కష్టాల సహారా
ఒడిదుడుకుల ఇసుక తుఫానుల్ని
ఆత్మస్థైర్యపు అడుగులతో
ఎదుర్కొంటూ
నీ జీవితం
ఈ దేశపు పహారా
అయిపోయింది…
అనుక్షణం
తొలిచేస్తున్నా ఉద్విగ్నం
శత్రువు పదఘట్టనలపైనే
చేస్తూ దృష్టిని నిమగ్నం
నీ హృదయం
ఆత్మవిశ్వాసపు పతాకమై
రెపరెపలాడుతుంటుంది…
గడ్డకట్టిన మంచులో
నీ జీవన సమరాన్ని తిలకిస్తూ
పగలూ, రాత్రీ.. అన్ని కాలాలూ
నిన్ను మనసారా హత్తుకుంటూ
దేశభక్తితో
పులకించిపోతుంటాయి…
నీ త్యాగనిరతి హారతి
వెలుగుల ముందు
వెన్నెల తెల్లబోతుంటుంది…
జాతి కోసం
నీ ఆశయాల ఫీట్లు
చూస్తూ తరిస్తుంటాయి
నీ నేస్తాలైన చెట్లు…
నీ ఆలోచనలు
కదనమధువనంలో
విరబూసే పుష్పాలు…
నువ్వు ఆమనివై
ఈ దేశపు రక్షణ చెట్టుకు
పచ్చదనాన్నిజి
పరుస్తూనే వుంటావు…
సైనికుడా! నీకు వందనం
నిన్ను చూసుకుంటూ
అనుదినం మురిసిపోతుంటుంది
భరతమాత వదనం…
– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర 9177732414 )