– రానున్న 15-20 రోజులు పంటలకు కీలకం
– తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలు
– క్షేత్రస్థాయి పర్యటనలో సీఎస్ సంజయ్ సమీక్ష
సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, నీటి లభ్యతపై దాని ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు క్షేత్రస్థాయి పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి లభ్యతను పరిశీలిస్తూ హైదరాబాద్తోపాటు సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, తాగునీటి అవసరాలకు ముందస్తు కార్యాచరణను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న పరిస్థితుల్లో నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, రానున్న 15 రోజులకు నీటి లభ్యతను అంచనా వేసుకుని తగిన నిర్వహణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
రానున్న 15-20 రోజులు పంటలకు కీలకం
ఫిబ్రవరిలో సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఉష్ణోగ్రతలు సుమారు 2-3 డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయని, ఈ కాలానికి ఇది అసాధారణ పరిస్థితి అని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఈ వాతావరణ మార్పులు పంటలపై చూపే ప్రభావాన్ని సంబంధిత శాఖలు నిశితంగా పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా రానున్న 15-20 రోజులు పంటలకు అత్యంత కీలకమైనందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన సూచనలు అందించాలని ఆదేశించారు.
వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా
వ్యవసాయ అవసరాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎస్ తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను స్వయంగా అంచనా వేయడంతోపాటు, రైతులు, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకోవాలని, ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. సింగూర్ డ్యాం సందర్శన అనంతరం సంజయ్ జాజు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, ఫిబ్రవరి వరకు ఇది పీక్ స్థాయిలో ఉంటుందని తెలిపారు. దీని కారణంగా ఈసారి రుతుపవనాలు పూర్తిగా దెబ్బతిన్నవని, ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా సమీక్షించారని తెలిపారు. సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో కూడా దీనిపై విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు. రాబోయే కాలంలో తాగునీటి పరిస్థితి, పంటల స్థితిగతులను సమీక్షించేందుకే ఈ పర్యటన అని చెప్పారు. రాబోయే 15-20 రోజుల పాటు ప్రస్తుతం ఉన్న పంటలను రక్షించుకోవడానికి అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. భూగర్భ జల మట్టాలు బాగా తగ్గిపోవడంతో విద్యుత్ ఇచ్చినప్పటికీ నీరు లభించని పరిస్థితి ఉంటుందని, అందువల్ల తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాకు నోడల్ అధికారులను పంపిస్తున్నామని, కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి రాబోయే పరిస్థితులకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారని తెలిపారు. సింగూరు ప్రాజెక్టుకు చేరుకున్న ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ ఇతర అధికారులు స్వాగతం పలికారు. సీఎస్ వెంట ఇతర రాష్ట్రస్థాయి ఆధికారులు ఉన్నారు .
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





