* ముచ్చటగా మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి
* ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరు
* మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు
ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 27: ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని.. అయన విజయాన్ని ఎవరూ ఆపలేరని మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు అన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్ల పాలనలో జరిగిన బీఆర్ఎస్ అభివృద్ధిని.. గత 50 ఏళ్ల కాంగ్రెస్ ఘోరమైన పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకొని వోటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రగతికి పదేళ్లు కావొస్తోందని.. ఈ దశాబ్ద కాలంలో భారత రాష్ట్ర సమితి అందించిన సంక్షేమాలను చూసి ప్రజలు వోటు వేయాలని ఆయన కోరారు. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవని పునరుద్ఘాటించారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. నాడు ఏ వర్గం ప్రజలు కూడా బాగుపడిన దాఖలాలు లేవన్నారు. ఆ ఇందిరమ్మ రాజ్యంలోనే కదా అత్యవసర పరిస్థితి విధించి ప్రజలను ఇబ్బంది పెట్టింది అని రామారావు విమర్శించారు. జాగ్రత్తగా ఓటు వేయకుంటే చేసిన అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అటువంటి పరిస్థితులు మళ్లీ రాష్ట్రానికి రావొద్దని అన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ ముందే ఉందని పేర్కొన్నారు. అందుకోసం ఆలోచించి వోటు వేయాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ హయాంలో నీటిపై పన్ను ఉండేదని.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రద్దు చేశారని తెలిపారు. దేశంలో నీటి పన్ను లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. రైతుబంధు దుబారా అని కొందరు.. రైతులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వడం వృథా అని మరికొందరు కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. తెలంగాణలో రైతు రాజ్యం ఉందని.. కాంగ్రెస్ వస్తే రైతులకు ఉరి పడటం గ్యారంటీ అని ఆయన హెచ్చరించారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్ అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే కౌలుదారుల చట్టం తెస్తామని.. రైతుబంధు కౌలుదారులకే ఇస్తామని అంటుందన్నారు. దానివల్ల కౌలుదారు రెండు, మూడేళ్లు సాగు చేస్తే రైతు భూమి గోల్మాల్ అవుతుందని ఆక్షేపించారు. మళ్లీ రైతులు తమ భూమి కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వొస్తుందని పేర్కొన్నారు. రైతులు జాగ్రత్తగా ఆలోచించి వోటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్కు వోటు వేస్తే.. పదేళ్లు తాను కేసీఆర్ పడిన కష్టం వృథా అవుతుందని తెలిపారు. కాంగ్రెస్కు వోటు వేస్తే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లేనని అన్నారు. మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తోందని, ముచ్చటగా మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.