అధికార దాహమో…
సామ్రాజ్య మోహమో..
ప్రేరేపించేది ఏధైతేనేమి!
యుద్ధం పెను విధ్వంసమే
మతోన్మాదమో..
గుత్తాధిపత్యమో
కారణాలు ఏవైతేనేమి!
యుద్ధం జాతి వినాశనమే
దురాక్రమణో తిరుగుబాటో
దండయాత్రో ఆయుధ దాడో
అది ఏ రీతిగా సంభవించినా
యుద్ధం మిగిల్చేది విషాదమే
అవాంఛిత యుద్ధంలో
గెలుపోటమి ఎవరిదైనా
మసకబారేది మానవత్వం
మంటగలిసేది మనిషితనం
రణాన్ని రమించడమంటే
మృత్యువును హత్తుకోవడం
చితి మంటలతో చలి కాగడం
శవాలతో సహవాసం చేయడం
ఏకంగా మనిషిగా మరణించడం
యుద్ధకాంక్షతో రగిలేవాడు
ఎప్పటికైనా జాతి ద్రోహిగా
మిగిలిపోక తప్పదు సుమీ!
చరిత్ర చెప్పే నికార్సు నిజం
ఇకనైనా ప్రపంచ జనావళి
యుద్ధోన్మాదాన్ని నిషేధించి
శాంతి స్థాపనకు సంకల్పిస్తే
మానవాళి అస్తిత్వం సుస్థిరం
భువన తలం స్వేచ్చా సధనం
(సూడాన్ దేశంలో అంతర్యుద్ధం నేపథ్యంగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493