పది ఎంపి సీట్ల లక్ష్యంగా బిజెపి

  • ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగ పోటీ చేసే అవకాశం?
  • ఒంటరిగానే బరిలోకి దిగడానికి సన్నాహాలు
  • అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొరపాట్లను జరుగకుండా చర్యలు

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 : పది పార్లమెంటు సీట్లను గెలుచుకునే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యూహరచన చేస్తున్నది. ఇటీవల శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రానికి వొచ్చిన బిజెపి అగ్రనేత, కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌షా ఈసారి పది ఎంపీ సీట్లను గెలిచి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఆమేరకు ఆయన నాయకులు, కార్యకర్తలందరితో ప్రతిజ్ఞ చేయించడం విశేషం. కాగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోదీని తెలంగాణలో ఎక్కడి నుంచైనా ఒక స్థానం నుండి పార్లమెంటు అభ్యర్థిగా పోటీలో నిలబెట్టడం ద్వారా పార్లమెంటు ఎన్నికల్లో జోష్‌ను నింపవొచ్చని ఆ పార్టీ రాష్ట్ర క్యాడర్‌ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రధాని అంతటి వాడు ఇక్కడి నుండి పోటీ చేస్తే కేంద్రంలోని బడా నాయకులంతా వరుసగా తెలంగాణకు క్యూ కట్టే అవకాశాలుంటాయి. ఇక్కడికి కేంద్రమే తరలివచ్చినట్లు అవుతుంది. ఫలితంగా అధిక సంఖ్యలో స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంటుందనుకుంటున్నారు. అలాగే ఈసారి మరో కొత్త ప్రయోగం చేసే యోచనలో బిజెపి ఉన్నట్లు తెలుస్తున్నది.

ఎంఆర్‌పిఎస్‌ నేత మందకృష్ణ మాదిగను తమ పార్టీ పక్షాన నిలబెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఆ పార్టీ వర్గాలకు ఉన్నట్లు తెలుస్తున్నది. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్‌ క్యాటగరీల విషయంలో తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తున్నదంటూ స్వయంగా నరేంద్రమోదీ పేర్కొన్న విషయం తెలియంది కాదు. అంతే కాకుండా ఎన్నికల సందర్భంలో మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిధిగా నరేంద్రమోదీ విచ్చేయడం, వేదికపైన మందకృష్ణ మాదిగను అనునయించిన సంఘటనలు జగద్విదితమే. నిన్నగాక మొన్న హైదరాబాద్‌కు విచ్చేసిన అమిత్‌షా కూడా మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నది ఒక్క బిజెపినే అని పేర్కొనడం గమనార్హం. ఒకవేళ మందకృష్ణ మాదిగకు అవకాశం కలిగిస్తే ఆయన్ను పాలేరు నుండి పోటీ చేయించే అవకాశం ఉంటుందనుకుంటున్నారు. లేదా వరంగల్‌, నాగర్‌కర్నూల్‌ లేదా పెద్దపల్లిలో ఏదో ఒక నియోజకవర్గం నుండి అవకాశం ఇవ్వవొచ్చనుకుంటున్నారు. ఒక పక్కన ఎస్సీ వర్గాలను దగ్గరకు తీసుకుంటూనే, తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వొస్తే బిసి వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించిన విషయం తెలియంది కాదు.

అయినా తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వొచ్చింది. రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి వొచ్చేది తామేనంటూ గత రెండుమూడు ఎండ్లుగా ప్రచారం చేసుకుంటూ వొచ్చిన ఆ పార్టీ అధికారానికి సమీప సంఖ్యలో అభ్యర్థులను గెలిపించుకోలేకపోయింది. కాగా గెలిచిన సంఖ్య తమకు సంతృప్తిని ఇచ్చిందని చెప్పుకుంటున్నది. ఎందుకంటే 2018 ఎన్నికలకన్నా మెరుగైన సంఖ్యలో ఉన్నామన్న తృప్తిని వ్యక్తంచేస్తున్నది. 2018లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన తమ పార్టీ ఈసారి ఎనిమిది స్థానాలను గెలుచుకోవడంతో పాటు వోటింగ్‌ శాతాన్ని కూడా పెంచుకున్నామంటుంది. ఇందుకు నాయకుల మధ్య సమన్వయలోపమే ప్రధాన కారణంగా ఆ పార్టీ విశ్లేషించు కుంటున్నది. వివిధ పార్టీల నుండి వొచ్చిన నాయకుల మధ్య సమన్వయం లేకపోవడమే నష్టానికి కారణమన్న విషయాన్ని స్వయంగా అమిత్‌షా పేర్కొనడం గమనార్హం. ముఖ్యంగా పార్టీలో ఇటీవల కాలంలో ఆధిపత్యపోరు పెరిగిన విషయంపైన కూడా అమిత్‌షా సమక్షంలో చర్చ జరిగింది.

అభ్యర్థులను ప్రకటించడంలో తీవ్రజాప్యం జరుగడం, చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు, బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం పార్టీ ఓటమికి కారణాలుగా ఆ పార్టీ గుర్తించింది. బిజెపిలో చేరిన ఈటలను హీరోగా ప్రచారం చేసినప్పటికీ ఆయన రెండు చోట్ల ఓటమి చవిచూడాల్సి వొచ్చింది. జనసేనతో పొత్తు వికటించడం మరో ప్రధానాంశమైంది. రాష్ట్రంలో కొంతకాలంగా వీచిన బిజేపీ గాలులకు జనసేన తోడు, తమను అందలం ఎక్కిస్తుందనుకున్న బిజెపికి తీవ్ర నిరాశను మిగిల్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి తాము ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి పేర్కొనడం గమనార్హం. తమ స్వంత బలంతో ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో మరింత కష్టపడితే పది పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడం పెద్ద సమస్యకాదని కిషన్‌రెడ్డి, అమిత్‌షాలు పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలు శ్రమిస్తే ఈసారి నాలుగు వందల పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడం ద్వారా హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ మరోసారి దేశ సారథ్యం చేసే అవకాశముంటుందన్న అశాభావాన్ని అమిత్‌ షా వ్యక్తం చేశాడు.

అందుకు ఈసారి గెలిచే గుర్రాలను ఎంచుకునే పనిలో పార్టీ వర్గాలు కసరత్తు మొదలు పెట్టారు. అందులో భాగంగానే మోదీ, మందకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా కొందరు పాతవారితోపాటు శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మరికొందరికీ మరో అవకాశం లభిస్తుందనుకుంటున్నారు.  రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన ఈటల రాజేందర్‌ మల్కాజీగిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తుండగా, అదే నియోజవర్గం నుండి పోటీకి మాజీ ఎంఎల్సీ రాంచందర్‌రావు, మధ్యప్రదేశ్‌ వ్వవహారాల ఇన్‌ఛార్జీ మురళీధర్‌రావులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. కాగా  బండి సంజయ్‌ గతంలో ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్‌ నుంచి, బిజెపి రాష్ట్ర చీఫ్‌ జి. కిషన్‌రెడ్డి సికిందరాబాద్‌ నుంచి,  నిజామాబాద్‌నుంచి డి. అరవింద్‌, చేవెళ్ళ నుండి కొండ విశ్వేశ్వర్‌రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page