Take a fresh look at your lifestyle.

నేటితో ముగియనున్న శరన్నవరాత్రులు

పలు ఆలయాల్లో అమ్మవారికి ఘనంగా పూజలు
కనకదుర్గగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు

విజయవాడ,అక్టోబర3: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకల్లో మునుపటి ఉత్సాహం కానవచ్చింది. మంగళవారంతో శరన్నవ రాత్రి ఉత్సవాలు ముగియనున్న వేళ తెలుగు రాష్టాల్ల్రో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలతో ఆకట్టుకున్నాయి.. బెజవాడ కనకదుర్గతో పాటు శ్రీశైలం,మహానంది, ఆలంపూర్‌, శ్రీ‌కాళహస్తి, బాసర,వేములవాడ, వరంగల్‌ ‌భద్రకాళి తదితర పుణ్యక్షేత్రాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అలంకరణలు చేపట్టారు. అమ్మవారిని రోజూ నిష్టగా పలు రూపాల్లో పూజించడంతో పాటు నైవేద్యాలు సమర్పించి ఆరదాధించడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల బ్రహ్మోత్సవాలతో పాటు, శరన్నవరాత్రులు కూడా మంగళవారంతో ముగియనున్నాయి. సోమవారం బెజవాడ కనకదుర్గ కనకదుర్గగా దర్శనమిచ్చారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి ఊరేగారు. ఇకపోతే వివిధ ఆలయాల్లో ఈ వారం రోజులు రోజుకో అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. జగత్తులన్నింటికీ మూలమైన భగవంతుణ్ని సైతం సృష్టించింది భగవతి అయిన ఈ పరాశక్తియే.

ఇంతేకాదు, ప్రతీ అణువణువులోని ప్రాణశక్తికి, ఆత్మయిక జీవుల్లో నిగూఢంగా ఉండే కుండలినీ శక్తులకూ, పరమాత్మలోని యోగ- మహామాయలకు.. అన్నింటికీ ఆదిమూలమూ ఆమెనే అని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. ఆ మహాశక్తి విశ్వరూపంలో మన దర్శనానికి అందింది అత్యల్పం. కాబట్టి, ప్రతి ఒక్కరూ అహాన్ని పక్కన పెట్టి శక్తి ఆరాధనకు సంసిద్ధులు కావాలి.శక్తి ఆరాధనను ఏదో ఒక మతానికో, వర్గానికో పరిమితం చేయనవసరం లేదు. విశ్వంలో కనిపించని శక్తులూ ఇంకా శాస్త్రవేత్తల మేధకు, విజ్ఞాన శాస్త్రాలకు అందకుండానూ ఉన్నాయి. అవన్నీ మహావిశ్వంలో భాగమే అయినప్పుడు, మానవాళికి సర్వతో ముఖాభివృద్ధికి అవన్నీ ఉపయోగపడుతున్నప్పుడు వాటిని శక్తి రూపంలో ఆరాధించడంలో తప్పులేదు.అణువుల నుంచి బ్రహ్మాండాల వరకూ వ్యాపించిన విశ్వరూపిణి, విజయ వినోదిని ఆదిపరాశక్తి. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. అమ్మల రూపంలో సమస్త మానవాళిని పులకింపజేయడానికి ఆ జగజ్జననియే తరలి వస్తున్న శుభవేళయే దసరా శరన్నవరాత్రులు. ఆశ్వీయుజ మాసం తొలి రోజుల్లో జరిగే ఈ రెండు వేడుకల్లోనూ కోట్లాది మందితో ఆరాధనలు అందుకొనే దైవం ఒక స్త్రీమూర్తి కావడం విశేషం. ఆమెనే సకల జగముల నేలే జగదాంబ. ప్రతీ ఒక్క మానవ మాత్రునికీ అత్యంత విశిష్ఠమని చెప్పాలి. వర్షఋతువు తర్వాత వచ్చే శరధృతువు అంటేనే వెన్నెల కాచే చల్లని సమయం.

దేవీ నవరాత్రులను కూడా ప్రతీ హైందవ సమాజమూ అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకుంటుంది. ఎందుకంటే, దుర్గాదేవి , అమ్మల గన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నా.. ఎవరో కాదు, ఆ ఆదిపరాశక్తే. నమ్మిన వారికి, దైవిక సిద్ధాంతాన్ని ఆచరించే వారికి ఆమె అనేక రూపాలలో దర్శనమిస్తుంది. ఈ శక్తి కూడా అనేక రూపాలలో కనిపిస్తున్నది. అనంత విశ్వం మహాశక్తిపైనే ఆధారపడి ఉంది. భారతీయ ధర్మశాస్త్రాలు ప్రతీ స్త్రీమూర్తినీ శక్తికి ప్రతీకగా అభివర్ణించాయి. ఆ మాటకొస్తే అవి నారీమణులను పూజ్యనీయుల జాబితాలోకే చేర్చాయి. త్రిమూర్తులను, త్రిమాతలను, ఇంకా మొత్తంగా దేవతల గణాన్నందరినీ సృష్టించింది ఆదిపరాశక్తియే. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆమెనే యావత్‌ ‌సృష్టికి కర్త కర్మ క్రియ. కాబట్టి, సర్వశక్తులకూ కేంద్రస్థానం ఈ మహాశక్తి. సృష్టికర్త, సంరక్షకురాలు, దుష్ట వినాశనకారి సర్వం ఆమెనే అని దేవీ భాగవత పురాణం పేర్కొన్నది. ఏడు సింహాలతో కూడిన రత్నాల సింహాసనంపైన ఆదిశక్తి కూర్చుని ఉండడాన్ని త్రిమూర్తులు చూసినట్లు అందులో ఉందని వేదపండితులు చెప్తారు. దేవీ భాగవతం ప్రకారం శక్తిలోని శకు ఐశ్వర్యమని, క్తికి పరాక్రమమని అర్థం చెప్పారు. సృష్టి ఆరంభంలో ఒక్క దేవి మాత్రమే ఉందని, ఆమెయే ఈ బ్రహ్మాండాలన్నింటినీ సృష్టించిందని దేవీభాగవతం చెబుతోంది.

Leave a Reply