వికారాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : వికారాబాద్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర 3వ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎంపికయ్యారు. ఏఐసీసీ సెక్రెటరీ వేణుగోపాల్ మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రసాద్ కుమార్ 1964 జూన్ 4న తాండూరు మండలం బెల్కటూర్ గ్రామంలో జన్మించారు. 2001 నుండి 2006 వరకు మర్పల్లి మండల ఎంపీపీగా పనిచేశారు. మాజీమంత్రి చంద్రశేఖర్ తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయడంతో 2008 బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రసాద్ కుమార్ వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తదనంతరం 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రసాద్ కుమార్ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో చేనేత జౌలీ శాఖ మంత్రిగా ప్రసాద్ కుమార్ పనిచేశారు. అనంతరం 2014, 2018 లలో జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఓటమి పాలయ్యారు. నవంబర్ 30న జరిగిన 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ప్రసాద్ కుమార్ భారీ మెజార్టీతో వికారాబాద్ శాసనసభ్యులుగా గెలుపొందారు. తాజా శాసన సభకు ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా ఎంపికయ్యారు. ఆయన స్పీకర్‌గా ఎంపిక కావడంతో వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాడు ఎంపీపీగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం నేడు అసెంబ్లీ స్పీకర్ వరకు ఆయన అంచెలంచెలుగా ఎదిగారు.