మనిషి మనిషికీ మధ్య భావాల సేతువును నిర్మిస్తున్న నిరంతర శ్రామికుడు కవి. శబ్దాల శిలల్లోని తన భావాల కలలకు ప్రతిరూపంగా మనిషిని జాగ్రత్తగా చెక్కే పనిలో నిమగ్నమైన అతనొక విశ్వశిల్పి. ప్రశ్నలు వేలకు వేల సంఖ్యలో ఉన్నా సమాధానం ఒక్కటేనని, జీవనాలు వేరువేరైనా జీవితం మాత్రం ఒక్కటేనన్న జీవనకాల స్పష్టతను సాధించిన కవి కవిత్వం నమ్మకమై మెరిసి శాశ్వతమై నిలిచిపోతుంది. ప్రజాకవిత్వం రాయడమే కోరికగా, సామాజికతే లక్ష్యంగా, ప్రజలనే ఈస్తటిక్స్‌గా నిర్ణయించుకుని హృదయదఘ్నంగా డాక్టర్ కాంచనపల్లి రాసిన కవిత్వం పెంకుటిల్లు అయ్యింది. కవిని వెంటాడిన దగ్ధవేదనకు కొలమానమైన కవితలెన్నో ఈ సంపుటిలో ఉన్నాయి. అనేకానేక ప్రశ్నల పరంపరలో సమాధానాలకు అందని మానవ సమాజాల అన్వేషణ కవితలలో ప్రస్పుటంగా వెల్లడైంది. చనిపోయి బతుకుతాడు నుండి పెంకుటిల్లు వరకు ఉన్న దాదాపు 50 కవితలలో కవి తండ్లాట అభివ్యక్తమైంది.
కవి అనేవాడు చచ్చి కూడా బతుకుతాడని, మరణం తీగకు వేలాడే జీవితంలోనూ అవనత శిరస్సుతో ఉండి కూడా నెత్తురు జెండాగా మొలుస్తాడన్న విశ్వాసాన్ని ప్రకటించారు. మెదడులో ప్రపంచాన్ని బంధించి మహావృక్షాలను సైతం నిశ్శబ్దం చేసి ఈడ్చగలిగే శక్తి ఉన్నవాడు ఏ నాటికైనా గెలిచే వాడే అవుతారన్నారు. అతను తనలో ఆకాశాలు విస్తరించాయని/ నదులు ప్రవహిస్తాయని చెప్పుకోడని, నడవడానికి తను ఒక పిల్ల బాటైనా చాలునని ఆకాంక్షిస్తాడని చెప్పారు. కమిలిపోయిన మనసు ముక్కల్ని కనబడనివ్వని అతను చిరునవ్వుకు చిరునామాగా మారాడని అనడం ఆలోచింపజేసే మానవీయ కవితా సందర్భం.
కొన్ని రిటైర్డ్ పక్షులు ఒక మూల కూర్చుని స్మృతుల పొట్లాలతో వేరుశనగలు పంచుతుంటాయని చెబుతూ వృద్ధాప్యానికి చేరుకుని బతుకు ప్రయాణంలో తగిలిన గాయాలకు లేపనం పూసుకునేందుకు విశ్రాంతి తీరాలు సాయంత్రపు పార్కులన్న అభివ్యక్తి మనస్సును తాకుతుంది. ఆ వాలు కుర్చీ ఎన్ని తరాల సహనాన్ని తనలో ఇముడ్చుకుందోనని చెబుతూ దాని నవయౌవన లావణ్యం క్రమంగా మాయమై కాళ్ళు విరిగి ముడుచుకుని అటకెక్కిందని చెప్పారు. మనసు ముంజేయిగా మారితే మెదడును కమ్మిన నీలిమబ్బు వర్షాలను సముద్రిస్తుందన్నారు. మానవాళి నవ వికాసం చెందితే సమతా స్వప్నం కనులు తెరుస్తుందన్న ధీమానిచ్చారు. యుద్ధం లేని విశ్వమానవతను కవిగా కలగన్నారు. దీర్ఘ నిద్ర నుండి అతడు కనుతెరచిన క్షణమే మహా ప్రస్థానానికి తొలి అడుగని భావించారు. ముక్కలుగా చిరిగినా అదృశ్య రక్తరేఖల విన్యాసాల జడికి తట్టుకున్న కాగితం ఆత్మీయతను వెదజల్లే చల్లని చేయిగా మారిందని చెప్పారు. జ్ఞానపీఠమెక్కి విశ్వంభరమంత కీర్తినందుకున్న హనుమాజీపేటను స్మరించారు. ప్రాణం పుష్పించడాన్ని సహజ ప్రక్రియగా భావించారు. ఒకప్పుడు జ్ఞానదీపపు పురిటిల్లు లాంటి పెద్దబడి ఇప్పుడు నిట్టూర్పుతో వెలవెలబోతున్నదని వేదన చెందారు. నాలుగు గోడల ఆ గది నిశ్శబ్ద కవనాలకు కారా?నా, జీవన సాఫల్యతకు ఒకానొక సౌందర్య పురస్కారమని అభివర్ణించారు. సంతోష విషాదాల వర్తమాన ప్రపంచం విచిత్ర దర్శిని కనుక నువ్వు అసలే ముడుచుకుపోవద్దని మనిషికి సూచించారు. నిన్ను కవిత్వం చేసుడంటే/ నన్ను నేను వెతుక్కునుడే అని మానవ పరిణామానికి మూల ధాతువై నిలబడ్డ కుదురును గురించి చెప్పారు.
కన్నోళ్ల శేషజీవనాన్ని పరీక్షలు తప్పామన్న కారణంగా ఆత్మహత్యలకు పాల్పడి కన్నీళ్ళమయం చేయకుండా బతికి సాధించాలని విద్యార్థులకు హితవు పలికారు. బాల ప్రపంచం ముందు అమోఘ సామ్రాజ్యాధిపత్యాలు పగటి చందమామలవుతాయని ప్రకటించారు. వట్టికోటను సామాజిక తెలంగాణ స్వప్నమన్నారు. చూపుల దీపాల్లో ఆరిపోయిన చమురు ఆవేదనకు నాన్నా, నేను వెళ్ళక తప్పదు కవిత ప్రత్యక్ష సాక్ష్యమైంది. మనిషిని కాపాడి నడిచే కథకు నాయకుణ్ణి చెయ్యమన్నారు. విసిరే కత్తి అంచు మీద నిలబడి కూడా ఆకుపచ్చగా జీవించడమే ధైర్యమని తెలిపారు. నడిచే దీపమే మనిషవ్వాలని ఆశపడ్డారు. నిప్పుల చెకుముడి రాజుకుంటూనే ఉంటుందని, గమ్యం చేరే వరకు జాగ్రత్త అవసరమని చెప్పారు. ఇంటిని కాచే తోటమాలి ప్రేమ సౌరభపు పాటను వినాలనుకున్నారు. మృత్యువు పడగెత్తినా మొక్కవోని ధైర్యంతో అతను పారుతున్న నదిలా తప్పక తిరిగి వస్తాడన్న ధీరతను ప్రదర్శించారు. దారితప్పి బిక్క చచ్చిపోతున్న వాక్యాన్ని ఆవరించిన దైన్యాన్ని గురించి చెప్పారు. కాలిపోతున్న విలువల మధ్య మానవతా చింతన జీవన వాక్యమై ఒదిగిపోవాలన్నారు. రేపటి విజయాన్ని వెలిగే దీపంలో చూడమన్నారు. జీవితమే ఒక నిట్టూర్పయ్యిందని తెలిపారు. అనివార్యంగా అనాగరికతలను ఒక్కోసారి మోయాల్సి వస్తుందని చెప్పారు. అసూయల చీకటి కోణం ఒక్క చిరునవ్వుతో విస్మరణ పాలౌతుందని తెలిపారు. ఎగిరిపోయే చిలకల్ని ఒక్కచోట చేర్చేందుకు కొత్త పద్యం చెప్పి యుద్ధ శంఖం ఊదారు. ఆమె అతని దుఃఖ ప్రతిబింబమై నిలిచి మండుతూనే ఉందన్నారు.
దుఃఖం ఇంకా మిగిలే ఉన్నప్పుడు యుద్ధం ఎలాగూ తప్పదన్నారు. మానవుడే ఆఖరికి విజేత అవుతాడని చెప్పారు. ఒంటరితనం కమ్ముకున్న సహనం పూవులు రాలిపోయిన జీవన సంధ్యలో తమ స్థానాన్ని వెతుక్కుంటున్నాయన్నారు. చావు పాదు నుండి మొలచిన కొత్త జీవితాన్ని కలగనమన్నారు. అక్షరమై జీవించడమే గొప్ప వరమని చెప్పారు. మానవుని జీవితం గుండెదీపమై వెలుగులు ప్రసరించాలన్నారు. కవిత్వం తన వెంటే ఉండగా ఇంకేదీ వద్దని చెప్పారు. మనోదేహం మాటల రాళ్ళతో అనునిత్యం గాయపడుతుందన్నారు. అమ్మ ఒడిలాంటి ఎంతో ఇష్టమైన తన ఇంటిని అర్థాంతరంగా ఎలా ఖాళీ చేయాలని వేదన చెందారు. చీపురుతో భూమిని ఊడుస్తుంటే హృదయం కూడా శుభ్రమవుతుందన్నారు. తల్లి కోడి లాంటి పెంకుటిల్లు తమను రెక్కల్లో దాచుకుని భద్రంగా కాపాడిరదన్నారు. అప్పటి ప్రాభవాన్ని కోల్పోగా అరుదైన ఆ జ్ఞాపకాలను మననం చేసుకొని వేదన చెందుతూ కదలని నది లాంటి పెంకుటిల్లు అప్పటి తన బాల్యాన్ని ప్రతిఫలిస్తూ ధీటలు బారి కూలిపోతున్న కలల అద్దమై వెలవెలబోతున్నదని చెప్పారు. అగ్ని పర్వతాలు రగులుతున్నా మౌనంగా, నిర్నిద్రంగా మహత్తర క్షణాల కోసం తదేకంగా నిరీక్షిస్తున్న కవి హృదయాంతరంగ జడులే ఈ కవితలు.
-డా.తిరునగరి శ్రీనివాస్
9441464764