సింగరేణి ఉద్యోగులకు న్యాయం చేస్తాం

ఇంటి సమస్యలు తక్షణం తీరుస్తాం
సంఘం ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీదర్‌ బాబు హావిూ

పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు కోరారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్‌ బాబు పాల్గొన్నారు. ఆర్జీ 3 పరిధిలోని ఏఎల్‌పీ, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గు గనుల్లో కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరుపున మంత్రి శ్రీధర్‌ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ..నూతన అండర్‌ గ్రౌండ్‌ బొగ్గు గనులను ఏర్పాటు చేస్తామన్నారు. డిపెండెంట్‌ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిస్కారానికి హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని శ్రీధర్‌ బాబు ప్రకటించారు.

కార్మికుల గుండెల్లో కాంగ్రెస్‌ పార్టీ ఉందని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించారని మంత్రి వ్యాఖ్యానించారు. సింగరేణిలో టీబీజీకేఎస్‌ మాయమాటలు చెప్పి రెండు పర్యాయాలు గెలిచిందని, బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండి మోసపోయి గోసపడి ఈరోజు విముక్తి అయ్యారన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం కృషి చేస్తానన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో 15 వేల మంది ఉద్యోగాల తగ్గింపు జరిగిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను చేపట్టే కార్యక్రమం ప్రారంభించిందని చెప్పారు.ఇన్‌కంటాక్స్‌ మినహాయింపు కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకోబోతుందని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కారుణ్య నియామకాలు న్యాయంగా జరగలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కారుణ్య నియామకాల కోసం ఉద్యోగానికి లక్షలు చేతులు మారాయని, కారుణ్య నియామకాల కోసం ఖర్చు పెట్టుకుండా ఇప్పించే బాధ్యత తనదని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page