ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతూ..మహిళలను అవమానం
బెంజ్ కార్లలో తిరుగుతూ..ఆటోలో వొచ్చి డ్రామాలు
అసెంబ్లీ వేదికగా బిఆర్‌ఎస్ నాయకుల తీరుపై
మండిపడ్డ మంత్రులు పొన్నం, సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : బిఆర్‌ఎస్ నాయకుల తీరుపై అసెంబ్లీ వేదికగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క మండిపడ్డారు. ఆర్టీసీపై వారు చేసిన నిర్వాకాన్ని నిలదీశారు. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ ఇవ్వటం వల్ల.. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారంటూ ప్రస్తావించారు.. ఈ వ్యాఖ్యలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు తీవ్రంగా స్పందించారు. ఇంకా అధికారంలో ఉన్నామన్న భావనలో చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామని..తాము ఏం చెబితే అది వినాలనే భ్రమలో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు విమర్శలు చేశారు. గవర్నర్ ప్రసంగంపై దన్యవాద తీర్మానంలో భాగంగా బిఆర్‌ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వొచ్చిన తరువాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు.
535 కోట్ల విలువ గల బస్ ఫెయిర్స్‌ని ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకి 15000 ఇవ్వాలని హరీష్ రావు అంటున్నారని.. మరి విూ హయాంలో ఎందుకు ఇవ్వలేదని పొన్నం ప్రశ్నించారు. సభని తప్పుదోవ పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారని..అసలు అటో డ్రైవర్లను ఆత్మహత్య చేసుకునేలా విూరే ప్రేరేపిస్తున్నారని పొన్నం దుయ్యబట్టారు. బస్సులు ప్రయాణికుల దగ్గరకు వెళ్లడం లేదని.. ప్రయాణికులే బస్సుల దగ్గరకు ఆటోల ద్వారా వొస్తున్నారన్నారు. అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే విూకు ఎందుకు ఈర్ష్య అని ప్రశ్నించారు. ‘వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించవద్దా..విూరు వ్యతిరేకిస్తున్నారా..గతంలో విూరు ఎపుడైనా ఆటోల్లో ప్రయాణం చేశారా…అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆటో డ్రైవర్లను పట్టించుకోవడం లేదన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు పదేళ్లలో ఆర్టీసీ కార్మికులను, సిబ్బందిని ఆగం చేశారని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లను బీఆర్‌ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఆటో కార్మికులు తెలంగాణ బిడ్డలని చెప్పారు. ఇచ్చిన హావిూలన్నీ తప్పక నెరవేరుస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ అన్యాయం చేయదన్నారు. ధైర్యం ఉంటే మహిళలకు ఫ్రీ జర్నీ వద్దా..లేదా అన్నది బీఆర్‌ఎస్ నేతలు చెప్పాలని మంత్రి పొన్నం సవాల్ విసిరారు. 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని..బీఆర్‌ఎస్ నేతలు సభను తప్పుదోవపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. బెంజ్ కార్ల తిరిగినోళ్లు..ఇవాళ ఆటోలో వొస్తూ అవమానిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎప్పుడైనా ఆటోడ్రైవర్లను ఆదుకుందా అని ప్రశ్నించారు. పేద మహిళలు ప్రయాణించేది ఆర్టీసీ బస్సుల్లోనే అని..అలాంటి పేద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణం కల్పిస్తే..బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారామె. మహిళలకు ఫ్రీ బస్సు ఉండాలా.. వద్దా అనే విషయంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇవ్వాలని.. పేద మహిళలకు ఎందుకు ఫ్రీ బస్సు జర్నీ వద్దని ఎందుకు అంటున్నారో చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచి.. ప్రయాణికులపై భారం వేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రైతు బంధు పేరుతో ధనవంతులకు డబ్బులు వేసిన చరిత్ర వారిదని.. పేద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. పేదలకు ఉచిత ప్రయాణం వద్దని బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీలో డిమాండ్ చేయటం ఏంటని మంత్రి సీతక్క నిలదీశారు. ఇకపోతే ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి యాదాద్రిని అడ్డాగా మార్చుకుని..దోచుకున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐర్లయ్య. అభివృద్ధి పేరుతో 50 శాతం నిధులు మళ్లించుకున్నారని ఆరోపించారు. యాదాద్రి అభివృద్ధి పేరుతో 500 మందిని రోడ్డున పడేశారు.. అందులో 15 కుటుంబాలు చనిపోయాయని చెప్పారు. వేల కోట్లతో యాదాద్రిని నిర్మించి..కనీస సౌలతులు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్ల గురించి బీఆర్‌ఎస్‌కు మాట్లాడే అర్హత లేదన్నారు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలంటున్న బీఆర్‌ఎస్ నేతలు వాళ్ల హయాంలో యాదాద్రిపైకి ఆటోలను అనుమతివ్వ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చాక యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతిచ్చామని చెప్పారు. కనీస వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.