రుచుల రాజధాని హైదరాబాద్‌కు జాతీయ గుర్తింపు

– నేషనల్ కలినరీ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌కు అవార్డు
– కేంద్ర మంత్రి ద్వారా అవార్డు అందుకున్న మంత్రి జూపల్లి

గోవా, జూన్ 15 : దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో తెలంగాణ మరో అరుదైన ఘనతను సాధించింది. తనదైన ప్రత్యేక వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం తాజాగా నేషనల్ కలినరీ డెస్టినేషన్(ఉత్తమ పాకశాస్త్ర గమ్యస్థానం) అవార్డును కైవసం చేసుకుంది. గోవా వేదికగా సోమవారం జరిగిన ఇండియా టుడే టూరిజం సదస్సులో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించారు .ఈ అవార్డును పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఇండియా టుడే గ్రూప్ చైర్మన్ అండ్ ఎడిటర్-ఇన్-చీఫ్ అరుణ్ పూరీ, ఇండియా టుడే గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్(పబ్లిషింగ్) రాజ్ చెంగప్ప, దేశంలోని వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులు, విధాన రూపకర్తలు, పర్యాటక రంగ నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ హైదరాబాద్‌కు లభించిన ఈ గౌరవం నగరానికి ఉన్న గొప్ప ఆహార వారసత్వానికి, రాష్ట్ర పర్యాటక రంగం సాధిస్తున్న ప్రగతికి ప్రతీక అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్, తెలంగాణ సంప్రదాయ వంటకాలు దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ గుర్తింపు తెలంగాణను వారసత్వ సంపద, సంస్కృతి, ఆతిథ్య మర్యాదలు, సంప్రదాయ ఆహార సంస్కృతికి నిలయంగా ఉన్న ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా మరోసారి నిలబెట్టిందన్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ పర్యాటక కేంద్రాలు, ఎకో-టూరిజం సర్క్యూట్లు, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు, అడ్వెంచర్ టూరిజం గమ్యస్థానాలు, సాంస్కృతిక ఆకర్షణలను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. పర్యాటక మౌలిక సదుపాయాల బలోపేతం, మెరుగైన అనుసంధానం, సందర్శకులకు మరింత మెరుగైన అనుభూతి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ అవార్డు నగర ఖ్యాతిని మరింత పెంచిందన్నారు. దేశంలోని ప్రముఖ ఆహార పర్యాటక గమ్యస్థానాల్లో హైదరాబాద్ ఒకటిగా తన ప్రత్యేక గుర్తింపును మరింత బలపరుచుకుందని చెప్పారు. ఈ అవార్డును రాష్ట్ర ప్రజలకు, పర్యాటక, ఆతిథ్య రంగాలకు చెందిన భాగస్వాములందరికీ అంకితం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *