ఇక అణచివేతకు మరో రూపం మోదలైనట్లేనా!?

“ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రాజద్రోహం,ఆయుధాలు చట్టం,నిషేదిత మావోయిస్టు పార్టీ కి సహకారం తదితర సెక్షన్లు,ఉపసెక్షన్లు తోపాటు, బెయిల్ కూడా లభించని”అన్ లాపుల్ యాక్టివిటీస్ ప్రివెన్స్ యాక్టు”(ఉపా) చట్టంక్రింద కేసులు నమోదు అవుతుండడంతో మేధావులు, హక్కుల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని కేంద్రం పరిధిలోని అంశంగా చెప్పి తప్పించుకుంటుంది.” 

-ఎన్.తిర్మల్
మొబైల్ : 9441864514
ఇమెయిల్ ఐడి:thirmal.1960@gmail.com.

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలో అర్బన్ నక్సల్స్ పేరు తో నోటీసులు,విచారణలు, కేసులు నమోదు అవుతున్నాయి.2026మార్చి31తో “ఆపరేషన్ కగార్ లో భాగంగా  నక్సల్స్ ను అంతమొందిస్తామని బహిరంగంగా ప్రకటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అటు తర్వాత అర్భన్ నక్సల్స్ పని పడతామని చెప్పకనే చెప్పారు.ఇప్పుడు ఆయన అన్నంత పని జరుగుతుంది.

   చత్తీస్గఢ్, మహారాష్ట్ర,ఒరిస్సా, మధ్యప్రదేశ్ అటవీప్రాంతం దండకారణ్యం లో గత రెండేళ్లుగా ఆపరేషన్ కగార్ పేరుతో నక్సల్స్ ఎన్కౌంటర్ల  లో మరణించినప్పుడు,  నక్సల్స్ తో చర్చలు జరపాలని,లేక అక్కడ మరణించిన నేతలకు తెలుగు నేలపై అంత్యక్రియలు జరిగినప్పుడు వామపక్ష పార్టీలు, వివిధ నక్సల్స్ వర్గాలు, పౌరహక్కుల సంఘాలు, పలువురు మేధావులు , నక్సల్స్ సానుభూతి పరులు సంఘిబావంగా ఆందోళన చేశారు.నక్సల్స్ కీలక నేతలు మరణించినప్పుడు అంత్యక్రియలుకు బంధుమిత్రులతో పాటు,పూర్వాశ్రమంలో పరిచయం ఉన్న ఇతర పార్టీల మిత్రులు వాటికి హాజరయ్యారు.

    నక్సల్స్ కథ దండకారణ్యం లో చాలా వరకు ముగింపు కొచ్చింది.చనిపోయినవారు చనిపోగా, మిగిలిన వారు ఆయుధాలు,డబ్బు, బంగారం తో లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్ కు వారికి ప్రకటించిన ప్యాకేజీల తోపాటు, తాత్కాలిక పునరావాసం కోసం ఆయా ప్రభుత్వాలు కొంత నగదు కూడా ఇచ్చాయి.లొంగిపోయిన నక్సల్స్ పై ఉన్న కేసులు రద్దు చేయడంతో వారు స్వేచ్ఛగా జనంలో తిరుగుతున్నారు.అంతవరకు బాగానే ఉంది.”ఎంకిపెళ్ళి సుబ్బి చావు కొచ్చింది “అన్న సామెతగా ఇప్పుడు నక్సల్స్ కోసం రోడ్డెక్కిన పలు ప్రజాసంఘాలు,వామపక్షాలు, హక్కుల కార్యకర్తలు,మేధావులకు కొత్త చిక్కు వచ్చిపడింది.గతంలో వారు పాల్గొన్న కార్యక్రమం రికార్డులు ఆధారంగా జాతీయ భద్రతా చట్టం క్రింద కేసులు నమోదు అవుతున్నాయి.ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలలో 60మందివరకు యాక్టీవిస్టులకు ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ‘నోటీసులు జారీచేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం ఉంది.మరో 200వరకు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టిన,మద్దతు తెలిపిన వారు, కామెంట్ పెట్టిన వారిపై సైతం అర్భన్ నక్సల్స్ పేరుతో నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రాజద్రోహం,ఆయుధాలు చట్టం,నిషేదిత మావోయిస్టు పార్టీ కి సహకారం తదితర సెక్షన్లు,ఉపసెక్షన్లు తోపాటు, బెయిల్ కూడా లభించని”అన్ లాపుల్ యాక్టివిటీస్ ప్రివెన్స్ యాక్టు”(ఉపా) చట్టంక్రింద కేసులు నమోదు అవుతుండడంతో మేధావులు, హక్కుల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని కేంద్రం పరిధిలోని అంశంగా చెప్పి తప్పించుకుంటుంది. ఇప్పటికే అలాంటి ప్రకటనలు వచ్చిఉన్నాయి.అయిత,రాజ్యాంగం పరిధిలో చేసిన ఆందోళన, డిమాండ్లు రాజద్రోహం ఎలా అవుతాయి? ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేయడం ఎంతవరకు సబబు అని హక్కుల నేతలు ప్రశ్నిస్తున్నారు?

    తొలుత ఉపా చట్టం క్రింద జనగామ జిల్లా జాఫర్ గడ్ కు చెందిన మాజీ మావోయిస్టు యాక్టివిటీస్ట్, పౌరహక్కుల ఉద్యమం దేశవ్యాప్తంగా నిర్మాణం తలపెట్టిన గాదె.ఇన్నయ్యను తొలుత ఉపా చట్టం క్రింద అరెస్టు చేశారు.ఈయన ఆపరేషన్ కగార్ సమయంలో ఎన్కౌంటర్ లు జరిగిన సందర్భంలో టీవి చర్చలలో పాల్గొనడం, ముఖ్యంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి (వికల్ఫ్), కాటా సత్యనారాయణ రెడ్డి (రాజూదాదా) అంత్యక్రియలు సందర్భంగా ఆయన మాట్లాడడం తదితర విషయాలపై ఆయనను అరెస్టు చేశారు.ఆయనే కాదు వీరి అంత్యక్రియలుకు హాజరైన అనేక మందికి యన్ఐఏ నోటీసులు జారీ చేసింది. గాదె ఇన్నయ్య జాఫర్ గడ్ లో నడుపుతున్న అనాధ ఆశ్రమం కు నిధులు ఎక్కడ నుండి వస్తున్నాయి.అనే దిశగా సైతం విచారణ జరుపుతున్నారనేది సారాంశం.బాధాకరం అయిన విషయం ఏమంటే ఆయన ఈ నిర్భంధం, విచారణ లో ఉండగానే  ఆయన తల్లి,తండ్రి చనిపోవడం విచారకరమైన అంశం.అయితే ఇప్పుడు ఆయనకూడా హాస్పిటల్  చికిత్స పొందుతున్నారు. ఇలాంటి చట్టాల క్రింద నేరనిర్థారణ కావడం అటుంచి విచారణ ఎదుర్కోవడమే పెద్ద శిక్ష గా భావించవచ్చును.ఇప్పటికే దేశంలో ఎంతో మంది మేధావులు అర్భన్ నక్సల్స్ గా విచారణ ఖైదీలుగా సంవత్సరాల తరబడి జైలు జీవితం అనుభవిస్తున్నారు.అలాంటి వారిలో వృద్దాప్యం లోఉన్న మన తెలంగాణా కు చెందిన విప్లవరచయిత వరవరరావు, నిర్దోషిగా విడుదలై మరణించిన ప్రొ.సాయిబాబు ఉన్నారు.

   ఇక ఇటీవలనే నక్సల్స్ పై నిర్భంధం, ఎన్కౌంటర్ హత్యలు నిరసిస్తూ ప్రదర్శనల్లో పాల్గొన్న,ప్రసంగించిన సిపిఐ యంయల్, మాస్ లైన్ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు కు యన్ఐఏ నోటీసులు అందాయి. ఈనెల 22నవిచారణకు హాజరుకావాల్సిందిగా కోరారు.ఈ నోటీసులు,విచారణలన్నీ 160 సిఆర్ పిసి ప్రకారం విచారణ అంశాన్ని సాక్ష్యంగా నైనా తీసుకునే అవకాశం ఉంది.ఏదైనా ఆదారం లభిస్తే  కేసు సైతం నమోదు చేసే అధికారం విచారణ సంస్థకు ఉంటుంది.నక్సల్స్ అంత్యక్రియలు కు హజరై లైవ్ ప్రసారం చేసిన,హిడ్మా గ్రామం ‘పూవర్తి’ వెళ్లి ఆయన తల్లిని ఇంటర్వ్యు చేసిన మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు రఘును సైతం ఎన్ఐఏ విచారణ జరిపింది.అలాగే నక్సల్స్ అంత్యక్రియలలో పాల్గొన్న వరంగల్ జిల్లా కు చెందిన బంధుమిత్రులు సంఘాలకు చెందిన బారతక్క,శాంతక్క కు సైతం విచారణ సంఘం నోటీసులు అందినట్లు సమాచారం ఉంది.చాలా చిత్రమైన విషయం ఏమంటే కాటా రామచంద్ర రెడ్డి (వికల్ఫ్) అంత్యక్రియలు కు హాజరైన ఆయన బాల్య మిత్రులు తెలంగాణా సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డికి నోటీసులు అందాయి.ఈయనకు ఇటీవలనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సైతం పొందారు.అదే అంత్య క్రియలకు హాజరైన టీఎన్జీవో నాయకులు ప్రస్తుతం బిఆర్ యస్ పార్టీ నాయకులు దేవీప్రసాద్,రవిచందర్ లాంటి వారికి నోటీసులు అందాయి. ఇక ఎక్కడ ఎన్కౌంటర్ జరిగితే అక్కడ వాలిపోయో పౌరహక్కుల నేత ప్రొ.గడ్డం లక్మన్ కు విచారణ నోటీసులు అందాయయనే సమాచారం ఉంది.

   ఇలా తెలుగు రాష్ట్రలలో అర్భన్ నక్సల్స్ విచారణలో భాగంగా నోటీసులు అందుకుంటే మరోవైపు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని కేసులు కట్టించాలనే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.కరీంనగర్ జిల్లా కు చెందిన ఓ పార్లమెంటు సభ్యుని అనుచరులు శాతవాహన యూనివర్సిటీ లో పనిచేస్తున్న ఓ బలహీనవర్గానికి చెందిన అధ్యాపకులు ప్రొ.సూరేపల్లి సుజాత,కె.మహేష్ అనబడే విద్యార్థిపై అర్భన్ నక్సల్స్ కేసు పెట్టాలని స్థానిక జిల్లా కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు. ఈ సంఘటనకు స్పందించిన విసి సైతం ఆధారం లేని ఆరోపణలుగా వాటిని కొట్టిపారేశారు. అంటే ఈ చట్టాన్ని ప్రత్యర్థులపై వినియోగించుకోవాలనే ప్రయత్నాలు మోదలయ్యాయని అర్థం అవుతుంది.ఈ నోటీసులు, విచారణ తంతు చూసిన సోషల్ మీడియా కార్యకర్తలు కూడా భయపడి పోతున్నారు. ఎన్ఐఏ కూడా బలమైన ఆధారాలు ఏమైనా లభ్యం అయినప్పుడు మాత్రమే అరెస్టు చేస్తుంది తప్ప 160 సిఆర్పీసి నోటీసులు కు పెద్దగా భయపడవలసిన పనిలేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఉభయ తెలుగు రాష్ట్రలలో కేంద్ర విచారణ సంస్థ నోటీసులు మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు, హక్కుల కార్యకర్తలు, రచయితలు, జర్నలిస్టు లు,మేధావి వర్గంలో ఏ క్షణం ఏం జరుగుతుందోననే కొంత ఆందోళన కలిగిస్తున్న మాట వాస్తవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *