Take a fresh look at your lifestyle.

నేడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు

కౌంటింగ్‌కు భారీగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
ఉదయం 8 నుంచి కౌంటింగ్‌ ‌మొదలు
మధ్యాహ్నానికి తేలనున్న ట్రెండ్‌
‌తమ విధానాలు నచ్చేవారితో పొత్తు : కుమారస్వామి
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎవరివైపు అన్నది నేడు తేలనుంది. 10న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన కౌంటింగ్‌ ‌శనివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ‌ప్రారంభం కానుంది. రౌండ్లవారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించనున్నారు. మొత్తం 224 స్థానాలకు ఒకే దఫాలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం 10న బుధవారం నిర్వహించింది. మొత్తం 5 కోట్ల మంది ఎవరికి ఓటు వేశారనేది కర్ణాటక రాజకీయాల్లో హాట్‌ ‌టాపిక్‌ ‌గా మారింది.  అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 58, 545 పోలింగ్‌ ‌బూత్‌ ‌లు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,615 మంది అభ్యర్థులు తమ లక్‌ ‌పరీక్షించుకున్నారు. 70 శాతానికి నమోదయినట్లుగా తెలుస్తోంది.

కర్ణాటక మొత్తం ఒకే ఫేజ్‌లో ఎన్నికలు జరిగాయి. ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. చెదురుమదులు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల కౌంటింగ్‌ ‌సందర్భంగా కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరికీ మెజార్టీ రాదని స్పష్టంగాఎగ్జిట్‌ ‌పోల్స్ ‌ఫలితాలు చెప్తుండటంతో ’కింగ్‌మేకర్‌’ ‌జేడీఎస్‌ ‌తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని ప్రకటించింది. మే 10న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం జరగనుండటంతో ఆ రెండు ప్రధాన పార్టీల్లోనూ కొత్త ఆశలు చిగురించేలా చేసింది. కాంగ్రెస్‌ ‌కాస్త ముందంజలో ఉంటుందని ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌ఫలితాలు చెప్పినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 113 మంది ఎమ్మెల్యేల మద్దతు రాకపోవచ్చునని చెప్తున్నాయి. అయితే జేడీఎస్‌ ‌కు 30 కన్నా తక్కువ స్థానాలు లభిస్తాయని చెప్తున్నాయి. అంటే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అటు కాంగ్రెస్‌ అయినా, ఇటు బీజేపీ అయినా తప్పనిసరిగా జేడీఎస్‌ను మచ్చిక చేసుకోక తప్పదు.

ఈ నేపథ్యంలో జేడీఎస్‌ అ‌గ్ర నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి సింగపూర్‌ ‌వెళ్లే ముందు ఓ వార్తా పత్రికతో మాట్లాడారు. జేడీఎస్‌ ‌కనీసం 50 స్థానాల్లో గెలుస్తుందని నేను ఇప్పటికీ ధీమాగా ఉన్నాను. నా మాటలకు అంగీకారం తెలిపే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. జేడీఎస్‌ ‌వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవె గౌడ ఇటీవల మాట్లాడుతూ, కాంగ్రెస్‌తో జేడీఎస్‌ ‌కలిసే ప్రసక్తే లేదన్నారు. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతి పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌, ‌జేడీఎస్‌ ‌కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ఓ సంవత్సరం తర్వాత ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ ’‌కింగ్‌’ అవుతుందని కుమార స్వామి మే 10న చెప్పారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మాట్లాడుతూ, జేడీఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఓటర్లను కోరుతున్నానని చెప్పారు.

తమ పార్టీ ’కింగ్‌’ ‌కాబోతోందన్నారు. అంటే తనకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే పార్టీతోనే పొత్తు పెట్టుకుంటామనే సంకేతాలను ఆయన తాజాగా పంపించారు. 2006లో బీజేపీ మద్దతుతో కుమార స్వామి ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. అయితే బీజేపీ నేత శోభ కరంద్లజే ఇటీవల మాట్లాడుతూ, తమకు పొత్తులు పెట్టుకోవలసిన అవసరం రాదని, తమకే సొంతంగా ఆధిక్యత లభిస్తుందని చెప్పారు. కానీ కాంగ్రెస్‌, ‌బీజేపీ తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని, సరైన సమయంలో ప్రకటిస్తామని జేడీఎస్‌ అధికార ప్రతినిధి తన్వీర్‌ అహ్మద్‌ ‌చెప్తున్నారు. జేడీఎస్‌ను కాంగ్రెస్‌ ‌సంప్రదించలేదని కాంగ్రెస్‌ ‌నేత డీకే శివ కుమార్‌ ‌మాటలనుబట్టి అర్థమవుతోంది. శివ కుమార్‌ ‌గురువారం మాట్లాడుతూ, తమకు 150కి పైగా స్థానాలు లభిస్తాయని, జేడీఎస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవని చెప్పారు.

Leave a Reply