గ్లోబల్ వార్మింగ్‌కు ఇదే కారణమని నిపుణుల కమిటీ వెల్లడి
న్యూ దిల్లీ, అక్టోబర్ 28 : శిలాజ ఇంధనాల పెరుగుదలతో ప్రపంచానికి పెనుముప్పు తప్పదని ఓ నివేదిక తేల్చింది. బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడుతుండటంతో.. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందని.. దీంతో లక్షలాది మందిప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. భవిష్యత్తులో మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆ నివేదిక హెచ్చరించింది. ఒక్క భారత్‌లోనే 2 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని ’ద లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’ అనే నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వంటి 50 సంస్థలకు చెందిన 99 మంది నిపుణులు ఈ నివేదనకు రూపొందించారు. ఈ శతాబ్దం చివరి నాటికి గ్లోబల్ వార్మింగ్ 2.7 డిగ్రీల సెల్సియస్ పెరగనుందని నివేదిక తెలిపింది. ఈ శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా.. గతేడాదిలో భారత్‌లో 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ నివేదిక వెల్లడించింది. అంటే ప్రతి 2 నిమిషాలకు 1.2 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
గతేడాదిలోనే చైనాలో 3,80,000 మరణాలు సంభవించగా.. ఐరోపా దేశాల్లో 1,17,000 మంది, అమెరికాలో 32 వేల మంది మరణించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్య కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలకు సూచించారు. శిలాజ ఇంధనాల పెరుగుదలతో ఆహార భద్రత, అంటు వ్యాధుల వ్యాప్తి, అధిక ఉష్ణోగ్రతలు, విద్యుత్ సంక్షోభం, గాలి కాలుష్యం వంటివి పెరుగుతాయని హెచ్చరించింది. మరణాల రేటు కూడా గణనీయంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు. శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇవ్వడం తగ్గించాలని సూచించారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే వినాశనం తప్పదని చెప్పారు.
మరోవైపు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మరోసారి పెరిగింది. పూర్ కేటగిరి నుంచి వెరీ పూర్ కేటగిరికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 354కు చేరింది. దీంతో గాలిలో నాణ్యత తగ్గింది. దీపావళి తరువాత నుంచి ఎయిర్ క్వాలిటి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. సోమవారం రాత్రి 312 ఉండగా మంగళవారానికి 302కి చేరి మెరుగు పడింది. అయితే నిన్న మరోసారి ఎయిర్ పొల్యూషన్ పెరిగింది. పొల్యూషన్ కారకాలు వాతావరణంలో పెరిగి పోయాయని వాతావరణ శాఖ అధికారులు అన్నారు.