బళ్ళలో హేతుబద్దీకరణ!

  • ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు
  •  ప్రభుత్వ పాఠశాలల ఉనికికి ప్రమాదం

    పాఠశాల విద్యాశాఖ నిర్వహణలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో వైరుధ్యాలు, బళ్ళలో హేతుబద్దీకరణ అమలు చర్యలు, అంగన్‌ వాడీల్లో మూడవ తరగతి వరకు చదువు, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదనలతో ప్రభుత్వ పాఠశాల విద్య పలు మార్పులకు గురై తన ఉనికి ప్రమాదంలో పడే అవకాశముంది, ముఖ్యమంత్రి బహిరంగంగా చేసిన విధాన నిర్ణయాలు ఒకవైపు, విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆచరణలు మరొక వైపు ప్రభుత్వ పాఠశాల మనగడకు నష్టం కలిగించే దిశగా పరిణమిస్తున్నయి. అవగాహన రాహిత్యమో, ఆచరణ వైఫల్యమో కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కొంత పాజిటివ్‌ వైఖరితో ప్రభుత్వ పాఠశాల విద్య బాగు పడుతుందని భావించిన ఉపాధ్యాయులు విద్యావేత్తలలో అసంతృప్తి , అసహనం వ్యక్తమవుతుంది.

ముఖ్యమంత్రి చెప్పినదేమిటి!?
వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్లే స్కూల్‌ తరహాలో 3వ తరగతి వరకు అంగన్‌ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్య.రేవంత్‌ రెడ్డి అధికారులకు ఆదేశించారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని సూచించారు.అంగన్‌ వాడీలలో విద్యాబోధనకు అదనంగా ఒక టీచర్‌ నియమించేలా ప్రణాళిక రూపొందించాలని.. 4వతరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో చదువుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సూచించారు.

గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని, ఇందుకోసం ప్రభుత్వ నిధులతోపాటు సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ వినియోగించాలని ఆయన సూచించారు.  ‘‘మూతబడిన ఆరు వేల ప్రభుత్వ బడులను తెరవాలి!, ఏకోపాధ్యాయ బడులను, జీరో నమోదు బడులను మూత పడనీయవద్దు! ఇది ప్రభుత్వ నిర్ణయం!’’ అంటూ వందేమాతరం వారు ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన స్వయంగా ప్రకటించారు.

      విద్యాశాఖ ఉన్నతాధికారుల అమలు తీరిది!
రాష్ట్రంలో గత యేడాది బడిబాటలో జూన్‌ నెలలో ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థుల సంఖ్య 1,05,305 కాగా ఈ యేడు అదే జూన్‌ నెలలో ఇప్పటి వరకు ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థుల సంఖ్య 60,673 మాత్రమే! దాదాపు 45 వేలమంది తగ్గిపోయారని స్పష్టమవు తూంది.ఎస్‌.జి.టి.ల బదిలీల్లో జీరో ఎన్‌ రోల్మెంట్‌ పాఠశాలల్లోని ఖాళీలు చూపించవద్దని పాఠశాల విద్యాశాఖ డైరెక్టెరేట్‌ నుండి జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు అందాయి.

విద్యాశాఖ ఉన్నతాధికారులు తమదైన శైలిలో అప్రకటిత హేతుబద్దీకరణను అమలు చేస్తున్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడు వుండటం హేతుబద్దమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో కానీ జీరో నుండి 19 మంది విద్యార్థులకు ఒకరు, 20 నుండి 60 మంది విద్యార్థులుంటే ఇద్దరు టీచర్ల లెక్కనవిద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్ట్‌ ల కేటాయింపు చేసే జి.ఎం.ఎస్‌.25 తేదీ.12-08-2021 నాటి హేతుబద్దీకరణను అధికారులు అమలుచేస్తున్నారు.

45 శాతం నమోదు శాతం తగ్గుదలకు కారణాలు!?
ఈ విద్యా సంవత్సరం బడిబాట పూర్తయింది. కానీ ప్రభుత్వ మండలపరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానమైన ఒకటవ తరగమతిలో నమోదు శాతం కనిపించటం లేదు. నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ పాలసీ -2020 లో పిల్లలు పాఠశాలలో చేరేందుకు ఆరేళ్ళ వయసును అర్హతగా నిర్ణయించి ఈ విద్యా సంవత్సరం పక్కాగా అమలు చేస్తున్నారు.ఈ మేరకు ఒకటవతరగతిలో చేరే ఆ వయసు పిల్లలు లేరు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ అర్చనా శర్మ అవస్తీ పేరిట డి.ఓ.నెం.22-7-/2021/ఇ.ఇ./19/1 ఎస్‌/13 తేదీ. 15-02-2024 అన్ని రాష్ట్ర,కేంద్ర పాలిత ప్రభుత్వాలకు ఒక సర్క్యులర్‌ విడుదల అయింది. అందులో పాఠశాలలో ఎన్‌.ఇ.పి. 2020, ఆర్‌.టి.ఇ.-2009 ల మేరకు ఒకటవతరగతి ప్రవేశం కోరే పిల్లల ఆరు సంవత్సరాల వయసు దాటి వుండాలనే నిబంధన పెట్టారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానమైన ఒకటవతరగతిలో ఈ నిబంధన అమలు ఫలితంగా నమోదు శాతం గందరగోళంగా మారింది. ప్రయివేట్‌.విద్యావ్యాపారాల్లో నర్సరీ,ఎల్‌.కే.జీ.,యు.కె.జీ. పేరిట ప్రాక్‌ ప్రాథమిక విద్య వుంటుంది.

మూడు లేదా నాలుగు సంవత్సరాల పిల్లల కోసం బడి తలుపులు తెరుస్తున్న ప్రయివేట్‌ కాన్వెంట్లు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పిల్లలు చేరుతున్నారు.  ఈ నేపథ్యంలో ఆరేళ్ళ వయసు వచ్చే వరకు బడిలో పిల్లలను చేర్పించని తల్లిదండ్రులుంటారని ఆశించటం అర్ధరహితం. గతంలో ఒకటవ తరగతి లో కనీసం ఎనభై మంది విద్యార్థులు చేరితే ఐదవ తరగతి వచ్చేలోగా వేర్వేరు కారణాల చేత సగంమంది మిగులుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం చెప్పుకునే నమోదు శాతం వుండాలంటే పునాదిరాయి లాంటి ఒకటవ తరగతి లో నమోదు శాతం తప్పనిసరిగా వుండాలి. లేనట్లయితే క్రమంగా నాలుగేళ్ళలో ఆ బడి జీరో నమోదు బడికింద చేరుతుంది. అమ్మ మాట – అంగన్‌ వాడి బాట పేరిట జూలై రెండవ వారం నుండి అంగన్‌ వాడీలల్లో నర్సరీ నుండి మూడవ తరగతి వరకు ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.

అంగన్‌ వాడీల్లో మొదటి మూడు సంవత్సరాలు చదువులో విద్యార్థికి భాష , గణితాలకు సంబంధించిన ప్రాథమిక సామర్థ్యాలు పెంచేందుకు, ప్రభుత్వ విద్యలో ప్రాక్‌ ప్రాథమిక పాఠశాలలు,శిశుతరగతుల నిర్వహణకు ప్రత్యేక అవగాహనతో కూడిన ప్రణాళిక అవసరం.నర్సరీ నుండి మూడవ తరగతి మధ్య శిక్షణ , సిలబస్‌ , వాటి పరిధి,బోధనాభ్యసనల నిర్వహణ ఏ స్థాయిలో రూపొందించాలనేది వారి శారీరక , మానసిక వయస్సు బట్టి నిర్ణయించాలి. ఇందుకోసం క్షేత్రస్థాయిలో అనుభవం వున్న ఉపాధ్యాయులు, కరికులం నిష్ణాతులు ,విద్యావేత్తల సలహాలను ఆహ్వానించాలి. అంగన్‌ వాడీల రూపురేఖలు మార్చి,వాటిని పూర్తి స్థాయిలో పనిచేయించటం హర్షనీయమే! కానీ ఆ ఆచరణ అమలు ఫలితాలు వాటి వైఫల్యాలు,సాఫల్యాల పై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సివుంది.

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు
ప్రస్తుత పాఠశాలల తక్షణ సమస్యల పరిష్కారం విడిచి వందల కోట్ల రూపాయల వ్యయంతో కొత్త పథకాల ప్రతిపాదనలు ఎవరి ప్రయోజనాల కోసమనే ప్రశ్నార్ధకం. గురుకుల పాఠశాలలు వద్దు మొర్రో! అని అంటుంటే ఎవరూ అడగని ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకోవటం విచిత్రంగా తోస్తుంది. ఇంటగ్రేటెడ్‌ స్కూల్స్‌ విధి విధానాలు ఏమిటో స్పష్టత లేదు..విద్యావిధానం లో ఏవైనా మార్పులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తే.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, విద్యారంగ పరిరక్షణ కోసం పనిచేస్తున్న విద్యావేత్తలను సంప్రదించాలి కదా… నాలుగవ తరగతి నుండి ఉన్నత తరగతుల విద్య కోసం 31 ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. అన్ని రకాల రెసిడెన్సియల్‌ పాఠశాలలను కేంద్రీకృతం చేస్తూ నిర్వహించబోయే ఈ ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చేరబోయే విద్యార్థులు ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల నుండే చేరక తప్పదు. ప్రభుత్వ విద్యా నిర్వహణలో ప్రధానమైన ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ బడుల్లోనమోదు మరింతగా తగ్గుముఖం పట్టి అంతరించి పోయే ప్రమాదం లేకపోలేదు.కొడంగల్‌ మధిరలో ఇప్పటికే ఏర్పాటు ప్రక్రియ మొదలైన ఆ రెండిరటితో కలిపి మొత్తం 33 ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు త్వరలో ఏర్పాటు కానున్నాయి.ఒక్కోదానికి దాదాపు 22 కోట్లరూపాయల వ్యయం అంఛనా వేశారు. ఇందుకోసం వ్యయం చేసే కోట్లాది రూపాయల నిధులతో ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ సెమీ రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా బలోపేతం చేయటం పై ప్రభుత్వం పునరాలోచించాలి. గత ప్రభుత్వం కులాలు మతాల పేరిట నిర్వహించిన గురుకులాలతో ప్రభుత్వ పాఠశాలలు పతనావస్థలోకి చేరాయి.అంగన్‌ వాడిలో ప్రాక్‌ ప్రాథమిక తరగతుల నిర్వహణ, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు మరింత నష్టం వాటిల్లే అవకాశం వుంది.

ఉపాధ్యాయులు, విద్యావేత్తలు చాలాకాలంగా సూచిస్తున్న విధంగా సెమిరెసిడెన్షియల్‌ భావన హర్షనీయమే. ఇందుకు సంబంధించి ఆయా పాఠశాలల్లో.భౌతికవనరుల కల్పనయే ప్రధానం. ఇవి ఏర్పాటు లేకుండా సెమిరెసిడెన్షియల్‌ ఏర్పాటు ఫలవంతం కాదనేది గుర్తించాలి. మౌలిక సౌకర్యాల ప్రకల్పన కోసం మన బస్తీ-మనబడి పథకం కింద పనులు చేసిన గుత్తేదారులకు పెండిరగ్‌ లో వున్న డబ్బులు చెల్లించాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ల నేతృత్వంలో జరుగుతున్న వివిధ మౌలిక సౌకర్యాలు, నిర్మాణ పనులకు ఇవ్వాల్సిన 75శాతం నిధులను వెంటనే విడుదల చేయాలి.ప్రతి పాఠశాల కాంప్లెక్క్స్‌ పరిధిలో వివిధ ఆన్‌ లైన్‌ విధుల నిర్వహణ కోసం కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించాలి.9.44% బడుల్లో బాలురకు, 5.86% పాఠశాలల్లో బాలికలకు,15.45% బడుల్లో ది వ్యాంగులకు మూత్రశాలలు లేవు.గత ప్రభుత్వ కాలంలో కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన సైన్స్‌ ల్యాబ్‌లలో ఇప్పటికీ 18.13 శాతం,11.70% కంప్యూటర్‌ ల్యాబ్‌లు, 71% నైపుణ్య విద్య ల్యాబ్‌లు పూర్తి చేయాల్సివుంది.

ఉన్నత పాఠశాలలకు బాలికల కోసం తక్షణమే  విద్యుత్‌ ఇన్సినరేటర్ల పంపిణీ చేయాలి. ఏళ్ళ తరబడి ప్రభుత్వ విద్యకు కేంద్రంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ మండల జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదివిన ఎందరో విద్యార్థులు నేడు మంచి హోదాల్లో వున్నారు. అలాంటి ప్రభూ బడులను విచ్ఛిన్నం చేయబూనటం వలన గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులు , ఆదివాసీ ప్రాంతాల విద్యార్థులు చదువుకు దూరం అయ్యే అవకాశాలున్నాయి. ‘‘ పిల్లలు ఉన్న వూర్లోనే నాలుగవ తరగతి వరకు చదవాలి!’’అని ఆకాక్షించే ముఖ్యమంత్రి వున్న వూర్లోనే ఆ పై తరగతులు చదవాలని కూడా కోరుకోవాలి.మూతబడిన ఆరువేల ప్రభుత్వ బడులను తెరిపించేందుకు ఏకోపాధ్యాయ బడులను, జీరో నమోదు బడులను మూత పడకుండా కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలి. రాష్ట్రంలోని పాఠశాలల హేతుబద్దీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు విషయంలో విద్యావేత్తల సలహాలు స్వీకరించాలి. అంగన్‌ వాడీలను ప్రాక్‌ ప్రాథమిక శిశు విద్యాకేంద్రాలుగానే నిర్వహించాలి. బళ్ళలో బోధనేతర సిబ్బంది నియామాకం, 33 ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు పై విద్యావేత్తల,క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధ్యాయుల అభిప్రాయాలు సేకరించాలి.

-వాడపల్లి అజయ్‌ బాబు
టి.పి.టి.ఎఫ్‌.అధికార పత్రిక
‘ఉపాధ్యాయదర్శిని’ సంపాదకులు
8919260409

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page