రాజ్య హింస మీద మాట్లాడకుండా … సంక్షేమ పథకాల వైపు వెళ్లటం ఏమిటి ..?

ప్రగతిశీల మహిళా సంఘం POW (Progressive Organi sation of Women) 1974 జూన్‌ 22 ‌న ఉస్మానియా యూనివర్సిటీ లో మతతత్వ, పురుషాధిపత్య లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తిరగబడ్డ విద్యార్థినుల చైతన్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఈ సంస్థ ఆవిర్భావమే ఒక సజీవ సంచలనం. ఆ తర్వాతి కాలంలో భిన్న సమూహాలలోని అణగారిన మహిళల హక్కుల కోసం నిరంతరంగా పోరాడుతున్న ఉద్యమ తేజం. ఒక చిన్న సమూహంగా మొదలై, ఒక ప్రభంజనంగా మారి, సైద్ధాంతిక నిర్మాణ ఆటుపోట్లతో నాలుగు పాయలైనప్పటికీ ప్రజా సమూహాలను నిరంతరం అంటిపెట్టుకునే ఐదు దశాబ్దాలుగా ప్రయాణిస్తున్న సంఘాలు, మళ్లీ ఒక తాటిమీదకు రావడానికి ప్రయత్నం చేస్తూ తమ అర్థ శతాబ్దపు వార్షికోత్సవాన్ని 2024 జూన్‌ 22 ‌న హైదరాబాద్‌, ‌విశాఖ పట్టణాలలో జరుపుకుంటున్నాయి.
ఈ సందర్భంగా, స్వతంత్ర జర్నలిస్ట్ ‌సజయ ప్రజాతంత్ర దినపత్రిక తరఫున ‘పీవోడబ్ల్యూ’ సంధ్యతో చేసిన సంభాషణ –

సజయ : ‘పీవోడబ్ల్యూ’ అనగానే గుర్తుకు వచ్చే పేరు సంధ్య. మిమ్మల్ని ఒక వ్యక్తిగా మాత్రమే నేను భావిం చటం లేదు. ఒక సమూహ శక్తిగా, వేలాదిమంది కార్య కర్తల ప్రతినిధిగా మిమ్మల్ని చూస్తున్నాను. పీవోడబ్ల్యూ ఒక ఉద్యమ శక్తిగా తన అర్థ శతాబ్ధి ఉత్సవాలను జరుపు కుంటున్న ఈ సందర్భంలో మీకూ, మీ సహచర కార్యకర్త లందరికీ అభినందనలు తెలు పుతూ, ఈ సంస్థతో మీ ప్రయా ణాన్ని, ఆ గమనంలోని అనుభవాలను మా పాఠకుల కోసం చెప్పండి.

సంధ్య: ప్రజాతంత్ర పత్రికకు, మీకూ నా ధన్యవాదాలు. నా బాల్యం, హైస్కూల్‌ ‌వరకూ కూడా ఉత్తర తెలంగాణలో గడిచింది. దాదాపు నాకు ఊహ తెలిసి ఐదారు తరగతులవరకూ వచ్చేసరికి మా ఇల్లు ఒక రాజకీయ కేంద్రంగా వుండేది. పీడీఎస్యు శంకరన్న వంటి నాయకులు మా ఇంటికి మానాన్న కోసం వచ్చేవారు. మా ఇంటిలోనే ఎక్కువ వుండేవారు. మేము నిర్మల్లో వున్నప్పుడు వున్నప్పుడు లక్ష్మణ్‌ అని ఇంకో నాయకుడు వచ్చేవారు. ఆయన తర్వాత ఎన్కౌంటర్‌ అయ్యారు. ఆనాటి పీడీఎస్యు నాయకులు చాలామంది వచ్చేవారు. నేను 9 వ తరగతికి వచ్చేసరికి కరీంనగర్‌ ‌వచ్చేశాము. అప్పుడు ఎమర్జెన్సీ తర్వాత హైదరాబాద్‌ ‌లో రమీజాబీ పై పోలీసు స్టేషన్‌ ‌లో జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా చాలా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కరీంనగర్‌ ‌కి వచ్చిన సందర్భంలో వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన ప్రదర్శన చేయటానికి వెళుతుంటే వాళ్ళతోపాటు కలిసి నేను కూడా పాల్గొనటానికి వెళ్లిపోయాను. అప్పుడు నేను 9 వ తరగతి. ‘పీవోడబ్ల్యూ’ నాయకత్వం వహించిన వివిధ పోరాటాలు అప్పుడు పార్టీ పత్రికల్లో కూడా రిపోర్ట్ అయ్యేవి. అవి మా ఇంటికి వచ్చినప్పుడు వాటిని చూసేదాన్ని. మా ఇంటికి వచ్చిన కార్యకర్తలు చెప్పేవాళ్ళు. అలా నాకు ‘పీవోడబ్ల్యూ’ పరిచయం అయింది. పీడీఎస్‌యూ, ‘పీవోడబ్ల్యూ’ ఉమ్మడి పిలుపుగా కార్యక్రమాలు నిర్వహించినట్టు అప్పటి పత్రికల్లో చదివాను. ఆమె మీద అత్యాచారం జరిగిందని సమాచారం బయటకు వచ్చిన వెంటనే స్పందించినది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఆ నల్లకుంట పోలీసు స్టేషన్‌ ‌యూనివర్సిటీ పక్కనే వుండేది. ఆనాటి పీడీఎస్‌యూ, ‘పీవోడబ్ల్యూ’ కార్యకర్తల ప్రొటెస్టే చాలా పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది అయింది. అసెంబ్లీ ముందుకు వెల్లువెత్తిన పోరాటంగా మారింది.

ఆ ఉద్యమం మీద చాలా నిర్భంధం, లాఠీ ఛార్జీలు, బాష్పవాయువు ప్రయోగించారు. తుపాకిగుళ్లు పేల్చారు. అనేకమంది విద్యార్థులు క్షతగాత్రులయ్యారు. ఆ ఉద్యమం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆ ఘటన గురించీ విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు ‘పీవోడబ్ల్యూ’ అంటే నాకు చాలా ఆడ్మిరేషన్‌ ‌వచ్చింది. అప్పటికే నేను హైస్కూల్లో వుండి విద్యార్థి సంఘం కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. విప్లవోద్యమంలో భాగంగా విప్లవ విద్యార్థి సంఘాలు, అందులో ప్రగతిశీల మహిళా సంఘం ‘పీవోడబ్ల్యూ’ (మొదట్లో అభ్యుదయ మహిళా సంఘం అనేవాళ్లు, తర్వాత ప్రగతిశీల మహిళా సంఘం గా మార్చారు. మొదటినుంచీ ఇంగ్లీష్‌ ‌లో ప్రోగ్రెసివ్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ‌విమెన్‌ అనే అనేవారు)వుండేవి. తర్వాత నేను హైదరాబాద్‌ ‌కి కాలేజ్‌ ‌చదువులకి వచ్చాను. నేను ప్రింటింగ్‌ ‌టెక్నాలజీ లో పాలీటెక్నిక్‌ ‌చేయటం వల్ల నా కాలేజ్‌ ‌చదువు తొందరగా అయిపోయింది. అప్పటివరకూ పీడీఎస్‌యూ లో పనిచేశాను.

చదువు అయిపోయిన తర్వాత నాకు మహిళా సంఘం బాధ్యతలు ఇచ్చారు. నేను 85 ప్రాంతంలో మహిళా సంఘం పూర్తి బాధ్యతల్లోకి వచ్చాను. 1974 జూన్‌ 22 ‌న ‘పీవోడబ్ల్యూ’ ప్రారంభమైంది. ఈ 2024 జూన్‌ 22 ‌కి ఐదు దశాబ్దాలు పూర్తి అవుతాయి. 2023 జూన్‌ 22 అప్పుడు పెద్దగా నిర్మాణం అంటూ లేదు. నిర్మాణం మొదలు పెట్టాలి అనుకు నేటప్పటికీ, ఎమర్జెన్సీ నిర్బంధంలో చాలామంది చెల్లాచె దురైపోయారు. జైళ్ల పాలయ్యారు. 80-81 ప్రాంతంలో అంబి, రత్నమాలక్క వీళ్లు ఒక నిర్మాణాన్ని ప్రారంభించారు. రత్నమాలక్క కన్వీనర్‌ ‌గా వుండేది. అయితే పార్టీలో విభేధాల వల్ల మహిళాసంఘం కూడా డిస్టర్బ్ అయింది. ఎక్కువకాలం కొనసాగలేదు. పార్టీల్లో వచ్చిన చీలికలు ప్రజా సంఘాల్లో కూడా ప్రభావాన్ని చూపిం చాయి. నేను 85 లో మహిళా రంగం బాధ్యతలు తీసుకున్నాక, మావైపు నుంచీ గ్రామాలలో, జిల్లాలలో నిర్మాణాల మీద దృష్టి పెట్టాము. ఈ ఐదు దశాబ్దాలలో సంస్థగా అనేక అంశాల మీద పోరాటాలు చేశాము, అనేక అనుభవాలు వున్నాయి. నిర్మాణాల పరంగా, అంశాల పరంగా అనేక వొడిదుడుకులను ఎదుర్కొన్నాము.

సజయ: ఏఏ అంశాల ప్రాధాన్యతతో ఈ నిర్మాణాలు చేపట్టారు?
సంధ్య : అభ్యుదయ మహిళా సంఘం గా వున్నప్పుడు వరకట్న సమస్యలు, అధిక ధరలు తీసుకున్నారు. అలాగే 78 ప్రాంతంలో హైదరాబాద్‌ ‌నగరంలో ఇతర దేశాలకి కూరగాయల ఎక్స్పోర్ట్ ‌చేయాలని చెన్నారెడ్డి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు దానికి వ్యతిరేకంగా తోపుడుబండ్ల వాళ్లని సమీకరించి ‘పీవోడబ్ల్యూ’ సభ్యులు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. నాలుగైదువేల మంది తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకునేవారు ఈ పోరాటంలో ముందుభాగాన నిలిచారు. రెడ్డి కాలేజీ విద్యార్ధినులు ఆ ఉద్యమానికి సపోర్ట్ ‌గా పాటలు పాడుతూ, రోడ్ల మీద ఉరేగింపులు కూడా చేశారు. ఇవన్నీ కూడా అప్పుడు పనిచేసిన అంబి వంటి పాత కామ్రేడ్స్ ‌చెబితే మాకు తెలిసింది. అలాగే అధిక ధరలకు వ్యతిరేకంగా ‘పీవోడబ్ల్యూ’ చేసిన పోరాటం కూడా హిస్టారికల్‌. అప్పట్లో ఆటో నడిపిన వాళ్లను అడిగితే చెబుతారు.

పై అంశాలన్నీ దృష్టిలోకి తీసుకుని, ఏం అంశాలు తీసుకుని పనిచేయాలి అనుకున్నప్పుడు, ముందుగా మేము గ్రామీణ స్థాయి నుంచీ పనిచేయాలని నిర్ణయించుకున్నాము. నిర్మాణాలు గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో మొదలుపెట్టాము. మొదట్లో యూనివర్సిటీ నుంచీ ప్రారంభమయినప్పుడు, పై నుంచీ కిందికి నిర్మాణం చేయాలనుకున్నారు. నిర్బంధం వంటి ఆటంకాలు, ఇంకా అనేక ఇతర అవరోధాల వల్ల అది సాధ్యం కాలేదు. తర్వాత దాని మీద జరిగిన రివ్యూలు కూడా మాకు దొరికాయి. 85 లో నేను బాధ్యతలు చేపట్టాక, ఆలస్యమయినా పర్లేదు కానీ, కింది నుంచీ శ్రామికవర్గ మహిళలతో నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వరకట్నం, కుటుంబ హింస ఈ అంశాలతో పాటు, సమానపనికి సమాన వేతనం అంశం కూడా తీసుకోవాలని అనుకున్నాం. దానికోసం రైతుకూలీ సంఘాలతో కలిసి పనిచేయాలని అనుకున్నాం. అట్లాగే పెంకుల ఫ్యాక్టరీ కార్మికులతో, బీడీ కార్మికులతో, ఆదివాసీ మహిళలతో కలిసి ఐక్య కార్యాచరణ చేయాలని అనుకున్నాం. శ్రమ విముక్తి లేనిదే స్త్రీ విముక్తి సాధ్యం కాదు అని బలంగా నమ్మినవాళ్లంగా శ్రామికవర్గ స్త్రీలతో కలిసి పనిచేయటానికి, వారిని సమీకరించటానికి ప్రాధాన్యత నిస్తూ, మొత్తంగా స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు, కుటుంబ హింస సమస్యల మీద పనిచేయాలని అనుకున్నాం.

అప్పటికే 498 ఏ లాంటి చట్టాలు అమెండ్మెంట్‌ అయ్యాయి. అలాగే స్వతంత్ర స్త్రీవాద ఉద్యమం తీసుకువచ్చిన అంశాలు కూడా సమాజంలో బలంగా ముందుకి వచ్చాయి. ఆ అంశాలన్నీటి మీద కూలంకషంగా చర్చించి కొన్ని సారూప్యత వున్న అంశాల మీద పనిచేయాలని అనుకున్నాం. వరకట్న చావులు విపరీతంగా రిపోర్ట్ అవుతున్న కాలం అది. హైదరాబాద్‌ ‌లాంటి నగరాల్లో స్త్రీ శక్తి సంఘటన సభ్యులు లలిత, రమా మెల్కోటే వంటి వారితో కలిసి డౌరీ డెత్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌కమిటీగా కలిసి పనిచేశాం. వాళ్ళందరికంటే నేను చిన్నదాన్నయినప్పటికీ వారితో కలిసి చర్చల్లో పాల్గొనటం, పనిచేయటం వల్ల, వారి అనుభవాలను వినడం వల్ల చాలా అంశాలను అర్థం చేసుకోగలిగాను, నేర్చుకోగలిగాను. ‘పీవోడబ్ల్యూ’ కార్యాచరణను రూపొందించుకోవటంలో, స్త్రీల జీవితాల్లోని ముఖ్య అంశాల మీద పనిచేయటంలో ఈ అనుభవాలన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. మేము ‘పీవోడబ్ల్యూ’ గా హైదరాబాద్‌ ‌లోనే కాకుండా, వైజాగ్‌, ‌ఖమ్మం వంటి ప్రాంతాల్లో కింది స్థాయి వరకూ కూడా వెళ్లి చాలా పనిచేసాము. ఏదన్నా అటువంటి సంఘటన మా దృష్టి కి వచ్చిన వెంటనే హింసకు పాల్పడిన ఆ కుటుంబాల ఇండ్ల ముందు వెంటనే ధర్నా చేసేసేవాళ్ళం.

సజయ : అప్పుడు వరకట్న హత్యలు కేవలం మధ్య తరగతి కే పరిమితమా లేక దిగువ మధ్య తరగతి, శ్రామిక కుటుంబాలలో కూడా వున్నాయా?
సంధ్య: అప్పుడు హైదరాబాద్‌ ‌సంగతి తీసుకుంటే దిగువ మధ్య తరగతి లో కూడా వరకట్న హత్యలు చాలా ఎక్కువ జరిగాయి. శ్రామిక కుటుంబాలలో తక్కువ. అయితే తర్వాత వర్కింగ్‌ ‌క్లాస్‌ ‌లో కూడా ఈ హత్యలు రిపోర్ట్ అవటం మొదలయ్యాయి. అప్పుడు ‘పీవోడబ్ల్యూ’ గా మేము డౌరీ డెత్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ‌కమిటీలో క్రియాశీలకంగా పనిచేయటంతో పాటు ఒక సందర్భంలో ఆ కమిటీని నడిపే పూర్తి బాధ్యతను కూడా తీసుకున్నాము. పార్టీలతో ఏ మాత్రం సంబంధం లేకుండా అనేకమంది మహిళలు విషయ ప్రాధాన్యత రీత్యా ఈ కమిటీలో పనిచేయటానికి కలిసి వచ్చిన కాలం అది. నాకు చాలా గొప్ప అనుభవం ఆ కమిటీలో పనిచేయటం. స్త్రీలు ఎదుర్కొంటున్న హింసను అర్థం చేసుకోవటానికి, పరిశీలించటానికి ఉపయోగపడింది. అందరితో జరిగిన చర్చలు, ఉద్యమాల్లో స్త్రీలు ఎదుర్కొన్న అంశాల గురించి, నిర్లక్ష్యం చేయబడిన అంశాలు, ఆ ప్రశ్నలను వెలికితీసిన ‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తకం ఇవన్నీ మా కార్యాచరణను రూపొం దించుకోవటంలో ఉపయోగపడ్డాయి.

అప్పుడు నాకన్నా సీనియర్స్ ఎం‌తోమంది మహిళా కార్యకర్తలు వున్నారు పార్టీలో. అయితే, అప్పటికే హైదరాబాద్‌ ‌బేస్డ్ ‌గా మేము సమస్యల్ని వెలికితీస్తూ, భావ సారూప్యత వున్న వ్యక్తులు, సంస్థలతో పనిచేస్తూ వుండటం వల్ల నాకు మహిళా ఉద్యమం బాధ్యతను పార్టీ అప్పజెప్పింది. ఆ బాధ్యతలు నేను తీసుకునేనాటికి ఇతర వామపక్ష మహిళా సంఘాలు ఏ కారణం చేతనో అంత యాక్టివ్‌ ‌గా లేరు. అసలు లేరని కాదు, వున్నారు. ఆ తర్వాత కాలంలో అందరం సారా వ్యతిరేక, మద్య వ్యతిరేక ఉద్యమంలోకి ఒక ఐక్య కార్యాచరణలోకి వచ్చాము.

సజయ : హైదరాబాద్‌ ‌కాకుండా, ఇతర జిల్లాలలో ఏఏ అంశాలలో మీరు ‘పీవోడబ్ల్యూ’ గా ఏఏ అంశాల మీద పనిచేశారు.
సంధ్య : రోజ్గార్‌ ‌నిధులతో మహిళల కనీస అవసరాలైన మరుగుదొడ్లు, మంచినీళ్ళ సమస్యను పరిష్కరించాలని ప్రధానమైన డిమాండ్‌ ‌గా పెట్టాం. మనమేంటి, సంక్షేమ అంశాల్ని తీసుకోవటం ఏమిటి అనే చర్చ కూడా మా సంఘంలో, పార్టీ లో కూడా జరిగింది. ఇతర ‘పీవోడబ్ల్యూ’ సంఘాల బాధ్యుల నుంచీ కూడా ఒక ప్రశ్న ఎదురైంది. రాజ్య హింస మీద మాట్లాడకుండా ఈ సంక్షేమ పథకాల వైపు వెళ్లటం ఏమిటి అని? అయితే వాస్తవం ఏమిటి? మనం ఎవరితో నయితే పనిచేస్తున్నామో ఆయా సమూహాల స్త్రీలకు గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేని స్థితి. ముఖ్యంగా మరుగు దొడ్లు. దాదాపు అందరూ ఆరుబయలు లోకే వెళ్ళాలి. ఎవరన్నా అటువైపు వస్తే లేచి నిలబడాలి.

కొన్నిచోట్ల ప్రకృతి సహజమైన కనీస అవసరాలకు అసలు బయటకు వెళ్లటానికి కూడా జాగా లేని పరిస్థితి. తూర్పు గోదావరి జిల్లా లోని కొన్ని వూర్లలో వూరందరికీ ఒక మూల ఎక్కడో కామన్‌ ‌టాయిలెట్లు వుంటాయి. పైగా అవి, డ్రై టాయిలెట్లు. ఈ విషయాన్ని ఒక అంశంగా తీసుకుని అనేక జిల్లాలలో క్యాంపైన్‌ ‌చేశాం. అప్పటికి వోల్గా గారి ‘ఆకాశంలో సగం’ అనే నవల రాలేదు. ఆ నవల కంటే ఎంతో ముందుగానే మేము శ్రామిక మహిళల రోజువారీ అంశాల మీద, మాట్లాడటానికి ఇష్టపడని అంశాల మీద రాష్ట్ర వ్యాపితంగా పనిచేశాము. రోజ్గార్‌ ‌నిధులతో మరుగుదొడ్లు కట్టించాలని ఎన్ని సెంటర్ల లోనో ధర్నాలు చేశాం, రిప్రజెంటేషన్లు ఇచ్చాం. మా ఈ వొత్తిడి వలన చాలా జిల్లాలలో పంచాయతీరాజ్‌ ‌శాఖ మరుగు దొడ్లు కట్టించటానికి ముందుకు వచ్చింది. అప్పటికి అది ఇంకా స్టేట్‌ ఎజండా గా ముందుకు రాలేదు. ఆ తర్వాత మూడేళ్లకు మరుగుదొడ్లు కట్టించటం అనేది స్టేట్‌ ఎజండాగా మారింది.

(ఇంకా వుంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page