- అంతర్జాతీయ డిమాండ్ ఉన్న పంట ఆయిల్ పామ్ సాగు
- సాగుకు సిద్ధిపేట జిల్లా లాభదాయకం
- టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, మే 14(ప్రజాతంత్ర బ్యూరో) : క్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) పని చేయకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సుతిమెత్తగా హెచ్చరించారు. ఆయిల్ పామ్ సాగుకు సిద్ధిపేట జిల్లా లాభదాయకం శ్రేయస్కరమని, అంతర్జాతీయ డిమాండ్ ఉన్న పంట ఆయిల్ పామ్ సాగు ఉన్నదని మంత్రి హరీష్‌రావు దిశానిర్దేశం చేశారు. ఆయిల్ పామ్ తోటల సాగు పెరుగుదలతో జిల్లా రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని, మొదటి ప్రాధాన్యత కింద విరివిగా సాగు జరగాలని, పచ్చిరొట్టె విత్తనాలు సాగు, సెరి కల్చర్ సాగు, వెద సాగు కొనుగోళ్ల కేంద్రాలకు ఆర బెట్టిన ధాన్యం తెచ్చేలా చొరవ చూపాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట నుంచి జిల్లా వ్యవసాయ, ఉద్యాన పట్టు పరిశ్రమ, జిల్లాలోని అన్నీ మండలాలు, గ్రామ రైతు బంధు సమితి నాయకులతో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ వారీగా ఆయిల్ పామ్, మల్బరీ తోటల సాగు, వెద సాగు, పచ్చిరొట్టె విత్తనాలు సాగు లక్ష్యాలను నిర్దేశించారు. అలాగే అకాల వర్షాల దృష్ట్యా ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలలో ఆరబెట్టిన ధాన్యం తెచ్చేలా రైతులను చైతన్యం చేయాలని మంత్రి సూచించారు. జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాలు ఆయిల్ పామ్ తోటలు నాటడం లక్ష్యం.
కానీ, ఇప్పటివరకు జిల్లాలో కేవలం 8 వేల ఎకరాలు మాత్రమే తోటలు సాగుకు రిజిస్టర్ చేయించినట్లు, లక్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ విస్తరణ అధికారులు పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవని సుతిమెత్తగా మంత్రి మందలించారు. ఇంకా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నదని, క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి నాయకుల సమన్వయంతో అనుకున్న ఆ లక్ష్యం దిశగా ముందుకు సాగాలని మంత్రి సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఆయిల్‌పామ్ సాగు కోసం వంద శాతం రాయితీపై ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్ అందిస్తున్నట్లు, 90 శాతం రాయితీపై డ్రిప్ అందిస్తున్నట్లు రైతులకు అర్థమయ్యేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి తోటల సాగుకై ముందుకు వొచ్చేలా చూడాలని మార్గదర్శనం చేశారు.
కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయదని, రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన క్రమంలో యాసంగిలో వరి పంట సాగు చేయడం శ్రేయస్కరం కాదనీ, ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు ఉండబోవని స్పష్టం చేస్తూ.. ఈ దరిమిలా జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, ఆయా మండలాల్లోని ప్రజా ప్రతినిధులు అందరూ రైతులతో ఈ దీర్ఘకాలిక పంటలపై, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ సాగుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని గ్రామ, మండల, జిల్లా రైతుబంధు సమితి నాయకులకు మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. అదే విధంగా సెరికల్చర్ సాగుకై భార్యభర్త కలిసి పని చేసుకునే కుటుంబాలను గుర్తించి, వారి ద్వారా జిల్లాలో షెడ్, పట్టు పురుగులను రాయితీపై అందిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. ఈ పంటల సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం వొస్తుందని తద్వారా ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు తమ తమ క్లస్టర్ పరిధిలోనీ రైతులతో సమావేశం నిర్వహించి, చైతన్యం చేసి ఆయిల్ పామ్ సాగు, మల్బరీ తోటల సాగు, వెద సాగు కోసమై రైతులు ముందుకు వొచ్చేలా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా, మండల, గ్రామ నాయకులు, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.