Women’s Reservation: మహిళా రిజర్వేషన్ భిక్ష కాదు.. హక్కు…!

“ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై చిత్తశుద్ధి ఉంటే జనాభా గణన , నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. ప్రస్తుత నియోజకవర్గాల్లోనే రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్లు అమలుచేయొచ్చు. దీనికి జనగణన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే మహిళా వోటర్ల శాతమే ఎక్కువ కనిపిస్తుంది. అంటే రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చడంలో లేదా నిలబెట్టడంలో మహిళలది కీలకమైన పాత్ర..” 
shanthi prabhodhaపురాణాల్లో, ఉపన్యాసాల్లో మహిళలను దేవత అని, శక్తిస్వరూపిణి అని  ఆకాశానికెత్తే మనం, నిజ జీవితంలో ఆమెకు నిర్ణయాధికారం ఇచ్చే సమయానికి  ఎన్నో పీటముడులు, గొళ్ళేలు వేస్తున్నాం. ఈ దేశ మహిళలు కోరుకునేది పూజలు పునస్కారాలు కాదు, వారికి కావాల్సింది సమానమైన చట్టబద్దమైన హక్కులు. ఆ హక్కులను కల్పించడమే మహిళలకు ఇచ్చే నిజమైన గౌరవం.
ప్రపంచ స్థాయిలో మన స్థానం ఎక్కడ?
మహిళా రాజకీయ భాగస్వామ్యం లేని దేశం అభివృద్ధి చెందదు. అంతర్జాతీయ గణాంకాలతో పోలిస్తే భారత చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఆందోళనకరంగా ఉంది. ఏప్రిల్ 2026 నాటి తాజా గణాంకాలను పరిశీలిస్తే: 
  • ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో మహిళల సగటు ప్రాతినిధ్యం 27.5%
  • మన లోక్ సభలో మహిళా ఎంపీల శతం 13.6% మాత్రమే. అంటెం ప్రపంచ సగటులో సగం కూడా కాదు. 
  • రాజకీయాల్లో మజిలా ప్రాతినిధ్యం విషయంలో విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 190 దేశాల జాబితాలో మన స్థానం 147.
  • రువాండా- 63.8%, క్యూబా – 57.2% వంటి దేశాలతో పోలిస్తే మనమెంతో వెనుకబడి ఉన్నాం.  
  • కనీసం మన పొరుగుదేశాలైన నేపాల్ , బంగ్లాదేశ్ , పాకిస్తాన్ ల కంటే కూడా మన దేశంలో మహిళా ప్రాతినిధ్యం బలహీనంగా ఉండటం బాధాకరం.  
స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉన్న కారణంగా దాదాపు 46% మహిళా ప్రతినిధులు ఉన్నారు. అదే చట్టసభల్లో ఎందుకు సాధ్యం కావడం లేదు?  మహిళా రిజర్వేషన్  లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ చట్టం అమలైతే తప్ప ఈ అంతరాన్ని తగ్గించలేం.
  నారీ శక్తి వందన్ అధినియం: చట్టం గొప్పదా? ఆచరణా?  
దశాబ్దాల పోరాటం తర్వాత 2023లో నారీ శక్తి వందన్ అధినియం’ చట్టం వచ్చింది. 2023 ఎన్నికలలో మహిళల రిజర్వేషన్ అమలు కాకుండా జనాభా గణన , నియోజకవర్గాల పునర్విభజన అనే గొళ్ళేలు పెట్టారు. 2026లో తాజాగా నియోజకవర్గాల విభజన బిల్లు వీగిపోవడం వెనుక ఉన్నది రాజకీయ ఓటమే కాదు. అధికారంలో ఉన్న వారు మార్పును ఎంతవరకు కోరుకుంటున్నారనేదే అసలు ప్రశ్న. అన్ని రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలమని చెబుతూనే అమలును అస్పష్టమైన భవిష్యత్ లోకి నెట్టివేయడం ఒక వ్యూహాత్మక జాప్యం కాదా? ప్రస్తుతం ఉన్న సీట్లతోనే 33% రిజర్వేషన్ కల్పించడం సాంకేతికంగా సాధ్యమే. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మాదిరిగానే దీనిని అమలు చేయొచ్చు.
అసమాన పరుగుపందెం 
రిజర్వేషన్లు ఒక ఎత్తయితే, రాజకీయ పార్టీలు స్వచ్చందంగా మహిళా అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తే మహిళా భాగస్వామ్యం కొంతైనా పెరగొచ్చు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. పార్టీలు టికెట్ ఇస్తే సరిపోదు. ఆ టికెట్ పొందిన మహిళా గెలిచే పరిస్థితి కూడా ఉండాలి. ప్రస్తుత రాజకీయాల్లో గెలవాలంటే ధనబలం కావాలి. పురుషులతో పోల్చినప్పుడు మహిళలకు స్వతంత్ర ఆర్థిక వనరులు తక్కువ. కోట్లు ఖర్చుపెట్టి ప్రచారం చేయడం పెద్ద సవాలే. రాజకీయాల్లో పెరిగిపోతున్న హింస, రౌడీయిజం, వ్యక్తిగత దూషణల వాళ్ళ మంచి చదువు సంస్కారం ఉన్న మహిళలు రాజకీయాలకు దూరంగా ఉండటం.
తరతరాలుగా రాజకీయ అధికారాన్ని, నెట్ వర్క్ ను అనుభవిస్తున్న పురుషులతో ఎటువంటి నేపథ్యం లేని మహిళా పోటీ పడటం అంటే అసమాన పరుగు పందెం వంటిదే. అందుకే మహిళలకు రిజర్వేషన్ కావాలి అని 1990 నుంచి మహిళాలోకం గొంతెత్తుతున్నది. ఒక నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ అయినప్పుడు , అక్కడ పోటీపడే అభ్యర్థులందరూ మహిళలే ఉంటారు కాబట్టి ఆర్ధిక బలం, కండబలం ప్రభావం కొంత తగ్గవచ్చు. మహిళల మధ్యే పోటీ కాబట్టి ఎవరో ఒక మహిళ గెలుస్తుంది.  మొదటితరం నాయకురాళ్లు రాజకీయాల్లోకి రావడానికి ధైర్యం చేస్తారు.  వ్యవస్థాగత అడ్డంకులను అధిగమించి మహిళలు నిర్ణయాత్మక శక్తులుగా ఎదగగలుగుతారు.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రిజర్వేషన్లు అంటే మహిళా ప్రాతినిధ్యాన్ని మరో పదేళ్ళపాటు వెనక్కి నెట్టేయడమే. మహిళలకు రిజర్వేషన్ అమలైతే ఇప్పుడున్న పురుష పార్లమెంటు సభ్యుల్లో 181 మంది తమ సీట్లు వదులుకోవాల్సి వస్తుందని వారి బాధ. అందుకే ఈ నాటకం. చట్టాన్ని కాగితాలకే పరిమితం చేసి అమలును అస్పష్టమైన భవిష్యత్ లోకి నెట్టడం.
ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై చిత్తశుద్ధి ఉంటే జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు.  ప్రస్తుత నియోజకవర్గాల్లోనే రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్లు అమలుచేయొచ్చు. దీనికి జనగణన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే మహిళా వోటర్ల శాతమే ఎక్కువ కనిపిస్తుంది. అంటే రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చడంలో లేదా నిలబెట్టడంలో మహిళలది కీలకమైన పాత్ర. మహిళల వోట్లు ఆకర్షించడానికి మహాలక్ష్మి, గృహలక్ష్మి వంటి పథకాలతో ఎరవేస్తున్నాయి రాజకీయ పార్టీలు. కానీ వారికి అధికారం ఇవ్వడానికి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నాయి. వోటరుగా పనికొచ్చే మహిళ నాయకురాలుగా ఎందుకు పనికిరాదు? మహిళ నాయకురాలిగా ఎదగడానికి ఎందుకు సహకరించరు?
నిర్ణయాత్మక శక్తిగా మారాలి
మహిళలు వోటు బ్యాంకుగా కాదు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వని పార్టీలకు వోటు వేయం అని చెప్పే స్థాయికి ఎదగాలి. మహిళలు వోటు బలాన్ని ఒక సంఖ్యల కాకుండా ఒక రాజకీయ ఆయుధంగా వాడినప్పుడు మార్పు తప్పకుండా వస్తుంది. ప్రభుత్వం వోటు కోసం విదిలించే ఉచితాలు తాత్కాలికం. కానీ చట్ట సభల్లో దక్కే అధికారం శాశ్వత పరిష్కారం. కులమత, ప్రాంతీయ భేదాలను పక్కన పెట్టి మహిళలంతా ఒకే గొంతుకతో రిజర్వేషన్ ఇవ్వని పార్టీలకు వోటు లేదు అని చెప్పాలి. జనాభా గణన తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ కోసం ప్రభుత్వంపై వత్తిడి తేవాలి.
ఒక నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ అయినప్పుడు అక్కడ అందరూ మహిళలే పోటీ చేస్తారు. దీనివల్ల ధనబలం, కండబలం ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. ఇది మొదటి తరం మహిళా నాయకురాళ్లకు ధైర్యాన్ని ఇస్తుంది. రాజకీయాల్లో మహిళలు నిర్ణేతలుగా మారినప్పుడే, మహిళా రక్షణ, సమాజ భవిష్యత్ మరింత సురక్షితంగా, మెరుగ్గా ఉంటుంది. మహిళలకు నిజమైన గౌరవం అంటే పదవులు కట్టబెట్టడం కాదు, నిర్ణయాధికారం వారికీ సమాన వాటాను ఇచ్చి, గడప దాటించి పార్లమెంటు వైపు నడిపించడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *