“ముఖ్యంగా ప్రభుత్వంల మంత్రులుగా చలామణి అవుతున్న వారు తమ సామాజిక వర్గాల జనాభాను రికార్డుల్లో కావాలని ఎక్కువగా చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం సాంకేతిక లోపమా లేక ఒక పథకం ప్రకారం జరుగుతున్న సామాజిక కుట్రనా? అనే ప్రశ్నలు నేడు ప్రతి అణగారిన సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వేల సంఖ్యలో ఉన్న ప్రజలను కాగితం మీద మాయం చేస్తూ, లేని జనాభాను ఉన్నట్లుగా సృష్టించడం ద్వారా సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తున్నారు. పారదర్శకత లేని ఈ సర్వేలు అట్టడుగు వర్గాల గొంతు నొక్కడానికే ఉపయోగపడుతున్నాయి..”
మండలాల వారీగా జనాభా లెక్కల్లో పాలకుల హస్తం!

సీనియర్ జర్నలిస్ట్
మొబైల్ : 9848559863
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం నిర్వహించే గణాంకాలు లేదా సర్వేలు అనేవి ఆయా సామాజిక వర్గాల సమగ్ర అభివృద్ధికి దిక్సూచిలా ఉండాలి. ఎవరికి ఎంత వాటా దక్కాలి, ఏ ప్రాంతానికి ఎన్ని నిధులు కేటాయించాలి, ఏ వర్గానికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి అనే కీలక నిర్ణయాలకు ఈ లెక్కలే ప్రాధాన్యత వహిస్తాయి. కానీ, దురదృష్టవశాత్తు నేడు రాష్ట్రంలో జరుగుతున్న జనాభా గణనలు, కుల సర్వేలు సామాజిక న్యాయం కోసం కాకుండా, అధికారంలో ఉన్న వర్గాల ఆధిపత్యాన్ని శాశ్వతం చేయడం కోసం ఆడుతున్న కుటిల నాటకాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంల మంత్రులుగా చలామణి అవుతున్న వారు తమ సామాజిక వర్గాల జనాభాను రికార్డుల్లో కావాలని ఎక్కువగా చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం సాంకేతిక లోపమా లేక ఒక పథకం ప్రకారం జరుగుతున్న సామాజిక కుట్రనా? అనే ప్రశ్నలు నేడు ప్రతి అణగారిన సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వేల సంఖ్యలో ఉన్న ప్రజలను కాగితం మీద మాయం చేస్తూ, లేని జనాభాను ఉన్నట్లుగా సృష్టించడం ద్వారా సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తున్నారు. పారదర్శకత లేని ఈ సర్వేలు అట్టడుగు వర్గాల గొంతు నొక్కడానికే ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం మరియు సర్వే సిబ్బంది మంత్రుల కనుసన్నల్లో పనిచేస్తూ వాస్తవాలను సమాధి చేస్తున్నారు.
జనాభా ఉన్న కులాలు మాయమైపోవడం, జనాభా లేని వర్గాలు రికార్డుల్లో పెరిగిపోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో పాలకులు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ స్వార్థం కోసం అస్తిత్వ పోరాటాలను అణచివేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఏ మండలంలో ఏ కులం వారు ఎంత ఉన్నారో అధికారికంగా వివరాలు అడిగితే ప్రభుత్వం ఎందుకు దాటవేస్తోంది? అంటే, గణాంకాలు బయటపెడితే తమ బండారం బయటపడుతుందనే భయం పాలకులను వెంటాడుతోంది. జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన అధికారాన్ని, నిధులను దొడ్డిదారిన దోచుకుంటున్న ఈ ధోరణి సామాజిక ద్రోహానికి పరాకాష్ట. ప్రభుత్వ సర్వేలు పక్షపాత రహితంగా జరగనప్పుడు, అవి ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాయి. ఈ అంకెల విషవలయం వల్ల భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతోంది.
మంత్రులు తమ హోదాను వాడుకుని వ్యవస్థలను మేనేజ్ చేయడం సిగ్గుచేటు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు, ప్రభుత్వ నివేదికలకు పొంతన లేకపోవడం పాలకుల కుట్రలను స్పష్టం చేస్తోంది. అట్టడుగు వర్గాల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ సాగుతున్న ఈ పరిపాలనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారీగా సేకరిస్తున్న డేటాలో కేవలం కొన్ని వర్గాలకే మేలు జరిగేలా సాగుతున్న ఈ గారడీని అడ్డుకోకపోతే, భవిష్యత్తులో సామాజిక విద్వేషాలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రజాధనంతో నిర్వహించే సర్వేలు కేవలం పాలకుల రాజకీయ లబ్ధి కోసం వాడటం ఎంతవరకు సమంజసం? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
మంత్రి పదవుల అండతో అంకెల గారడీ
ప్రస్తుత పాలకుల తీరు చూస్తుంటే “అధికారం మాది.. లెక్కలు మావే” అన్న చందంగా ఉంది. మంత్రులు తమ ఇలాకాలో సర్వే సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి మరీ అంకెలను తారుమారు చేస్తున్నారు. ఒక మండలంలో లేదా జిల్లాలో తమ సామాజిక వర్గం జనాభా వాస్తవానికి తక్కువగా ఉన్నప్పటికీ, వారు రాజకీయంగా బలంగా ఉన్నారనే భ్రమను కల్పించడానికి జనాభాను పెంచి చూపుతున్నారు. ఇలా జనాభా పెరగడం వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉంది. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు తమ వర్గానికి ఎక్కువ సీట్లు దక్కించుకోవడం, బడ్జెట్ కేటాయింపుల్లో తమ కులపోళ్లకే ఎక్కువ వాటా మళ్లించుకోవడం ఈ కుట్రలోని ప్రధాన ఉద్దేశ్యం. అధికారం శాశ్వతం చేసుకోవడం కోసం లేని జనాభాను కాగితం మీద సృష్టించడం ప్రజాతీర్పును అవమానించడమే.
నాయక పోడు తెగ ఉనికిపై గొడ్డలిపెట్టు
ఈ అంకెల గారడీకి నిలువెత్తు సాక్ష్యం ‘నాయక పోడు’ తెగ పరిస్థితి. రాష్ట్రంలోని దాదాపు 8 జిల్లాల్లో, ప్రతి మండలంలోనూ ఈ తెగ జనాభా విస్తరించి ఉన్నప్పటికీ, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వారి ఉనికి నామమాత్రంగానే కనిపిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు, అధికారులు నిద్రపోతున్నారా లేక రెవెన్యూ యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే వీరిని విస్మరిస్తోందా? క్షేత్రస్థాయిలో వేల సంఖ్యలో ఉన్న నాయక పోడులను సాధారణ వర్గాల్లో కలపడం ద్వారా లేదా అసలు లెక్కల్లోకి తీసుకోకపోవడం ద్వారా వారి అస్తిత్వాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోంది. ముదిరాజ్, మున్నూరు కాపు, గౌడ వంటి అత్యధిక జనాభా కలిగిన కులాల పరిస్థితి కూడా ఇదే. గ్రామాల్లో గడప గడపకూ తిరిగితే వారి జనాభా ఎంత ఉందో అర్థమవుతుంది, కానీ ప్రభుత్వ రిపోర్టులు వచ్చేసరికి ఈ కులాల సంఖ్య ఆవిరైపోతోంది.
1981 నాటి లెక్కలు – పాలకుల వైఫల్యాలు
1981 సర్వేను ప్రామాణికంగా తీసుకుంటే, అప్పట్లో ఉన్న ఎస్టీ తెగలు ఇప్పుడు అనూహ్యంగా తగ్గిపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శనం. సామాజికంగా ఎదగాల్సిన తెగలు రికార్డుల నుంచి మాయం కావడం వెనుక పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు, ఏ ప్రాతిపదికన కొన్ని అధికార వర్గాల జనాభా విపరీతంగా పెరిగిపోయింది? ఆ జనాభా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? కేవలం కాగితం మీద అంకెలు మార్చడం ద్వారా ఒక సామాజిక వర్గాన్ని బలవంతులుగా చూపించే ప్రయత్నం సాగుతోంది. ఇది కేవలం అంకెల తప్పు కాదు, సామాజిక సమతుల్యతను దెబ్బతీసే అక్షర దాడి. మంత్రులు తమ హోదాను వాడుకుని వ్యవస్థలను మేనేజ్ చేయడం అత్యంత గర్హనీయం.
వ్యూహాత్మక నిర్లక్ష్యం – సామాజిక అన్యాయం
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కొన్ని కులాలను బలహీనపరిచేలా ఈ గణాంకాలను రూపొందిస్తోంది. జనాభా నిష్పత్తి ప్రకారం దక్కాల్సిన రిజర్వేషన్లు, విద్య మరియు ఉద్యోగ అవకాశాలు ఈ తప్పుడు లెక్కల వల్ల అణగారిన వర్గాలకు అందకుండా పోతున్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో కేవలం జనాభా ఎక్కువగా చూయించుకున్న వర్గాలకే పెద్దపీట వేస్తూ, అట్టడుగు వర్గాలకు నామమాత్రపు నిధులతో సరిపెడుతున్నారు. ఇది పాలకుల పక్షపాత వైఖరికి పరాకాష్ట.
ప్రజలే బుద్ధి చెప్పాలి
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అంకెలతో ఆడుకుంటూ జనాభాను మాయం చేస్తున్న పాలకుల తీరును సమాజం గమనిస్తూనే ఉంది. మంత్రుల హోదాలో ఉండి, సొంత సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ప్రభుత్వ వ్యవస్థలను, సర్వేలను వాడుకోవడం సిగ్గుచేటు. నాయక పోడు వంటి తెగలను, వెనుకబడిన కులాలను లెక్కల నుంచి తొలగించి, ఆధిపత్య వర్గాలను మెజారిటీగా చూపే ఈ కుట్రను ప్రజలు తిప్పికొట్టాలి. వాస్తవ జనాభా లెక్కలు బయటకు రానంత వరకు, మండలాల వారీగా కుల గణనను పారదర్శకంగా నిర్వహించనంత వరకు ఈ ప్రభుత్వ సర్వేలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అణగారిన వర్గాల ఉనికిని కాగితాల మీద మాయం చేస్తున్న ఈ అరాచక పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. సామాజిక న్యాయం అనేది కేవలం నినాదాలకు పరిమితం కాకుండా, గణాంకాల్లోనూ ప్రతిబింబించాలి.





