– మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
– మృతులు కర్నాటక వాసులుగా గుర్తింపు
– 13 మందికి గాయాలు
కర్నూలు, ఏప్రిల్ 16 : కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం, రెడీమిక్స్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8మంది మృతిచెందగా 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరులోని హాస్పిటల్‌కు తరలించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన భక్తులు మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను కుమార్(60), దీపిక వీణ(35), సునీల్(40), బెల్లి(3), పుట్టమ్మ(60), మీనాక్షి(50), తాయమ్మ(60), లోలాక్షిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బొలెరో డ్రైవర్ నిద్ర మత్తులో ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరించారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రధాని దిగ్భ్రాంతి: మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం
న్యూదిల్లీ : మంత్రాలయం సమీపంలో ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతోపాటు క్షతగాత్రులకు ఆయన నష్ట పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్ప్పున నష్టపరిహారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. ఘటనపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




