- హామీలు అమలు చేస్తున్నాం…
- ఇందిరమ్మ కమిటీలతో ప్రజల చెంతకు సంక్షేమ పథకాలు
- చీకట్లో కలిసి.. పొద్దునే కొట్లాడుకున్నట్లు మోదీ, కేడీ నాటకాలు…
- జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటైనా గెలవాలని కేటీఆర్‌కు సవాల్
ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పేరు చెబితే మూడు సీట్లు రాకపోతుండే అని కేటీఆర్ అంటున్నాడని,
తాను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షునిగా ఉన్నానని, కేటీఆర్‌కు చేతనయితే తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాము అల్లాటప్పగాళ్లం కాదని, అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చొలేదని, కింద నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలుతిని, అక్రమ కేసులు ఎదుర్కొని చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో మగ్గి, భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి కేటీఆర్‌ను, ఆయన అయ్యను, ఆయన బావను బొందపెట్టి ఆ కుర్చీలో కూర్చున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ తనకు ఈనాం కింద రాలేదని, అయ్య పేరుతో రాలేదన్నారు. నల్లమల అడవి నుంచి తొక్కుక్కుంటూ తొక్కుకుంటూ వచ్చి కేటీఆర్ వంటి వాడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో తనను కార్యకర్తలు కూర్చొబెట్టారని, ఈ రోజు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నానంటే అది కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, వారి పోరాట ఫలితమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలిచినంత కాలం, తనను భుజానమోసినంత కాలం కేటీఆర్, ఆయన తండ్రీ వచ్చినా ఈ కుర్చీని తాకలేరని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ఏనాడైనా ఉద్యోగాలపై ఆలోచించారా..?
తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నియామకాలు, నిధులు వస్తాయని కేసీఆర్ ప్రచారం చేశారని, కానీ నీళ్లు పేరుతో నిధుల దోపిడి జరిగిందని, కొడుకు, అల్లుడు, బిడ్డకు ఉద్యోగాలు వచ్చాయి…సడ్డకుని కొడుకుకు రాజ్యసభ సభ్యత్వం వచ్చిందే తప్ప లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము ఇచ్చిన మాట ప్రకారం.. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోపే 25 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, అది చూసి ఓర్వలేని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత రావు, సంతోష్‌రావు, దయాకర్‌రావు, వినోద్‌రావు అంతా కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీకి శాపనార్దాలు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోళ్ల బిడ్డలకు తాము వేలాది ఉద్యోగాలు ఇస్తే వారి కడుపు మండుతుందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డను నిజామాబాద్‌లో ఓడిస్తే ఆరు నెలలు తిరగకుండానే ఎమ్మెల్సీ ఇచ్చాడని, ఆయన చుట్టం వినోద్‌రావును కరీంనగర్‌లో ప్రజలు ఓడిస్తే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుని పదవి ఇచ్చారన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు బండకేసి కొట్టినా ఉద్యోగాలు ఇచ్చారని, పేదలు, దళితులు, బలహీనవర్గాలు, ఆదివాసీలు, మైనారిటీల బిడ్డల తల్లితండ్రులు ఊళ్లలో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి అశోక్‌నగర్ చౌరస్తాలోనో, దిల్‌సుఖ్ నగర్ చౌరస్తాలోనో కోచింగ్ సెంటర్లలో చదివిస్తే పెళ్లిళ్లు కాక ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతుంటే ఏ ఒక్కరోజైనా కేసీఆర్ ఆలోచించారా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
సోనియమ్మ మాట శిలాశాసనం…
సోనియమ్మ మాట శిలాశాసనమని, రక్తం ధారబోసైనా ఆమె ఇచ్చిన గ్యారంటీలను తమ మంత్రివర్గం అమలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆడ బిడ్డలకు కట్టెల పొయ్యి కష్టాలు ఉండొద్దనే నాడు దీపం పథకం ద్వరా సోనియామ్మ సిలిండర్లు ఇచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నరేంద్రమోదీ, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1200 చేసి దోచుకుంటుంటే చూసిన సోనియమ్మ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.500కే సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి అన్నారు. సోనియమ్మ హామీ మేరకు ఆమె బిడ్డ ప్రియాంక గాంధీ సమక్షంలో ఆ హామీని అమలు చేయాలనకున్నామని, కానీ మహబూబ్‌నగర్ శాసనమండలి ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో సచివాలయంలో దానిని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. రూ.500 సిలెండర్ ఇస్తున్నామని, ఇప్పటికే 40 లక్షల మంది అర్హులయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరికైనా రాకుంటే మండల అధికారుల దగ్గకు వెళ్లి అడగాలని, ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే గుజరాత్ మోడల్
తమది గుజరాత్ మోడల్ అని బీజేపీ వాళ్లు అంటున్నారని, ఊళ్లలో ఉన్న వారిని తగలబెట్టడమా? ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడిదారులను బెదిరించి మీ పాలిత రాష్ట్రాలకు తీసుకుపోవడమా ? రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఒక్కటైనా ఇవ్వకపోవడమా..? రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని చెప్పి ఆందోళన చేస్తున్న రైతులను కాల్చి చంపడమేనా గుజరాత్ మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అడిగే వాళ్లు లేరు కదా అని బెదిరించి రుబాబు చేసి దబాయించి బతకాలని బీజేపీ వాళ్ల అనుకుంటున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. మోడీని ప్రధానమంత్రిని చేయాలని బీజేపీ నాయకులు అడుగుతున్నారని, పదేళ్లుగా ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారని, పదేళ్లలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల చొప్పున ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి కదా ఎందుకు రాలేదని, రైతుల ఆదాయం రెట్టింపు ఎందుకు కాలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వడ్లు, కందులు కొనేవాడే లేడని, రైతులు ఎట్లా బతకాలన్నారు. గుజరాత్ మోడల్ అంటే పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడం, ఎన్నికైన వారిని కిందపడగొట్టడం, మాట వినని వారిని జైళ్లలో పెట్టడమేనని ముఖ్యమంత్రి విమర్శించారు. తమ పార్టీ మీటింగ్ ఉందంటే ఎన్ ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, ఇతర విభాగాల నాయకులను తొలుత వెళ్లి ఏర్పాట్లు చేయమని చెబుతామని, మోడీ ఐటీ, సీబీఐ, ఈడీ వాళ్లను పంపి అవతలి పార్టీలో నాయకులపై కేసులు పెడితే వారిన తర్వాత తమ పార్టీలో చేర్చుకుంటామంటాడని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుల పెద్ద మోది..
ప్రాణహిత -చేవెళ్లను కేసీఆర్ పడావు పెట్టారని, దాన్ని పూర్తిచేయాలని మోడీ కేసీఆర్ కు ఎప్పుడైనా చెప్పారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కేడీ.. మోడీ అంటకాగారని, అల్లం బెల్లంలా అలాయ్ బలాయ్ చేసుకొని ఇప్పుడు తామిద్దరం వేరే.. తమకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతున్నారని… దానిని మనం నమ్మాలా అని ముఖ్యమంత్రి అన్నారు. వారి మధ్య పొత్తు, చీకటి ఒప్పందం లేకుంటే కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ మోడీని ఎందుకు అడిగారని, ఈ విషయం మోడీనే చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కేసీఆర్‌కు ఇంటి పెద్ద, కుల పెద్ద నరేంద్ర మోడీనే అని, ఇంట్లో పంచాయితీ కుల పెద్దకే కదా చెప్పుకునేదని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్‌ను తట్టుకునేందుకు చీకట్లో కలిసి ఉండాలి.. పొద్దుటే కొట్లాడినట్లు ఉండాలని మోడీ, కేడీ నాటకం ఆడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలియదా..? గుజరాత్ నుంచి వచ్చి ఆయన సోది చెబితే వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
చేవెళ్ల అభివృద్ధి బాధ్యత తీసుకుంటా..?
చేవెళ్లలో భాజపాలో ఒక నాయకుడున్నాడని, మనిషి మంచోడే కానీ పార్టీ చక్కనైనది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయనకు వేసిన వోటు దండగని, కవితను జైలులో వేస్తారని తాము ఆ పార్టీలోకి పోయామని, అదేం జరగలేదని ఆ పెద్దమనిషే చెప్పారన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ ఎవరిని అభ్యర్థిగా నిలిపినా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతంలోకి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని, చేవెళ్ల అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.