నేటి చదువుల లక్ష్యం ఏమిటి?

అక్షరం అజ్ఞాన గాడాంధకారాన్ని దూరం చేసి, జ్ఞాన జ్యోతిని వెలిగించే ఒక మహత్తరమైన ఆయుధంగా మన పూర్వీకులు చెప్పడం జరిగింది. అయితే కాలవాహినికి ఈ మాట కటువుగా మారింది. కాలంతో పాటు అక్షరం యొక్క ప్రాధాన్యత కూడా అనేక విధాలుగా రూపాంతరం చెందింది. అక్షరం సంస్కారానికి ప్రతిరూపం గా ఒకప్పుడు భావించే వారు. అయితే వర్తమానంలో అక్షరం, అక్షరం ద్వారా లభించే జ్ఞానం స్వీయ ప్రయోజనాల కోసం వినియోగించడం వలన చదువుల లక్ష్యం మారిపోయింది.షోడశ సంస్కారాల్లో అక్షరారంభం లేదా  విద్యారంభం కూడా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. విద్యకున్న విశిష్ఠత ఏమిటో పురాణ కాలంలోనే విశదీకరించబడింది. “చదువు” అంటే సంస్కరించేది. సంస్కార రహితమైన చదువులు సమాజానికి మేలు చేయవు. చదువులు బ్రతుకు దెరువుకోసమే కాదు. మనిషిలోని మనసును ప్రేరేపించి, మంచిని పెంచే మహత్తర మైన సాధనం విద్య. అయితే నేటి విద్యలు నేతి బీరకాయ చందంగా తయారైనాయి. అక్షరాస్యత పెరిగింది. అక్షరజ్ఞానం పెరిగింది. సంస్కారం కొరవడింది.

చదువుకుని సర్వసద్గుణాలు  కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో చదివించడమే దండగనే అభిప్రాయం ప్రబలిపోతున్నది.ఇలాంటి అభిప్రాయాలు తీవ్రరూపం దాల్చకముందే మన విద్యావ్యవస్థను సంస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.చదువులంటే కేవలం డిగ్రీలకే పరిమితం కావడం వలన చదువుల కున్న అర్ధం మారిపోయింది.  వినయం,వివేకానికి చోటు లేని చదువులు వ్యర్ధం. “కాకరకాయ” ను ” కీకరగాయ”లా  మార్చే  చదువులు జన్మతః ప్రాప్తించిన సహజమైన జ్ఞానానికి సైతం పాతర వేస్తున్నాయి. అక్షరానికున్న విలువను పెంచాలి. అక్షరం అజ్ఞానాన్ని పారద్రోలాలి. అజ్ఞానాన్ని పెంచరాదు. విలువలను కాపాడే విద్యలు అవసరం.పెద్దలను గౌరవించే పద్దతులు నేర్పని చదువుల వలన ప్రయోజనం శూన్యం. అక్షరాస్యత అరకొరగా ఉన్న రోజుల్లోనే సమాజంలో చక్కని విలువలు ఉండేవి. అక్షరాస్యత పెరిగే కొద్దీ అజ్ఞానం కూడా అదే స్థాయిలో పెరగడం,చదువంటే కేవలం మన దర్పాన్ని పెంచే సాధనం గా మారడం దౌర్భాగ్యం.మనో వికాసానికి కాకుండా,మానసిక పరమైన దౌర్భల్యానికి దారితీసే దారుల్లో విద్యావంతులు పయనించడం దురదృష్టకరం. చదువుల వలన మానసిక పరివర్తన రావాలి. జీవన శైలిలో సక్రమమైన మార్పురావాలి. ప్రస్తుత పరిస్థితులు తద్విరుద్ధంగా కొనసాగుతున్నాయి. విద్య అలంకార సాధనంగా మారింది.  చదువుకున్న యువత లో వ్యసనాలు పెరిగిపోతున్నాయి.ఇదే ఆధునిక సంస్కృతి అనే భ్రమలో యువత పరిభ్రమిస్తున్నది.గుణం వలన గౌరవం పెరుగుతుంది.  వివేకం వలన సమాజం సంస్కరించబడుతుంది. చిత్తశుద్ధితో,అంతః కరణ శుద్ధితో  మన వ్యక్తిత్వం వెల్లివిరుస్తుంది.  వ్యక్తిత్వవికాసం లేని విద్యలు రాణించవు.నేటి చదువుల్లో నాణ్యత లోపించింది.

ఉన్నత స్థాయి చదువులు కూడా నాణ్యతా ప్రమాణాలు లేక వెలవెలబోతున్నాయి. ప్రతిభకు విలువ లేకుండా పోతున్నది. ప్రతిభావంతుల్లో నైరాశ్యం పెరిగిపోతున్నది. పట్టాలుంటేనే ప్రతిభావంతులనే భావన పెరగడం వలన చదువులన్నీ ప్రతిభ లేని పట్టాలకోసం  పట్టాలు లేని రైలు లా పట్టపగ్గాలు లేకుండా  దూసుకు పోయి బోల్తా కొడుతున్నాయి. గతంలో విద్యావంతులంటే ఈ సమాజం ఎంతో గౌరవించేది. విద్యావంతులు పల్లెల్లో అడుగుపెడితే పల్లె జనం హారతి పట్టేది. నేటి విద్యావంతులకు సమాజం లో అలాంటి గౌరవం దక్కడం లేదు. విద్యావంతులంటే చిన్న చూపు చూసే రోజులొచ్చాయి.
విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నప్పటికీ, విలువల విషయంలో విద్యారంగం వెనుకబడి ఉంది. విద్యలున్నా వివేకం, వినయం, సంస్కార గుణం లోపిస్తే అలాంటి చదువులు నిరర్థకం.భావం తెలియని భాష, హృదయం లేని కవిత్వం,రూపం లేని శిల్పం, పరిమళం లేని పుష్పం,అణకువ లేని అందం, ఉపమానం లేని,  ఉపన్యాసం,జ్ఞానం లేని విద్య శోభించవు.అర్ధం లేని చదువులతో మిథ్యగా మారుతున్న విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలి. విజ్ఞానం,వివేకం, విచక్షణతో మేళవించిన సంస్కారగుణం విద్యావ్యవస్థలో ప్రవేశ పెట్టాలి.చదువులంటే కేవలం బ్రతకడానికే కాదు..ఎలా బ్రతకాలో నేర్పాలి. బ్రతుకు విలువ తెలియాలి.

ఈ అనంతమైన విజ్ఞాన సాగరంలో మన జ్ఞానం ఒక చిన్న నీటి బిందువంత. విద్య అనే క్షీరసాగర  మథనం క్లిష్టతరమైనా నిరంతర శ్రమ,ఓర్పు,నేర్పు,తపనతో తుదకు జ్ఞానమనే అమృతం జనిస్తుంది. జ్ఞానామృతాన్ని ఆస్వాదించి, మానవాళిని సక్రమమైన పద్దతుల్లో నడిపించాలి. మృగత్వం ప్రబలుతున్న మానవ జాతిని మహోన్నత శిఖరాలకు చేర్చి, విలువల ఆధారంగా మానవ మనుగడ పది కాలాలు కొనసాగేలా  చదువుల్లో సంస్కరణలు తీసుకు రావాలి.సమాజహితాన్ని గాలికొదిలి,స్వప్రయోజనాలకోసం విలువలకు తిలోదకాలిచ్చి, హీనంగా జీవిస్తూ,హీనత్వం లోనే శిఖరాగ్రమంత ఉన్నతిని గాంచి ఊహల్లో ఊరేగుతున్న’మనిషి’ మానసిక పతనం సమాజానికిశాపం.స్వార్ధం,ద్వేషం,అసూయ,అహంకారం,అవినీతి వంటి మనో జాఢ్యాలు వైద్యపరిభాషకు అందనంత ఎత్తులో తిష్ఠవేశాయి.మనిషి పెరిగినా మనసు తరిగింది.కృత్రిమత్వం  అణువణువునా నిండిపోయింది.మానవత్వం నశించింది.

మానవతత్వమే మారిపోయింది.విజ్ఞానం పెరిగింది.వికాసం క్షీణించింది. మనిషి విజ్ఞాని,మానసికంగా అజ్ఞాని.సంస్కారం లోపించింది- సహనం నశించింది. తాను సంపాదించిన ధనంతో తృప్తిపడక, ధనమదంతో ఇతరులను వేధించుకుతినే పైశాచికత్వం మనిషిని అధః పాతాళానికి దిగజార్చింది. నిజమైన ఆనందం నీరు గారింది.స్వార్ధంలో ఆనందం అన్వేషించే గుణం నశించాలి. వివేకానికి, సంస్కార గుణానికి విలువ పెరిగితే ప్రపంచమే ఒక ఆనంద నిలయమౌతుంది. ఈ విషయాన్ని విద్యార్థులకు బోధించాలి. డబ్బులోనే సర్వ సుఖాలు సమకూరుతాయని యువత భావించడం పొరపాటు. మంచితనం, సేవాదృక్ఫథం  మానసిక ప్రశాంతతకు మూలకారణం. నిజమైన ఆనందం వ్యక్తిత్వ వికాసం వలన,స్వార్ధ చింతన లేని గుణం వలన సమకూరుతుంది. అలాంటి వ్యక్తులను ఈ సమాజం గౌరవించినప్పుడే మిగిలిన వారు కూడా మంచి బాటలో పయనించగలరు. విద్యా వ్యవస్థలో విలువలతో కూడిన స్వర్ణయుగం రావాలి. ప్రస్తుత సమాజంలో విలువలు మృగ్యమైన నేపథ్యంలో యువ విద్యార్ధులకు నైతిక విలువలు నేర్పాలి.యువశక్తి నిర్వీర్యం దేశ పునర్నిర్మాణానికి అవరోధం.

image.png
 – సుంకవల్లి సత్తిరాజు.

                (సామాజిక విశ్లేషకులు)
               మొబైల్: 9704903463.

              తూ.గో.జిల్లా(దేవరపల్లి మండలం)
              ఆం.ప్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page