బిజెపి నేతలపై కవిత పరువు నష్ట దావా

33 జిల్లా కోర్టుల్లో పిటిషన్‌ ‌దాఖలు
ఎలాంటి విచారణకైనా సిద్దమని ప్రకటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసు వేడి తెలంగాణలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కవిత.. బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టుల్లో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఇదిలా ఉండగా..ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసిన 29 మందిపై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసినట్టు బంజారాహిల్స్ ‌సీఐ నరేందర్‌ ‌తెలిపారు. కాగా, వారిలో 26 మంది అరెస్ట్ ‌చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఇక, నిందితులపై ఐపీసీలో 341, 147, 148, 353, 332, 509, రెడ్‌ ‌విత్‌ 149 ‌కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

దిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్‌ ‌వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్‌ ‌సిస్రా చేసిన ఆరోపణలపై కవిత సీరియస్‌ అయ్యారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌కు, తనకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిపై న్యాయ స్థానంలో తేల్చుకుంటానన్నారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని కవిత అన్నారు. అయితే సీఎం కేసీఆర్‌ను బీజేపీ టార్గెట్‌ ‌చేసిందని, జాతీయ స్థాయిలో రాజకీయాల్లోకి వెళుతున్న నేపథ్యంలో ఫోకస్‌ ‌పెట్టిందని ఆమె అన్నారు.

కేసీఆర్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టాడానికి..ఆయన కుమార్తెనైన తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కవిత విమర్శించారు.ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కవితకు సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేసిన తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కవిత టార్గెట్‌గా బీజేపీ, కాంగ్రెస్‌ ‌నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page