్న3న సంబురాలు చేసుకుందాం..ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్ భరోసా
్నఅధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్ ధీమా
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్1: తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నేడు తనను కలిసిన నేతలతో పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై చర్చించిన గులాబీ దళపతి.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పరేషాన్ కావొద్దని.. బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ విజయం సాధించబోతుందని పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో పలువురు నేతలు కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సీఎం వారితో మాట్లాడారు. ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందవద్దని.. రాష్ట్రాన్ని పాలించబోయేది బీఆర్‌ఎస్ పార్టీయేనని చెప్పినట్లు సమాచారం. ఓపిక పడితే 3వ తేదీన సంబురాలు చేసుకుందామని పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.