మనుషుల మధ్య విద్వేషం కాదు.. సమగ్ర జీవనాభివృద్ధి కావాలి!

  • వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి 
  • డాక్టర్‌ కడియం కావ్యతో స్వతంత్ర జర్నలిస్ట్‌ కె.సజయ సంభాషణ 

రాజకీయ రంగంలోకి మహిళలు రావడం అనేది నిజంగా ఆహ్వానించదగిన అంశం, ముఖ్యమైన అంశం. కొంతమందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ద్వారా అవకాశం వస్తే మరికొంతమంది స్వతంత్రంగానే రాజకీయరంగ ప్రవేశం చేయాల్సి వుంటుంది. డాక్టర్‌ కడియం కావ్య ఒక అణగారిన వర్గాల ప్రతినిధిగా, డాక్టర్‌గా, ప్రొఫెషనల్‌గా వున్న తెలంగాణ యువ తరంగం. ఈతరం మహిళలు రాజకీయాలను తమ పూర్తికాల ఆచరణగా మార్చుకుంటూ రావడం ఆహ్వానించదగిన అంశం. అందుకు డాక్టర్‌ కడియం కావ్యకి ప్రజాతంత్ర దినపత్రిక సంకేతం కాలమ్‌ తరఫు నుంచీ అభినందనలు.  ఇప్పటివరకూ ఒక వ్యక్తిగా డాక్టర్‌ కావ్యగా తను నిర్వహించిన పాత్ర ఒక విధమైతే, ఇప్పటినుంచీ ఈ రంగంలో వారి పాత్ర వేరేవిధంగా బాధ్యతాయుతమైనదిగా వుండబోతోంది.

అది అధికార పక్షంలో వున్నా గానీ లేదా ప్రతిపక్షంలో వున్నాగానీ ఒక రాజకీయవేత్తగా ప్రజాస్వామ్య పద్ధతిలో తన  ప్రయాణం సాగాలని ఆశిద్దాము. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న విమర్శలు, వ్యక్తిగత దూషణలు, దేశంలో పెరుగుతున్న నియంతృత్వ ధోరణులు, కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఏం బాధ్యత పడబోతోంది, తమ కార్యాచరణ ఏ విధంగా వుండబోతోంది అనే అంశాల మీద తన అంతరంగాన్ని పంచుకున్నారు. ఈనాటి రాజకీయ అభ్యర్థులలో తప్పనిసరిగా కావలసింది విద్వేషాలు రేపే వాచాలత్వం కన్నా, స్పష్టమైన అవగాహనతో విమర్శను కూడా హుందాగా స్వీకరించే ఇలాంటి సంయమనం. తనకు ధన్యవాదాలు.

సజయ: దేశ రాజకీయాలు గానీ, రాష్ట్ర రాజకీయాలు గానీ మూస ధోరణిలో మారాయి. దీనితో అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలంటే విసుగు పడే పరిస్థితి వచ్చింది. ఈ ధోరణిని మార్చడానికి మీరేం చేయగలరు?

డా. కడియం కావ్య: నా చిన్నప్పటి నుంచీ ఇంట్లో రాజకీయ వాతావరణం వుండేది. నేను చదువుకుంటున్నప్పుడు నాన్నగారు మినిస్టర్‌ గా వుంటుండే. అయితే మా చుట్టుపక్కల చాలామంది పాలిటిక్స్‌ అంటే మంచి ప్రొఫెషన్‌ కాదు, అందులో అంతా మోసమే వుంటుంది, అందరూ ఆవినీతిపరులే వుంటారు, అవకాశవాదులే వుంటారు అని ఎవరికివాళ్ళు అనుకునేది. రాజకీయాల్ని ప్రొఫెషన్‌ గా తీసుకునేది చాలా తక్కువమంది వుంటారు. తక్కువ ఇంటరెస్ట్‌ చూపిస్తారు. కానీ, ఆ రాజకీయాల్ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కూడా మనదే! ఒక క్లారిటీ ఆఫ్‌ మైండ్‌ తో, మనమెందుకు వెళుతున్నాం అసలు అని ఆలోచించుకోవాలి. మన రాజకీయ పదవులు ఒక పెట్టుబడిగానో లేక ఒక అవకాశవాదంగానో తీసుకోకుండా, సమాజానికి మనమేదైనా చేయగలుగుతామా అని ఆలోచించాలి. నేను ఒక డాక్టర్‌ గా, వెనుకబడిన వర్గాల మహిళగా, నా అనుభవంలో నేను చూసిన, అర్థంచేసుకున్న అనేక అంశాలు వున్నాయి. మెన్స్ట్రువల్‌  హైజీన్‌ (ఋతు సంబంధిత ఆరోగ్యం) మీద కడియం ఫౌండేషన్‌ అనే సంస్థను ప్రారంభించి పనిచేయడం మొదలుపెట్టాను. చాలామంది ఆడపిల్లలు ఆ సమయంలో స్కూల్స్‌ లో సరైన సౌకర్యాలు లేకపోవటం వల్ల స్కూల్‌ మానేసేవారు.

కొంతమంది పూర్తిగా డ్రాప్‌ అవుట్‌ అయిపోయేవారు. టాయిలెట్స్‌ సరిగా లేక, సరైన నీటి సౌకర్యం లేక, బహిస్టు అనే ప్రకృతి సహజ శారీరక అంశాల గురించీ సరైన అవగాహన లేక చాలా సమస్యలను ఎదుర్కునేవారు. ఆ సంస్థ తరఫున స్కూల్స్‌ లో అవగాహన తరగతులు నిర్వహిస్తూ, ఒక వ్యక్తిగా ఆ స్కూల్స్‌ లో  చదివే ఆడపిల్లలకు ఒక లక్ష దాకా నాప్కిన్స్‌ అందజేయగలిగాను. అప్పుడు మా నాన్నగారే మినిస్టర్‌ గా వుండేది. ఆయన దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అని చాలా చర్చించిన మీదట ప్రభుత్వం తరఫున మెన్స్ట్రువల్‌ హైజీన్‌ మీద డిపార్ట్మెంట్‌ నుంచీ ఒక  ప్రోగ్రాంని తీసుకున్నారు. ఏదైనా అభివృద్ధికరమైన, సమాజానికి అవసరమయిన అంశం ముందుకు తీసుకు వెళ్లాలంటే రాజకీయాల్లో వుండటం ఒక మంచి ఫ్లాట్‌ ఫారం అని, దానివల్ల ఎంతోమందిని ప్రభావితం చేయవచ్చు అని నాకు అనిపించింది. ఒక మహిళగా డాక్టర్‌ గా నేను నమ్మేది ఏమిటంటే ఆరోగ్యం అనేది మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. మహిళల ఆరోగ్యంలో మెన్స్ట్రువల్‌ అంశం కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయటం కానీ, రహస్యంగా వుంచటం కానీ, సిగ్గు పడటం, అవమాన పడటం వంటివి అస్సలు చేయకూడదు. మానవ మనుగడలో అత్యంత ముఖ్యమైన అంశం ఇది. దాని చుట్టూ అనేక అనేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఆపోహలూ, ఆంక్షలూ నిర్బంధాలను మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

అలాగే ఇప్పుడు వాడుతున్న ప్యాడ్స్‌ లో వుండే ప్లాస్టిక్‌ వల్ల వాటిని పారవేసేటప్పుడు పర్యావరణ సంబంధిత సమస్యలు కూడా ఎన్నో వున్నాయి. పర్యావరణానికి నష్టం చేయకుండా వుండే విధానాల మీద కూడా చాలా పరిశోధన జరుగుతోంది. మెన్స్ట్రువల్‌ కప్స్‌ ఒక మంచి పరిష్కారంగా ముందుకు వచ్చాయి. అయితే వాటి గురించి పూర్తి అవగాహన అందరికీ అందలేదు. క్లాత్‌ ప్యాడ్స్‌ గురించి కూడా అవగాహన తీసుకురావాలి. నేను ఎక్కడికెళ్లినా గానీ ఈ విషయాల మీద మాట్లాడుతూనే వుంటాను. ఎక్కువ బ్లీడిరగ్‌ అయినా సమస్యే, తక్కువ బ్లీడిరగ్‌ అయినా సమస్యే! పోషకాహారం చాలా అవసరమవుతుంది. దీని మీద ఇంకా పెద్ద ఎత్తున చైతన్యం రావాల్సి వుంది. అంతే గానీ అదొక రహస్యమైన అంశంగా ఇంకా ఎంత మాత్రం కొనసాగకూడదు.

సజయ: ఈ విషయంలో మీ అనుభవం మరిన్ని వ్యవస్థాపూర్వక మార్పులకు నాంది పలకాలని ఆశిద్దాం. అయితే, రాజకీయాల్లో నెగ్గుకురావడం మహిళలకు అంత సులభమైన విషయమేమీ కాదు. అన్నిరకాల సమస్యలను ఎదుర్కుంటూనే పనిచేయాల్సి వుంటుంది. పురుషాధిపత్యం బలంగా వేళ్లూనుకుని వున్న రంగం ఇది. రాజకీయ కుటుంబ నేపథ్యం వున్నప్పటికీ కూడా చాలా సమస్యలను మహిళలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో మీ అనుభవం ఎలా వుంది?

డా. కడియం కావ్య: మా నాన్నగారు రాజకీయాల్లో వున్నప్పటికీ కూడా నాకు ఈ అవకాశం రావటానికి దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టింది. నేను 2015 ప్రాంతం నుంచే రాజకీయంగా నా ఉనికిని స్థిరపరచుకోవటానికి పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి దాకా అవకాశం రాలేదు. కుటుంబ నేపథ్యం వున్నంతనే అందరికీ అవకాశాలు ఏమీ వెంటనే రావు. చాలా అంశాలు పనిచేస్తాయి. అప్పటినుంచీ వివిధ సందర్భాల్లో నా పేరు లిస్ట్‌ లో రావటం, మళ్లీ డ్రాప్‌ అయిపోవటం జరిగింది. 2018లో, 2019లో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కానీ అవకాశం అయితే దక్కలేదు. కారణాలు చాలా వుంటాయి. మహిళల మీద చిన్న చూపు, మహిళకు ఎందుకు పురుషులకే ఇస్తే పార్టీకి ఉపయోగం అనుకోవటం, పార్టీలో ఒకరిద్దరు మహిళలకే ప్రాధాన్యం వుండటం, మిగిలినవారిని పక్కనపెట్టేయడం- ఇలా చాలా విషయాలు వున్నాయి. అలానే ఒకసారి రాజకీయాల మీద ఆసక్తితో, ఉత్సాహంగా బయటకు వచ్చిన వెంటనే క్యారెక్టర్‌ మీద నిందలు వేయడం, మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడం, అనేక రకాలుగా మహిళలను తగ్గించాలని ప్రయత్నం చేస్తారు. వోర్చుకోలేరు. రిజర్వేషన్‌ వుంది కాబట్టీ పంచాయతీ, నగర, పట్టణ, జిలా పరిషత్‌ స్థానిక సంస్థల్లో మహిళలు కనిపిస్తున్నారు. కానీ, చట్టసభల్లో రిజర్వేషన్‌ లేకపోవటం వల్ల పార్టీల్లో కూడా మహిళా అభ్యర్థిత్వాల మీద ప్రాధాన్యత వుండదు. గట్టి ప్రయత్నం మీద వచ్చినా గానీ నిలదొక్కుకోవటం చాలా కష్టం. ఒకసారి గెలవొచ్చు, లేదా వోడిపోవచ్చు. వెనుక సపోర్ట్‌ సిస్టమ్‌ వుండాలి. ఫ్యామిలీ సపోర్ట్‌ వుండాలి. నిలబడాలి అన్న పట్టుదల కూడా ముఖ్యం. అలా పది ఇరవై ఏళ్లు వుంటేనే ఏదైనా ఇంపాక్ట్‌ ఇవ్వగలుగుతాము. ప్రభుత్వ, పాలనా వ్యవస్థలలో అట్టడుగు సమూహాలకు చేరువయ్యేలా అభివృద్ధిని తీసుకురాగలుగుతాము.

సజయ: మీకు రాజకీయ కుటుంబ నేపథ్యం వున్నప్పటికీ, ఒక మహిళగా, సామాజికపరంగా ఏదైనా వివక్షను ఎదుర్కొన్నారా?
డా. కడియం కావ్య: రాజకీయాలంటేనే వీటన్నిటినీ ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. నేను ఇక్కడ పోటీలో నిలబడిన వెంటనే నామీద దాడి మొదలయింది. నేను వేరే మతం, వేరే ప్రాంతం అతన్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి అసలు ఎస్సీ కాటగిరిలోకి రానని, ఇక్కడ తెలంగాణ అమ్మాయిని కాదని… ఇలా వచ్చిన వెంటనే నామీద తీవ్రస్థాయిలో వ్యక్తిగతంగా దాడి మొదలయింది. నిజానికి నేను పార్టీ పరంగానో లేదా అంతకు ముందు వ్యక్తిగా నేనేం చేసిన్నో కదా చూడాల్సింది. ఆ విధంగా నన్ను ఎవరూ ప్రశ్నించడం లేదు, విమర్శించడం లేదు. అడగటం లేదు. నిజానికి రాజకీయాల్లో విమర్శ అనేది హుందాగా వుండాలి. మనం ప్రామిస్‌ చేసిన అంశాల మీద వుండాలి. కానీ, అది వ్యక్తిగతంగా వికృతస్థాయిలోకి మారిపోయింది.

ఇప్పుడు నా ప్రత్యర్థులు ఎవరైతే వున్నారో వారు కేవలం నా వ్యక్తిగతం అయిన విషయాలను ప్రస్తావిస్తున్నారు.  నేను ఎస్సీలోకి రానని , నా మతం మీద, నా కులం మీద, నేను ముస్లింని పెళ్లి చేసుకున్నానని, మా అత్తగారి వూరు గుంటూరు అని ఇలా ప్రాంతాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా విభేదాలు తేవాలని విమర్శలు చేస్తున్నారు. దాడి చేస్తున్నారు. నన్ను జనంలో పలుచన చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఒక మహిళగా ఇంతకంటే ఎక్కువ దాడి వుండదు. నన్ను ఇప్పుడు ఎవరైతే ప్రాంతం పేరుతో విమర్శిస్తున్నారో వారి కుటుంబసభ్యులు కూడా ఆంధ్రాప్రాంతం వారే! ఇక్కడ జెండర్‌ ఈక్వాలిటీ లేదు. వాళ్లు ఏ ప్రాంతం వ్యక్తులతో అయినా సంబంధాలు కలుపుకుపోవచ్చు. కానీ నేను మహిళను కాబట్టి అలా చేయకూడదు! అలా చేస్తే నేను ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించరు. ఇది ఎస్సీ రిజర్వ్డ్‌ నియోజకవర్గం కాబట్టి, ఇక్కడ ముఖ్య విషయమేమంటే నేను ఎస్సీనా కాదా అనేదే ముఖ్యం.

మాకు  రెండు రోజుల క్రితం కలెక్టర్‌ ఆఫీసులో స్క్రూటిని కూడా జరిగింది. అన్ని పరిశీలనలూ అయిన తర్వాత ఎంపీ అభ్యర్థిగా నా అభ్యర్థిత్వాన్ని అక్కడ నిర్ధారిస్తూ ఖరారు చేశారు. నేను నా సర్టిఫికెట్స్‌ అన్నీ అక్కడ ఆఫీసులో ఇచ్చాను. నా ప్రత్యర్థులకు అంత సమస్య వున్నప్పుడు, నా మీద అన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆరోజు అక్కడ రుజువులతో రావాలి కదా? రాలేదు! కలెక్టర్‌ గారికి ఫిర్యాదు చేయలేదు. కేవలం నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటమే వాళ్ల ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు బీజేపీ అభ్యర్ధిగా నిలబడినవారు ఇంతకు ముందు అక్కడ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నేను పనిచేసిన హాస్పిటల్‌ కు చాలాసార్లు వచ్చారు. నేను బాగా తెలుసు కూడా. అయినాగానీ ఇప్పుడు నామీద ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. బురద చల్లుతున్నరు. నేను వరంగల్‌ లోనే చదువుకున్నా, వరంగల్‌ లోనే జాబ్‌ చేసినా! అందరికీ తెలుసు. కానీ కావాలని నన్ను సైడ్‌ చేయాలని అలా మాట్లాడుతున్నారు. ఇంకో విషయం, అమ్మాయికి పెళ్లి అయిన వెంటనే తన స్వస్థలంతో సంబంధం లేదని అనడమే మనువాదం.  అది నా మీద బాగా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నరు. (మిగతా రేపటి సంచికలో…)

-కె.సజయ,
సామాజికవిశ్లేషకులు,
స్వతంత్ర జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page