, అందులోనూ 0.52 మిలియన్ టన్నులు తెలంగాణ జెన్‌కోకే వెళ్ళింద ని చెప్పారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు ఏటా 14 మిలియన్ టన్నుల జీ-9 బొగ్గు సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, దానికి తగ్గట్టుగా కొత్త గనులను ఎందుకు తెచ్చి ఉత్పత్తిని పెంచలేకపోయిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో సింగరేణిని పాల్గొననివ్వకపోవడం వల్లే కీలకమైన కోయగూడెం-3, సత్తుపల్లి-3 బ్లాకులు దక్కలేదని, ఫలితంగా ఏటా 10 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవకాశాన్ని సంస్థ కోల్పోయిందన్నారు. అలాగే 14 గనులు మూతపడటంతో మరో 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోవడం వాస్తవం కాదా అని నిలదీశారు.
రెండేళ్లలోనే నైనీ, తాడిచర్ల-2 అనుమతులు సాధించాం
తమ ప్రజా ప్రభుత్వం వచ్చిన కేవలం రెండేళ్లలోనే నైనీ బొగ్గు గనికి అనుమతులు సాధించి ఉత్పత్తికి మార్గం సుగమం చేశామని శ్రీధర్‌బాబు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో నైనీ వైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. 2013లో యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన తాడిచర్ల బ్లాక్-2కు మైనింగ్ అనుమతులు తెచ్చామని, వేలం ద్వారా మణుగూరు పీకే ఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణికి దక్కించామని వివరించారు. వీటన్నింటి ద్వారా రానున్న రోజుల్లో సంస్థ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు.
బహుళ అంచెల నిఘా వ్యవస్థ – బొగ్గు మాయం అసాధ్యం
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, లోడింగ్, రవాణా, తూకం నుంచి పంపిణీ వరకు ప్రతీ దశలోనూ సాంకేతిక ఆధారిత బహుళ అంచెల నిఘా వ్యవస్థ అమలులో ఉందని మంత్రి తెలిపారు. ఎస్ఏపీ/ఈఆర్పీ అనుసంధానం, జీపీఎస్/జీపీఆర్ఎస్ ద్వారా వాహనాల ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, ఎలక్ట్రానిక్ తూకం, ఆకస్మిక తనిఖీలు, బొగ్గు చోరీ నిరోధక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. ప్రతీ టన్ను బొగ్గుకు పక్కా లెక్క ఉన్న ఈ వ్యవస్థలో బొగ్గు మాయమయ్యే అవకాశమే లేదన్నారు. బీఆర్ఎస్ నాయకుల వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, లేకపోతే సింగరేణి కార్మికులు, అధికారుల నిజాయతీపై బురద చల్లడం మానాలని శ్రీధర్‌బాబు హెచ్చరించారు.
సంస్థ ప్రయోజనం కోసమే సైట్ విజిట్ నిబంధన
ఓవర్ బర్డెన్ తొలగింపు టెండర్లలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధనను పారదర్శకత కోసం, సంస్థ శ్రేయస్సు కోసమే ప్రవేశపెట్టామని మంత్రి సమర్థించుకున్నారు. గతంలో కాంట్రాక్టర్లు క్షేత్రస్థాయి భౌగోళిక పరిస్థితులు చూడకుండానే టెండర్లు వేసి, తర్వాత పనులు చేయలేక మధ్యలోనే వదిలేసి వెళ్లేవారని, దానివల్ల సింగరేణికే నష్టం జరిగేదని గుర్తుచేశారు. ఈ నిబంధన వల్ల సమర్థులైన కాంట్రాక్టర్లు ఎలాంటి అవాంతరాలు లేకుండా పనులు పూర్తిచేస్తున్నారని తెలిపారు. జీఎండీసీ-గుజరాత్, జీఐపీసీఎల్, ఎన్ఎండీసీ, కొన్ని సోలార్ ప్రాజెక్టులు,ఈపీసీ కాంట్రాక్టుల్లోనూ, అలాగే 2018, 2021, 2023లో గత ప్రభుత్వ హయాంలోనూ సీఎంపీడీఐ సలహా మేరకు ఈ నిబంధన అమల్లో ఉందని, అప్పుడు సరైనదైన నిబంధన ఇప్పుడు తప్పెలా అవుతుందని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.
సింగరేణిని ఏటీఎమ్‌లా వాడుకున్నది బీఆర్ఎస్సే
పదేళ్ల పాలనలో బీఆర్ ఎస్ సింగరేణిని ఏటీఎమ్‌లా వాడుకున్నదని, విద్యుత్ సంస్థల పేరుతో రూ.వేల కోట్ల బకాయిలు పెట్టి సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టిందని శ్రీధర్‌బాబు విమర్శించారు. కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ వరకు రూ.లక్ష కోట్ల కుంభకోణాలకు పాల్పడిన వారు అవినీతి గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. సింగరేణి తెలంగాణ ప్రజల గుండెకాయని, దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బొగ్గు ఉత్పత్తితో పాటు ఇతర కీలక ఖనిజాలు, థర్మల్, సౌర విద్యుత్ రంగాల్లో సింగరేణిని విస్తరించి, సంస్థ సంపదను పెంచి ప్రజలకు పంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





