“యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 97–103 డాలర్ వరకు పెరిగి, భారత దిగుమతి భారం పెరిగింది. రూపాయి బలహీనపడటం వల్ల పెట్రోలియం, ఎరువులు, వంటనూనెలు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, రసాయనాలు వంటి దిగుమతులు ఖరీదవుతాయి. ఉదాహరణకు రూపాయి విలువ రూ 83 నుంచి రూ.93కు పడిపోతే దిగుమతులు రూపాయిల్లో సుమారు 12% ఖరీదవుతాయి. దీనివల్ల ఇంధన ధరలు, రవాణా, వ్యవసాయం, తయారీ ఖర్చులు పెరుగుతాయి. దీని వల్ల వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గుతుంది.”

తిరుపతి
మొబైల్: 8309082823
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్ ) వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ ఏప్రిల్ 2026 ప్రకారం, నామమాత్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) ఆధారంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగ్స్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి నాల్గవ స్థానంలో ఉన్న భారతదేశం 4.15 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణంతో ఆరో స్థానానికి దిగజారింది. ముఖ్య కారణం రూపాయి విలువ తగ్గుదల. రూపాయి విలువ పడిపోవడం వల్ల భారత స్థూల దేశీయ ఉత్పత్తిని అమెరికన్ డాలర్లలో లెక్కించినప్పుడు దాని విలువ తగ్గింది. ఉదాహరణకు, ఒక అమెరికన్ డాలర్‌కు రూ.83 నుండి రూ.86 కు రూపాయి బలహీనపడితే, డాలర్లలో స్థూల దేశీయ ఉత్పత్తి విలువ తగ్గుతుంది. రెండవది, యునైటెడ్ కింగ్‌డమ్ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోవడం వల్ల తాత్కాలికంగా భారత్‌ను అధిగమించింది.
మూడవది, స్థూల దేశీయ ఉత్పత్తి విలువ లెక్కల్లో మార్పులు మరియు మారకపు విలువల హెచ్చుతగ్గులు కూడా ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపించాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు సుమారు 30–32 ట్రిలియన్ డాలర్లు, చైనా 19–21 ట్రిలియన్ డాలర్లు, జర్మనీ 5 ట్రిలియన్ డాలర్లు , జపాన్ 4.3–4.5 ట్రిలియన్ డాలర్లు, యునైటెడ్ కింగ్‌డమ్ 4.2–4.3 ట్రిలియన్ డాలర్ల తో ఆర్థిక పరిమాణంతో భారత్ కంటే ముందున్నాయి. అయినప్పటికీ, భారతదేశం 2026–27లో 6.5% నిజమైన స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాతో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. 2028 నాటికి మళ్లీ నాల్గవ స్థానాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. అలాగే 2031 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని అంచనా వేయబడుతోంది.
పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం
పశ్చిమ ఆసియా ఘర్షణ భారతదేశం వంటి దిగుమతి దేశాలపై ఒత్తిడికి కారణమైంది. ఎందుకంటే భారతదేశం తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85% దిగుమతులపై ఆధారపడుతోంది, అందులో ఎక్కువ భాగం దాదాపు 50–55% పశ్చిమ ఆసియా ప్రాంతంతో సంబంధం కలిగి ఉంది. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ముడి చమురు ధరలు కొన్ని సందర్భాల్లో బ్యారెల్‌కు 110 డాలర్ల కంటే ఎక్కువకు చేరాయి, దీని వల్ల భారతదేశ దిగుమతి బిల్లు పెరిగింది. చమురు ధరల పెరుగుదల వల్ల పెట్రోల్, డీజిల్, రవాణా, ఉత్పత్తి వ్యయాలు పెరిగి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఏర్పడ్డాయి. ఇటీవల కొన్ని నెలలలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం సుమారు 5% వద్ద కొనసాగింది, దీనిపై ఇంధన వ్యయాల ప్రభావం కొంత ఉంది. అధిక దిగుమతి బిల్లు వల్ల ప్రస్తుత ఖాతా లోటు పెరిగి రూపాయిపై ఒత్తిడి పెరిగింది.
రూపాయి ఒక అమెరికన్ డాలర్‌కు రూ 84–రూ.86 మధ్య ట్రేడ్ కావడంతో దిగుమతులు మరింత ఖరీదయ్యాయి. ఎర్ర సముద్ర మార్గాల్లో రవాణా అంతరాయాల కారణంగా భారత ఎగుమతులు, దిగుమతులపై సరుకు రవాణా, బీమా ఖర్చులు పెరిగాయి. రసాయనాలు, విమానయానం, ఎరువులు, లాజిస్టిక్స్ రంగాలు పెరిగిన ముడి పదార్థాల ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రపంచ అనిశ్చితి కారణంగా ఆర్థిక మార్కెట్లలో కూడా అస్థిరత ఏర్పడి, సెన్సెక్స్ మరియు నిఫ్టీ సూచీలు నష్టాలను ఎదుర్కొన్నాయి. భారతదేశ ఎరువుల దిగుమతుల్లో దాదాపు 63% గల్ఫ్ దేశాల నుంచే వస్తాయి. దీని వల్ల వ్యవసాయ ఉత్పత్తి వ్యయాలు పెరిగాయి. పశ్చిమ ఆసియాలో సుమారు 9.37 మిలియన్ల భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు. కాబట్టి యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఉపాధి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ, దేశీయ డిమాండ్ , ప్రభుత్వ వ్యయాల మద్దతుతో భారతదేశం సుమారు 6% కంటే ఎక్కువ వృద్ధిని కొనసాగించింది.
రూపాయి విలువ తగ్గుదల ప్రభావం
పశ్చిమ ఆసియా యుద్ధ సమయంలో భారత రూపాయి విలువ తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపుతుంది, ఎందుకంటే భారత్ ముఖ్యంగా ముడి చమురు వంటి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. భారత అవసరమైన ముడి చమురులో సుమారు 85% దిగుమతి చేసుకుంటుంది. 2026 ఏప్రిల్‌లో రూపాయి విలువ ఒక్క అమెరికన్ డాలర్‌కు సుమారు రూ.95.21 వరకు పడిపోయి, తరువాత ఆర్బీఐ జోక్యంతో కొంత మేర కోలుకుంది. యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 97–103 డాలర్ వరకు పెరిగి, భారత దిగుమతి భారం పెరిగింది. రూపాయి బలహీనపడటం వల్ల పెట్రోలియం, ఎరువులు, వంటనూనెలు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, రసాయనాలు వంటి దిగుమతులు ఖరీదవుతాయి. ఉదాహరణకు రూపాయి విలువ రూ 83 నుంచి రూ.93కు పడిపోతే దిగుమతులు రూపాయిల్లో సుమారు 12% ఖరీదవుతాయి. దీనివల్ల ఇంధన ధరలు, రవాణా, వ్యవసాయం, తయారీ ఖర్చులు పెరుగుతాయి. దీని వల్ల వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గుతుంది.
అంచనాల ప్రకారం చమురు ధరలు 10% పెరిగితే భారత స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి 20–25 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చు. వాణిజ్య లోటు, ప్రస్తుత ఖాతా లోటు పెరుగుతాయి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. 2026 మార్చిలో ఇవి సుమారు 688 బిలియన్ల డాలర్ల గా ఉన్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చు, దీని వల్ల స్టాక్ మార్కెట్‌లో అస్థిరత పెరుగుతుంది. డాలర్లలో అప్పులు తీసుకున్న భారత కంపెనీలకు తిరిగి చెల్లింపు భారం పెరుగుతుంది, అయితే ఐటీ, ఔషధాలు, వస్త్ర పరిశ్రమలు వంటి ఎగుమతి రంగాలకు విదేశీ ఆదాయం రూపాయిల్లో ఎక్కువగా లభించడం వల్ల కొంత లాభం కలుగుతుంది. మొత్తంగా రూపాయి విలువ తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం, మందగించిన వృద్ధి, అధిక దిగుమతి ఖర్చులు, ఆర్థిక అస్థిరత ఏర్పడతాయి.
తీసుకోవలసిన చర్యలు
రూపాయి విలువ తగ్గుదల, పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై తగ్గించడానికి, భారత్ పలు చర్యలు తీసుకోవాలి. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85% దిగుమతులపై ఆధారపడుతోంది. అందులో 50% కంటే ఎక్కువ సంప్రదాయంగా పశ్చిమ ఆసియా నుంచే వస్తోంది. కాబట్టి రష్యా, అమెరికా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి చమురు కొనుగోళ్లు పెంచడం ద్వారా సరఫరా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పునరుత్పాదక ఇంధన విస్తరణ చాలా అవసరం. 2030 నాటికి 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ ఫ్యూయల్ సామర్థ్య లక్ష్యాన్ని సాధించడం ద్వారా చమురుపై ఆధారాన్ని తగ్గించవచ్చు. ప్రస్తుతం ఉన్న సుమారు 5.3 మిలియన్ టన్నుల వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను మరింత పెంచితే సరఫరా షాక్‌ల సమయంలో ఉపయోగపడుతుంది. ఎగుమతులను ప్రోత్సహించడం కూడా ముఖ్యం. ఇటీవల భారత్ వస్తువులు మరియు సేవల ఎగుమతులు కలిపి 770 బిలియన్ డాలర్లు దాటాయి, ఇది విదేశీ మారక నిల్వలకు మద్దతు ఇస్తుంది. రూపాయి ఆధారిత వాణిజ్య చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా అమెరికన్ డాలర్‌పై ఆధారాన్ని తగ్గించవచ్చు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 640 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విదేశీ మారక నిల్వలను ఉపయోగించి కరెన్సీ స్థిరత్వాన్ని కాపాడాలి. ఇటీవలి సంవత్సరాలలో 70 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను (ఎఫ్డిఐ) మరింత ఆకర్షించడం ద్వారా మూలధన ప్రవాహాలు పెరుగుతాయి. మేక్ ఇన్ ఇండియా కింద దేశీయ తయారీని విస్తరించడం ద్వారా ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, రక్షణ సామగ్రి దిగుమతులను తగ్గించవచ్చు. నౌకాశ్రయాలు షిప్పింగ్ లాజిస్టిక్స్ మెరుగుపరచాలి. ఎరువుల విషయంలో స్వయం సమృద్ధి చాలా ముఖ్యం, ఆహార నిల్వలు, సరఫరా నిర్వహణ ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల విస్తరణకు తక్కువ వడ్డీ రుణాలు అందించడం ద్వారా ఉపాధిని రక్షించవచ్చు. పర్యాటకం మరియు ఐటీ ఎగుమతులను ప్రోత్సహించాలి, ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఎగుమతుల ద్వారా సంవత్సరానికి 200 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఈ చర్యలన్నీ కలిపి రూపాయి షాక్‌లు, భౌగోళిక రాజకీయ ప్రమాదాల నుంచి భారతదేశాన్ని మరింత కాపాడుతాయి.





