సవాళ్ళ మధ్య సర్కార్ బడులు

“తల్లి తన పిల్లలను చంపుకున్నచందంగా ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను సమాధి చేయటం ఏకంగా 23000 బడులను మూసివేయబోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పేద ,దళిత ,బాలికల చదువుకునే హక్కును కాలరాసే ప్రజా వ్యతిరేక నిర్ణయమిది. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ బడులలోనే చేర్పించందుకు సిద్దపడటమే కాదు,బడిబాట లక్ష్యాలు నెరవేరే అవకాశాలు కూడా దూరమవుతాయి.”   
-వాడపల్లి. అజయ్ బాబు ఉపాధ్యాయుడు. TPTF.

పాఠశాల విద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం లక్ష్యాలను నిర్ధేశించాలి.ఇందుకు భిన్నంగా పాఠశాల విద్యారంగంపై బ్యూరోక్రా ట్ వ్యవస్థ అజమాయిషీ పెరగటం,ప్రయివేట్ కార్పోరేట్ వ్యవస్థల జోక్యంతో పదేపదే విభిన్న నిర్ణయాలతో ప్రభుత్వం పాఠశాల విద్యాభివృద్ధిని  ప్రభుత్వం అయోమయంలోకి నెట్టివేయటం పై ఎవరికీ పట్టింపు లేకుండా పోయింది. విద్యాభివృద్ధికి సంబంధించిన ఏ మార్పు లైనా ప్రజోపయోగం కోసం రూపొందించాలి,కానీ ఇందుకు భిన్నంగా  అమలయ్యే కార్యక్రమాలు ప్రజలు  వ్యతిరేకించక మానరు.

    గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి విద్యా సంవత్సరం పొడవునా పాఠశాలలో విద్యేతర కార్యక్రమాల జోరు నడువటం రివాజుగా మారిం ది. ఉపాధ్యాయులను తరగతి గదికే పరిమితం చేయడం మాత్రమే పాఠశాల అభివృద్ధికి ,తల్లిదండ్రులకు ఆ బడి పై విశ్వాసం పెరిగేందుకు దోహదపడుతుంది.కానీ గతేడాది విద్యా సంవత్సర క్యాలెండర్ కు భిన్నంగా అనేక రకాల శిక్షణల పేరిట ఉపాధ్యాయులను తరగతి గదికి దూరం చేశారు. ప్రకటించిన విద్య క్యాలెండర్ లోని పని దినాలకు,పాఠ్యప్రణాళికల నిర్వహణ.సిలబస్ పూర్తి,మధ్యంతర పరీక్షల నిర్వహణలకు విఘాతం కలుగకుండా విద్యేతర కార్యక్రమాలు నిర్వహించడం అవసరం. రకరకాల ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి తరగతి గదులను వేదిక చేశారు. *చదువు చారెడు బలపాలు దోసెడు* అన్నట్టు రకరకాల మానిటరింగ్ టీమ్ ల సందర్శనలు,ప్రభుత్వ , ప్రభుత్వేతర రంగాలు నిర్వహించిన రకరకాల పోటీ పరీక్షల తో, అనివార్యమైన స్థానిక ఎన్నికలు,హెడ్ మాస్టర్లకు అదనపు ఆఫీస్ బాధ్యతలు, ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన పర్య వీక్షణలు,ఎజెండాలు మారని కాంప్లెక్స్ సమావేశాలు, తదితరాలతో బడి బోధనాభ్యసనలకు దూరమైంది.
    కమిషనర్ అండ్ డైరెక్టరేట్ కార్యాలయం(ఎస్.సి.ఇ.ఇర్.టి) రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా మండలి వీటిలో ఏ కార్యాలయం అజమాయిషీలో పాఠశాల విద్య ఉందో  అర్థం కాదు.రెండు వైపుల నుండి వచ్చే ఉత్తర్వులు, శిక్షణల ఆదేశాలు,వివిధ రకాల మానిటరింగ్ టీమ్ల  సందర్శనలూ పాఠశాల విద్యను ఎంతో కొంత గందరగోళానికి గురి చేస్తూండటం గమనార్హం ఈ యేడు కూడా బడిబాట తో ప్రభుత్వ బడిలో విద్యార్థుల నమోదు పెంచాలనే లక్ష్యంతో ముందడుగేసింది.బ్యానర్లతో,పాటల తో,కరపత్రాలతో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కొనసాగింది.కొన్ని జిల్లాలలో యేళ్ళుగా మూతబడిన పాఠశాలలు మళ్ళీ తెరిచారు. మహబూబాద్ జిల్లాలో జిల్లా విధ్యాధికారి,వివిధ సాంస్కృతిక కార్య కలాపాలతో,పౌర, ప్రజా సంఘాలతో ,రిటైర్డ్ ఉపాధ్యాయులతో గ్రా మగ్రామాలు తిరిగి , తల్లిదండ్రులతో మాట్లాడి మూతబడిన నాలుగు పాఠశాలలు తిరిగి తెరిపించారు.వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామ సభ ప్రభుత్వ బడికి తమ పిల్లలను పంపితే ఆస్తిపన్ను మినహాయించింది.ఓదెల గ్రామసభ ప్రభుత్వ బడిలో ప్రతి నమోదుకు రెండు వేల నగదు బహుమతిని ప్రకటించారు తల్లిదండ్రులు, ప్రభుత్వోద్యోగులు అధికారులు స్వచ్చంధంగా తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించారు.ఊరి బడిని కాపాడుకోవటం పై గ్రామాలు ఆసక్తితో బడిబాట ను విజయవంతం చేశారు.యేళ్ళ తరబడి మూసివున్న మరికొన్ని బడులను తిరిగి తెరిపించేందుకు గ్రామస్థులు,ఉపాధ్యాయులు ఎంతో ఉత్సిహంతో కృషి చేస్తున్నారు.
    ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ యేడు బడిబాటలో తల్లిదండ్రులను విశేషంగా ఆకర్షించింది. నర్సరీ ,ఎల్.కె.జీ. లేకుండా కేవలం 5 సంవత్సరాలు నిండిన పిల్లల కోసం యు.కె.జీ. ఏర్పాటు చేయడం పూర్వ ప్రాథమిక విద్య అనిపించుకోదు. ప్రభుత్వ బడిలో నర్సరీ , ఎల్.కె.జి. అవకాశం లేనప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు బడుల్లో నర్సరీ ఎల్.కే.జీ. చదివిస్తారు.అక్కడి నుండి ఇదే పిల్లలు యూ.కే.జీ.కోసం ప్రభుత్వ బడికి వస్తారనేది నమశక్యంగా లేదు.నర్సరీ,ఎల్.కే.జీ.లేని పూర్వ ప్రాథమిక బడిని తల్లిదండ్రులు అంగీకరించటం ఊహించలేము.ఈ సెక్షన్లు  బోధించేందుకు తాత్కాలిక పద్దతిన తీసుకుంటున్న అభ్యర్థుల వేతనం కూడా అతి తక్కువగా ఉండటంతో నాణ్యత గల ఫాకల్టీ ఏర్పాటు కావడం అసాధ్యం.
   ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతాన్ని మరింత పెంచేందుకు బడిబాట విజయవంతం చేయమని ప్రభుత్వం ఉద్బోధించింది.మరో వైపు ఇరవై ఏడువేల బడుల మూసివేత అనే ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించటంతో ప్రభుత్వ బడుల మనుగడ ప్రశ్నార్ధక మయింది.ఈ ప్రకటన తల్లిదండ్రులను అయోమయానికి గురి చేసింది.తమ పిల్లలను ఊరిబడిలో చదివించాలనునే తల్లిదండ్రులకు త మ.ఊరిబడి ఉంటుందో  మూసివేతకు గురవుతుందో అనే అనుమానం కలుగక మానదు.  విభిన్న నిర్ణయాల ఆచరణతో ఎవరి ప్రయోజనాలు ఏమున్నాయో కానీ వేలాది గ్రామాలు బడి కి దూరమవుతు న్నాయి. *తల్లి తన పిల్లలను చంపుకున్న* చందంగా ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను సమాధి చేయటం ఏకంగా 23000 బడులను మూసివేయబోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పేద ,దళిత ,బాలికల చదువుకునే హక్కును కాలరాసే ప్రజా వ్యతిరేక నిర్ణయమిది. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ బడులలోనే చేర్పించందుకు సిద్దపడటమే కాదు,బడిబాట లక్ష్యాలు నెరవేరే అవకాశాలు కూడా దూరమవుతాయి.
     బడి పిల్లలకూ,కళాశాల విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఉన్న మధ్యాహ్న భోజనం కళాశాల విద్యార్థులకు కూడా అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ పథకంలో తొలి విడత మొత్తం 1,302 విద్యాసంస్థల్లో ప్రారంభించనుంది. అందులో 1,269 పాఠశాలలు, 33 కళాశాలలు ఉన్నాయి.వాటి ల్లోని మొత్తం 1,44,610 మంది విద్యార్థులకు వారంలో ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు ఉదయం పూట అల్పాహారం అందనుంది.పాఠశాలల్లో బ్రేేక్‌ఫాస్ట్‌ లో భాగంగా అల్పాహారానికి రూ.540 కోట్లు, పాలకు రూ.180 కోట్లు.ఇంటర్‌ విద్యార్థులకోసం 56 కోట్లు ఖర్చుచేయనున్నారు.కొన్ని జిల్లాలకే ఈ పథకం అమలు చేయడమే కాకుండా విద్యా సంవత్సరం చివరి వరకూ కొనసాగిస్తారన్న హామీ లేదు. ఏటా రూ. 815 కోట్ల నిధులు వెచ్చించను న్నారు.విద్యా సంవత్సరం మధ్యలో నిధులు లేవంటూ చేతులెత్తేయరన్న గ్యారెంటీ లేదు.గతంలో బ్రేక్ ఫాస్ట్ పథకం కోసం హెడ్ మాస్టర్లు భరించిన డబ్బుల బాకీ పెండింగ్ లోనే వుంది.ఈ బ్రేక్ ఫాస్ట్ పథకం విద్యా.సంవత్సరం చివరి వరకూ కొనసాగించటం అవసరం. దాదాపు ఎనభై శాతం ప్రభుత్వ బడి పిల్లలు ఉదయం ఖాలీ  కడుపుతోనే బడికి హాజరవుతారు. బ్రేక్ ఫాస్ట్,మధ్యాహ్నం భోజనం కోడిగుడ్డు సిద్దం చేసే ఏజెన్సీలు నాణ్యత పై దృష్టి సారించాలి .
     నూతనంగా పూర్వ ప్రాథమిక సెక్షన్ ల నిర్వహణ ఏర్పాట్లు,ఉన్నత పాఠశాలలో రెగ్యులర్ ఉపాధ్యాయుల కొరత, తాత్కాలిక వర్క్ అడ్జస్ట్ మెంట్ లు,ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో తరగతి.కొక ఉపాధ్యాయుడు ఉండేలా చూడటం ,వంటి సంసిద్దతలు పూర్తయ్యే వరకు జూలై నెల మొదలవుతుంది.ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు బడుల మూసివేత నిర్ణయం *మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు* గా మారింది. రెగ్యులర్ మండల విద్యాధికారులు లేక పోవటంతో మండల స్థాయి పర్యవేక్షణ ,నిర్వహణ కునారిల్లుతుంది. *ఊరి బడిని మూసేయటం అంటే పచ్చని చెట్టును* చంపు కోవటమే అంటూ విద్యారంగ మేధావులూ.ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన పెద్ద యెత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.
తల్లిదండ్రులు,గ్రామసభలు ఈ బడుల మూసివేత ను వ్యతిరేకిస్తున్నారు. బడుల కుదింపుతో ప్రభుత్వ బడులకు మనుగడ అనుమానస్పదమేనని ముఖ్యమంత్రి మాటల తోనే తేలిపోవటంతో మధ్య,దిగువ మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేట్ బడులలో చేర్పించే అవకాశం ఉంది .ఈ మేరకు ఈ విద్యా సంవత్సరం గతం కన్నా ప్రభుత్వ బడులలో నమోదు శాతం పడి పోయేందుకు అవకాశం ఉంది .
    విద్యారంగంలో క్షేత్రస్థాయి అనుభవం లేని అధికారులూ,ఎన్.జీ.ఓ. లు చెప్పినట్టు ప్రభుత్వం వినటమే జరిగితే వేలల్లో బడులు మూసేయాలనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ముందుకొస్తాయి.ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం చెప్పినట్టు అధికారులు నడుచుకుంటే మూతబడిన బడులు తెరుచుకొని ఊరిబడి ఉనికి కాపాడబడుతుంది. ప్రజల కొరకు ప్రభుత్వం మా..! కార్పొరేట్ వ్యవస్థకు ప్రతినిధులుగా వ్యవహ రించే వారి కొరకు ప్రభుత్వమా..?అనే విషయం తేటతెల్లమవుతున్న ది. అది ప్రజాగ్రహంగా మారకముందే ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవల్సి ఉంది.
-వాడపల్లి. అజయ్ బాబు 
ఉపాధ్యాయుడు. TPTF.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *