మహాగ్రహంపై నీటి నిక్షేపాలు
మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న ఒక ‘గ్రహం’లో నీటి నిక్షేపాలు నెలకొని ఉన్నట్టు ఐరోపా అమెరికా అంతరిక్ష పరిశోధక శాస్తవ్రేత్తలు ధ్రువీకరించడం సరికొత్త ఆవిష్కరణ. మన భూమిని పోలిన ఈ ‘మహాభూమి’ సూపర్ ఎర్త్ మన భూగోళానికి నూట పదకొండు కాంతి సంవత్సరాల దూరంలో నెలకొని ఉందట! అంటే మన భూమికి ఆరువందల యాబయి లక్షల కోట్ల మైళ్ల దూరంలో ఈ ‘జల సహిత’ గ్రహం నెలకొని ఉందన్నది లండన్ విశ్వవిద్యాలయ కళాశాల శాస్త్రవేత్తల బృందం వారు వెల్లడించిన వాస్తవం. ‘కె2-18బి’ అని శాస్త్రవేత్తలు నామకరణం చేసిన ఈ గ్రహం మన భూగోళం కంటె రెండు రెట్లు పెద్దది, మన భూమి ద్రవ్యరాశి కంటె ఎనిమిది రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న ఈ ‘మహాగ్రహం’ భూమికంటె నాలుగు రెట్లు పెద్దది. 2015లో మొదటిసారి గుర్తించిన ఈ గ్రహం మన ‘బ్రహ్మాండం’.. పాలపుంత.. మిల్కీ వేలోని ‘సింహ’రాశి.. లియో కాన్‌స్టిలేషన్ లో నెలకొని ఉన్న ఒక ‘సూర్యుని’ చుట్టూ తిరుగుతోందట! ఈ గ్రహాన్ని గుర్తించిన నాలుగేళ్ల తరువాత ఈ గ్రహంలో నీరు, వాతావరణం, మానవ జీవన యాత్రకు అనుగుణమైన పరిసరాలు ఉన్నట్టు వెల్లడి కావడం అంతరిక్ష పరిశోధనలో ప్రస్ఫుటించిన మరో చారిత్రక అద్భుతం. ఇలా జీవజాలానికి అస్తిత్వమైన నీరు, ఉష్ణోగ్రత, పరిసరాలు బయటపడినాయి కనుక ఈ ‘గ్రహం’పై మానవులను పోలిన జీవులు మనుగడ సాగిస్తుండడం సంభవం కావొచ్చు, కాకపోవొచ్చు కూడ! ఆ దిశలో కూడ పరిశోధన జరుగవలసి ఉంది.
మన దేశం సహా వివిధ దేశాలవారు సాగిస్తున్న అంతరిక్ష పరిశోధనకు కేంద్ర బిందువు భూమిమీద నివసిస్తున్న మానవుడు. అసంఖ్యాకమైన ‘బ్రహ్మాండ’ సముదాయమైన విశ్వవ్యవస్థలో ఎన్నిచోట్ల ఎన్ని ‘గ్రహాల’మీద జీవజాలం మనుగడ సాగిస్తోంది? అన్న సందేహం కలగాలి. ఆ వైపుగా కూడ పరిశోధన జరగాలి! ఆ ‘జీవజాలం’ స్వరూప స్వభావాలు శరీర నిర్మాణం బౌద్ధిక మానసిక వ్యవస్థ జీవన విధానం సంస్కృతి ఆహార విహారాలు లైంగిక సంబంధాలు మన భూగోళంపై నివసిస్తున్న ‘మానవుల’ వాటితో పోలి ఉండనక్కరలేదు, ఉండవు కూడ! ఈ వాస్తవాన్ని భారతీయ ఖగోళ విజ్ఞానవేత్తలు యుగయుగాలుగా గుర్తించారు. ఈ గుర్తింపు యుగాలకు పూర్వం ‘సూర్య సిద్ధాంతం’ అన్న ఖగోళ విజ్ఞాన సమాహారం ఆవిష్కృతమైన నాటిది. భూమండల వాసులు సుదూర అంతరిక్షంలోకి గ్రహాంతరయానం చేసి వచ్చారన్న ‘ఇతిహాస’ ‘పురాణ’ కథనాలు. అందువల్ల అశాస్త్రీయం కాకపోవొచ్చు.. పరిభాష వివిధ కాలాలలో మారిపోతూ ఉంది. మన దేశంలోనే మారింది. వివిధ ప్రపంచ ప్రాంతాలలో వివిధ భాషలలో విభిన్నమైన పారిభాషిక పదజాలం ఏర్పడింది. అందువల్ల పాశ్చాత్య భాషలలోని ‘పేర్లు’ ఏర్పడినప్పటినుంచి మాత్రమే ఖగోళ విజ్ఞానం మానవాళికి పరిచయం అయిందని భావించడం అశాస్త్రీయం. భారతీయులు ఖగోళాన్ని అంతరిక్షాన్ని ‘సంస్కృత’ భాషలోని పదజాలం ద్వారా యుగాలకు పూర్వమే గుర్తించారు. పాశ్చాత్యులు తమ భాషలలోని పదజాలంతో ఇటీవల కాలంలో గుర్తించారు! ఈ పాశ్చాత్యుల ‘గుర్తింపు’ భారతీయుల గుర్తింపునకు సరికొత్త ధ్రువీకరణ. సింహరాశి- లియోకాన్‌స్టిలేషన్‌తో ఈ ‘కె2-18బి’ నెలకొని ఉందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఆకాశంలో అంతరిక్షంలో నెలకొని ఉన్న అసంఖ్యాక నక్షత్రాలలో, నక్షత్ర సమూహాలలో ‘సింహరాశి’ నక్షత్ర సమూహం ఒకటి. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడు కాని, ఏ ఇతర నక్షత్రం కాని అంతరిక్షంలో స్థిరంగా ఉండడం లేదు. ‘బ్రహ్మాండం’.. పాలపుంత లోని ఒక కేంద్ర బిందువు ప్రాతిపదికగా ప్రతి నక్షత్రం పరిభ్రమిస్తోంది.
ఇలా పరిభ్రమిస్తున్న ప్రతి నక్షత్రం సూర్యుని చుట్టూ ఆ నక్షత్రంతో అనుబంధమై ఉన్న గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. ఈ గ్రహాల చుట్టూ ఆ గ్రహాలకు అనుబంధమైఉన్న ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. అందువల్ల ‘సాపేక్షం’ రిలెటివ్ గా ‘ఉపగ్రహాల’కు గ్రహాలు, గ్రహాలలోని వారికి ‘సూర్యుడు’లేదా నక్షత్రాలు స్థిరంగా ఉన్నట్టు గోచరమౌతోంది. ఎందుకంటె పరిభ్రమిస్తున్న సూర్యుని వెంట సూర్యుని చుట్టూ తిరుగుతున్న ‘గ్రహాలు’కూడ సుదీర్ఘ సూర్యకక్ష్యలో కదలిపోతున్నాయి. అలాగే భూమి చుట్టూ పరిభ్రమించే చంద్రుడు ఉపగ్రహం భూమి వెంట సూర్యుని చుట్టూ కూడ పరిభ్రమిస్తున్నాడు. మన ‘సూర్యుడు’ అంతరిక్షంలో ఒకసారి ఇలా పరిక్రమించడానికి అంటే బయలుదేరిన బిందువునుంచి మళ్లీ అదే బిందువునకు చేరడానికి దాదాపు ముప్పయి కోట్ల సంవత్సరాలు పడుతుందని ఆధునిక శాస్త్రజ్ఞ్రులు అంచనావేశారు. ప్రాచీన భారతీయులు దీనే్న ఒక ‘మన్వంతరం’ సమయం అని గుర్తించారు. పరిభాష వేరు..పరిగణన ఒక్కటే!
మన ‘సౌర’ కుటుంబానికి వెలుపల అసంఖ్యాక ‘సౌర’కుటుంబాలు.. నక్షత్రాలు వాటి అనుబంధ గ్రహాలు ఏర్పడి ఉన్నాయి. ఇదంతా ‘బ్రహ్మాండం’. మన ‘బ్రహ్మాండం’ పేరు మిల్కీ వే పాలపుంత! అసంఖ్యాక బ్రహ్మాండాల, అనంతకోటి బ్రహ్మాండాల ‘అఖండ మండలాకారం’ విశ్వవ్యవస్థ. ఇది భారతీయుల పరిభాష! మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న, మన సౌర కుటుంబానికి సమీపంలో ఉన్న ‘‘ఇరవై ఏడు నక్షత్రాల’’ను కూడ మన పూర్వులు గుర్తించారు. ఒక్కొక్క నక్షత్రం ఒక సూర్యుడు, ఇంకా పెద్దది. అంటే ఒక్కొక్క నక్షత్రం ఒక ‘సౌర కుటుంబం’. మన సౌర కుటుంబానికి వెలుపల లెక్కలేనన్ని లెక్కించడం సాధ్యం కానన్ని ‘నక్షత్రాలు’ ఉన్నప్పటికీ ఈ ఇరవై ఏడింటిని మాత్రమే ఎందుకని సృష్ట్యాదిగా భారతీయులు సంభావించారు? ఎందుకంటె మన భూమినుంచి చూసినప్పుడు, ఈ ఇరవైఏడు ‘నక్షత్రాల’తో నిరంతర సాపేక్ష సంబంధం సనాతనంగా అంటే శాశ్వతంగా అంతరిక్షంలో వ్యవస్థీకృతమై ఉంది కనుక! ఈ ఇరవై ఏడు నక్షత్రాలు వందల వేల కోట్ల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ ‘సాపేక్షం’గా అవి అంతరిక్షంలో మన భూమధ్యరేఖకు అటూ ఇటూ విస్తరించి ఉన్నాయి.
ఇరవై మూడున్నర ‘భాగ- డిగ్రీ-ల దక్షిణ అక్షాంశం నుంచి ఇరవై మూడున్నర భాగ-డిగ్రీ-ల ఉత్తర అక్షాంశం వరకు ఈ ‘నక్షత్రాలు’ విస్తరించి ఉన్నాయి. అంటే దక్షిణాన మకర రేఖనుంచి ఉత్తరాన కర్కటక రేఖ వరకూ భూమధ్యరేఖకు అటూ ఇటూ ఈ ఇరవై ఏడు నక్షత్రాలు విస్తరించి ఉండడం సహజ ఖగోళ వ్యవస్థ. ప్రతిరోజు- భూమినుంచి చూసినప్పుడు- ఈ ఇరవైఏడు నక్షత్రాలు ఉదయిస్తున్నాయి, అస్తమిస్తున్నాయి. ‘అశ్వని నుంచి రేవతి వరకు’- ఇవీ ఇరవై ఏడు నక్షత్రాలు. భూమి ఉపగ్రహమైన చంద్రుడు, ‘‘సాపేక్షంగా’’ ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రంతో కలసి ఉదయిస్తున్నాడు. ఈరోజు అశ్వనితో కలసి ఉదయించే చంద్రుడు రేపు ‘్భరణి’తో కలసి ఉదయిస్తున్నాడు.. ఇలా ఇరవై ఏడు నక్షత్రాలతో కలసి చంద్రుడు ఉదయించేసరికి దాదాపు నెల పూర్తిఅవుతోంది! సూర్యుడు పదమూడు లేదా పదునాలుగు రోజులకొకసారి ఒక నక్షత్రంతోకలసి ఉదయిస్తున్నాడు. ఇలా సూర్యుడు ఈ ఇరవై ఏడు నక్షత్రాలతోను ‘‘సహగమనం’’ పూర్తిచేసేసరికి ఒక సంవత్సరం పూర్తి అవుతోంది. ఇదంతా భూమి పరిభ్రమణ ఫలితం! ఈ ఇరవై ఏడు నక్షత్ర సమూహాలను సౌలభ్యం కోసం మన పూర్వులు పన్నెండు రాశులుగా గుర్తించారు. అంటే ‘రెండుంపావు’ నక్షత్రాల సమూహం ఒక రాశి- కాన్‌స్టిలేషన్-అన్నమాట. ఇలా ‘మేషం’నుంచి ‘మీనం’వరకు పన్నెండు ‘రాశులు’. అశ్వని భరణి నక్షత్రాలు, కృత్తిక నక్షత్ర సమూహంలోని పావుభాగం కలిపి మేషరాశి. ఇలాగే మిగిలిన రాశులు.. ‘లియో’-సింహరాశి- అంటే ‘మఖ’ ‘పూర్వ ఫల్గుని’ ‘ఉత్తర ఫల్గుని’ నక్షత్ర సమూహం అంతరిక్షంలో విస్తరించిన ప్రాంతమన్నమాట! ఈ ‘సింహరాశి’లో నెలకొని ఉన్న ఈ ‘మహాభూమి’- ‘కె2- 18 బి’-గ్రహంలో మంచినీరు ఉందన్నది శాస్త్రజ్ఞులు కనిపెట్టిన వాస్తవం… ఇలా ‘సనాతన’ వ్యవస్థకు ఈ ‘మహాభూమి’ సరికొత్త ఆవిష్కరణ.
-నవీన్ కుమార్ చెన్నం శెట్టి
(సీనియర్ జర్నలిస్ట్)
సెల్ : 8886311116.