పా అలా తిరిగొద్దాం అని
బయలుదేరాం
నేను, నాలోని మరో నేను
కాళ్లు చక్రాలయ్యాయో,
చేతులు రెక్కలయ్యాయో
బంతి లాంటి భూమండలాన్ని
బొంగరంలా చుట్టి వచ్చాం
ఆకాశాన్ని, అనంత విశ్వాన్ని
అబ్బురంగా చూసి వచ్చాం
ఆది మానవుడి ఆనవాళ్లను,
విశ్వాన్ని పుట్టించిన అన్ని నిప్పు రవ్వల్ని
వెంట తెచ్చాం
పక్షి రెక్కల్లో దాగిన పద్యాల్ని,
కొండ అంచున వేళ్ళాడుతున్న కాలాన్ని
తెంపి తెచ్చాం
ఇహ ఇప్పుడు నిప్పు రాజేస్తాం
భగభగ మండే మంటల్లో దూకి
ఆరని నిప్పు కణికలవుతాం
నేను, నాలోని మరో నేను!!
– రెహానా