Take a fresh look at your lifestyle.

మతోన్మాద శక్తులు పెట్రేగి పోతున్నాయి

స్వార్థ రాజకీయాల కోసం వికృత ప్రయత్నాలు
అప్రమత్తంగా లేకుంటే ఆగమయిపోతం
అభివృద్దిలో దూసుకుపోతున్న రాష్ట్రం అంధకారంలో పడరాదు
ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధితో సాగుతున్నం
56 ఏళ్లు ఉమ్మడి పాలనలో మగ్గాం
అన్ని ప్రాంతాల మాదిరే హైదరాబాద్‌ ‌సంస్థానం దేశంలో విలీనం
పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
జెండా ఆవిష్కరించి ప్రసంగించిన సిఎం కెసిఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : ‌దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయని, అలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిందేనని ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హెచ్చరించారు. ఏమాత్రం ఏమరుపాటుతో ఉన్నా, తెలంగాణ ఛిద్రం కాగలదని అన్నారు. తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయని, విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయని అన్నారు. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదని, మతం చిచ్చు విజృంభిస్తే అది దేశం, రాష్ట్రం జీవికనే కబళిస్తుందని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ‌పబ్లిక్‌ ‌గార్డెన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్‌ ‌ప్రసంగిస్తూ..ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయిందని కేసీఆర్‌ ‌తెలిపారు. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా తెలంగాణ అలరారుతున్నదన్నారు. తెలంగాణ ఏర్పాటు అన్నది ప్రజల కోరిక మేరకు జరిగిందని, వారు కోరుకున్న విధంగానే సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తున్నదని అన్నారు.

ఈ తరుణంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, వాటిలోని మంచి చెడులను అర్ధం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలని సూచించారు. నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యం..వారందరి ఉజ్వల స్మృతికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణే మనకు ఉదాహరణ అన్నారు. ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించింది. తాను కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వొచ్చింది. ఎంతోమంది జైలుపాలు కావలసి వొచ్చింది, ఎన్నో జీవితాలు ఆహుతై పోవాల్సి వొచ్చింది. ఆ చరిత్రంతా నేను వేరే చెప్పనక్కరలేదు. అది మనందరి ప్రత్యక్ష అనుభవం.

సమీప చరిత్రలోనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనమందరం ప్రత్యక్ష భాగస్వాములమే. హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలచుకుంటే నేటికీ నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. అటువంటి కష్టం, అటువంటి వేదన పొరపాటున కూడా మళ్లీ రాకూడదు. అందుకు నిశిత పరిశీలన, నిరంతర చైతన్యం కావాలని కేసీఆర్‌ ‌విజ్ఞప్తి చేశారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్‌ 17 ‌సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులు, ఆషాడ భూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని కేసీఆర్‌ ‌పరోక్షంగా బిజెపిపై మండిపడ్డారు. అత్యంత మేధోసంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం..తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించు కుందని కేసీఆర్‌ ‌తెలిపారు. అదే క్రియాశీలతను, బుద్ధి కుశలతను మరోమారు చూపించాలి. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట, భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోమారు హెచ్చరిస్తున్నానని సీఎం స్పష్టం చేశారు. మీ అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేలపై నెలకొన్న శాంతి, సౌభ్రాతృత్వాలను గుండెల నిండా శ్వాసించే వ్యక్తిగా..ప్రతీ క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటికి మించి మీ బిడ్డగా ఈ విషయం మీకు చెప్పడం నా కర్తవ్యం. నా గురుతర బాధ్యత అని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే.. ఎన్నటికీ ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప, అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు. తెలంగాణ ఇప్పుడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో.. అంతేవేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకు పోవాలి. జాతినిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలి. భారతజాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంలున్నానన్నారు.

దేశంలో అంతర్భాగం అయ్యేనాటికే సొంత రాష్ట్రం
స్వాతంత్యాన్రికి పూర్వమే హైదరాబాద్‌ ఎం‌తో అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంతరాష్ట్రంగా వెలుగొందింది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ ‌రాష్ట్రం కొనసాగింది. మిగులు నిధులతో కూడిన నాటి హైదరాబాద్‌ ‌రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని, అడుగులు వేయటం ప్రారంభించిందని కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. ఆసేతు హిమాచలం అన్ని వర్గాల ప్రజల్లో దేశం పట్ల విశ్వాసాన్ని నెలకొల్పడానికి నాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్ల నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైందని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు భూమికగా, జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ కల్పించిన విశ్వాసం, సర్దార్‌ ‌వల్లభభాయ్‌ ‌పటేల్‌ ‌ప్రదర్శించిన చాకచక్యం, మతాలకు అతీతంగా దేశభక్తి భావనను పాదుకొల్పిన మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌ ‌వంటి నేతలు చేసిన అవిరళ కృషి వల్ల ఒక్కొక్క చిక్కు ముడి వీడిపోయింది. భారతదేశం ఏకీకృతమైందని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ ఏవిధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో, సంభావించారో.. అదేవిధంగా నేడు తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన నాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమించి..దేశానికే దారిచూపే టార్చ్ ‌బేరర్‌గా నిలిచింది. విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలలో అనతికాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిశానిర్దేశనర చేస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల, పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగిందని కేసీఆర్‌ ‌తెలిపారు. 1956లో దేశంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన పక్రియలో భాగంగా..తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ-ఆంధ్రలను కలిపి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. ఆంధప్రదేశ్‌ ఏర్పడిన నాటినుండి తెలంగాణ ప్రజలలో తాము మోసపోయినామనీ, తాము దోపిడీకి గురువుతున్నామనే ఆందోళన గూడు కట్టుకుంది. ఇరుప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేకపోగా సఖ్యత కూడా ఏర్పడలేదు. అందువల్లనే ఆంధప్రదేశ్‌ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద ప్రభుత్వం అందుకు భిన్నంగా సాచివేత ధోరణిని అవలంభించింది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గాలికొది లేసింది. తెలంగాణ ప్రజలు భయపడినట్లుగానే సమైక్య రాష్ట్రంలో అన్నిరంగాల్లో దారుణమైన వివక్ష అమలైంది. ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చిందని కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తానే స్వయంగా సారథ్యం వహించి, ఉద్యమ శంఖం పూరించి, తెలంగాణ ప్రజలందరినీ ఒక్కటిచేసి, పద్నాలుగేళ్లు అవిశ్రాంత పోరాటాన్ని నడిపించిన ఫలితంగా 2014 జూన్‌ 2‌న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని సిఎం కెసిఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply