సంక్షోభంలో వ్యవసాయం

కెసిఆర్‌ ప్రజల కోసం ఎర్రటి ఎండలో పొలం బాట
ఐపిఎల్‌ మ్యాచ్‌లు చూస్తున్న సిఎం రేవంత్‌
మేడిగడ్డ నుంచి 200 క్యూసెక్కుల నీళ్లు వృథా
పిల్లర్లు కుంగాయంటూ బద్‌నామ్‌ చేస్తున్నారు
ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్‌ పూర్తి నిర్లక్ష్యం
సిరిసిల్ల రైతు దీక్షలో బిఆర్‌ఎస్‌
వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శలు

రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : తెలంగాణ లో వ్యవసాయం సంక్షోభంలో ఉందని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ఈ దుస్థితి ఊహించలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎర్రటి ఎండలో ప్రజల్లోకి తిరిగితే.. సీఎం రేవంత్‌ రెడ్డి ఐపీఎల్‌ మ్యాచులు అంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ హావ్నిలను నమ్మి ప్రజలు మోసపోయారని, పాలిచ్చే బర్రెను పంపించి దున్నపోతును తెచ్చుకున్నామని ఆవేదన చెందుతున్నారన్నారు. రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని అడిగితే ఎన్నికల కోడ్‌ ఉందని అంటున్నారని, చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్‌ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాలని, తాము కూడా ఉత్తరం రాస్తామని అన్నారు. కరువు వొస్తే మమ్మల్ని తిడుతారా..అంటూ కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారని, ఈ ఏడాది 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అంటూ విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ నుంచి 200 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయని, మేడిగడ్డలో పిల్లర్లు కుంగితే రిపేర్‌ చేయకుండా కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారంటూ కేటీఆర్‌ మండిపడ్డారు.

అప్పుడు వర్షాలు పడి పంటలు మునిగిపోయాయని మంత్రి శ్రీధర్‌ బాబు గగ్గోలు పెట్టారని, ఇప్పుడు వర్షాలు పడలేదని అంటున్నారని అనారు. ఎన్నికల ముందు రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు సిద్ధంగా పెట్టామని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ డబ్బులు ఇవ్వొద్దని కాంగ్రెస్‌ ఆపిందని, ఇప్పుడు ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని కెటిఆర్‌ డిమండ్‌ చేశారు. తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే మార్గమని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలు నిర్మించామని, భారీ మోటార్లు పెట్టి గోదావరి నీళ్లు ఎత్తిపోశామని, ఇవాళ కూడా గోదావరిలో 2 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయని తెలిపారు. 300 పిల్లర్లు ఉన్న బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్ట్‌ మొత్తం కొట్టుకుపోయిందని దుష్పచ్రారం చేస్తున్నారంటూ కెటిఆర్‌ మండిపడ్డారు. డిసెంబర్‌ 9న రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇప్పటికీ ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదని, ఎన్నికల్లో ఓడిపోయామని రైతుల తరఫున కొట్లాడకుండా ఆగుతామా లని ప్రశ్నించారు. రైతులకు అండగా నిలబడేందుకు ప్రతి ఒక్క బీఆర్‌ఎస్‌ కార్యకర్త సిద్ధంగా ఉండాలని కెటిఆర్‌ పిలుపునిచ్చారు. రైతు భరోసా, రూ.4 వేల పెన్షన్‌, రూ.2 లక్షల రుణమాఫీ వొచ్చిన వాళ్లు కాంగ్రెస్‌ కు వోటెయ్యండని, రాని వాళ్లు మాకు వోటెయ్యండని కెటిఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

హావ్నిలను నెరవేర్చకుంటే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారన్న భయం కాంగ్రెస్‌ పార్టీలో మొదలైందని, రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కొరత ఉందని, మిషన్‌  భగీరథ నిర్వహణ కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని, హావ్నిలపై సర్కారును నిలదీద్దామని అన్నారు. 420 కాంగ్రెస్‌ హావ్నిలను ప్రతి ఒక్కరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉందని, 30 వేల ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పుకుంటున్న రేవంత్‌ రెడ్డి.. తమ ప్రభుత్వం వొచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిందో చెప్పాలని కెటిఆర్‌ డిమండ్‌ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, నేతన్నల కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ దీక్షలు చేస్తుందని, ప్రభుత్వం నేతన్నలను ఆదుకునే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page