సర్కారు దవాఖానాలో అరణ్య రోదన
సమస్యలతో కూనారిల్లుతున్న వరంగల్ ఎంజిఎం
సకాలంలో సేవలు అందక రాలిపోతున్న రోగులు
కనీస వసతులు, వైద్య పరికరాలు కరువు
బడ్జెట్లో కేటాయింపులు నిల్.. స్పందించని సర్కారు..
విష్ణుదాసు రామ్మోహన్ రావు, ప్రజాతంత్ర ప్రతినిధి
ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద సర్కారు దవాఖాన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్.. నాలుగు జిల్లాలకు పెద్ద దిక్కు ఇదే.. నిరుపేదలకు ఎలాంటి అనారోగ్యాలు వొచ్చినా హుటాహుటిన తరలివొచ్చేది ఇక్కడికే.. తమ రోగాలు నయం చేసుకుందామని ఎంతో నమ్మకంతో, ఆశతో ఎంజీఎంలో అడుగు పెడితే.. ఇక్కడి గందరగోళ పరిస్థితులు రోగులు వారి బంధువులకు మరిన్ని అవస్థలు తెచ్చిపెడుతున్నాయి. ఓ వృద్ధురాలైన ఓ తల్లి తన బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుండగా తల్లడిల్లిపోయి వైద్యం కోసం ఎంతో నమ్మకంతో ఎంజీఎం హాస్పిటల్ కు వొస్తే అక్కడ ఆమె కష్టాలు ఎవరికీ పట్టలేదు.రోగిని పరిశీలించిన డాక్టర్ వైద్య పరీక్షలు చేయించాలని చీటీ రాసి ఇస్తే అది పట్టుకుని హాస్పిటల్ అంతా తిరిగింది. ఎక్కడ ఏ పరీక్ష చేస్తారో తెలియక, కనీసంగా చెప్పేవారు లేక, ఇక్కడ కాదు అక్కడ..అక్కడ కాదు ఇక్కడ అని హాస్పిటల్ సిబ్బంది తిప్పారు.అయినా వోపిక చేసుకొని తిరిగి అలసిపోయినదీన స్థితిలో ఓ చోట కూలబడి బావురుమంటూ కన్నీరుపెట్టుకుంది.
ఇలాంటి పరిస్థితి ఈ ఒక్క వృద్ధురాలిదే కాదు.. దాదాపు ఇక్కడికి వచ్చిన ప్రతీఒక్కరిదీ ఇదే దుస్థితి. పేషెంట్‌ను వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని ఏ పరీక్ష ఎక్కడ చేయించాలో తెలియక, ఓ కౌంటర్ వద్ద క్యూలో నిలబడి,నిలబడి తీరా తన వంతు వొచ్చాక ఈ పరీక్ష ఇక్కడ కాదు మరోచోట అని చెప్పడంతో కిమ్మనకుండా పోయేవారు, తిట్టుకుంటూ పోయేవారు ఇక్కడ నిత్యం కనిపిస్తూనే ఉంటారు. ఇక వార్డులలో పేషంట్ల బాధను చూడలేక కుటుంబసభ్యులు డ్యూటీ డాక్టర్లు, హౌస్సర్జన్లు, స్టాఫ్ నర్సులు, నర్సింగ్ విద్యార్థులతో చికిత్స కోసం ప్రాధేయపడడం వంటి దృశ్యాలు అనేకం కనిపిస్తాయి. .చాలా సందర్భాలలో ఎమర్జెన్సీ వార్డులు, జనరల్ వార్డులలో బెడ్లు లేక పేషంట్లు వీల్ చైర్లలోనే గంటల కొద్దీ పడిగాపులు కాస్తుంటారు. ఎంతో చరిత్ర గలిగిన వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ వద్ద నిత్యం దర్శనమిచ్చే అనేకానేక హృదయవిదారక దృశ్యాలు..





