నరాలు తెగే ఉత్కంఠ

ఉత్సవాలకు సిద్దమవుతున్న కాంగ్రెస్‌..
హ్యాట్రిక్‌పై బిఆర్‌ఎస్‌ ధీమా
నిశ్శబ్దంలో బీజేపీ క్యాంప్‌..
హంగ్‌ వొస్తే సమీకరణాలపైనా చర్చ

మండువ రవీందర్‌రావు,  ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 : రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి రెండు రోజులు అయింది. ఈ రెండు రోజులు అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు నరాలు తెగేంతగా ఉత్కంఠతకు లోనవుతున్నారు. ఎక్కడ నలుగురు చేరినా గెలుపు ఓటములపైనే చర్చించుకుంటున్నారు. పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, సోషల్‌ మీడియాల్లో ఇదే అంశంపైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. క్షణాల్లో ఫలితాలు వెల్లడైతే బాగుండన్నట్లుగా ప్రజలంతా ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌ హవా ఉందన్న టాక్‌ బాగా వినిపిస్తున్నది. ఎన్నికలు కాగానే అనేక ఎగ్జిట్‌ పోల్‌ సంస్థలు కూడా కాంగ్రెస్‌ వైపుకే మొగ్గుచూపాయి. అయితే ఈ ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పే లెక్కలను ఎంతవరకు నమ్మవచ్చు అన్న సంశయం కూడా లేకపోలేదు. ఏ పార్టీ అధికారంలోకి వొస్తుందన్నది ఒకటి కాగా, ఆ గెలుపులో తాము భాగస్వామిగా ఉంటామా…లేదా…అన్న గుబులు ఆయా పార్టీ అభ్యర్ధుల్లో నెలకొంది. నవంబర్‌ 30న జరిగిన ఎన్నికలకు ముందు దాదాపు రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అంటే అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ మొదలు కాంగ్రెస్‌, బిజెపి లాంటి జాతీయ పార్టీలు వ్యూహరచనలు చేస్తూ వొచ్చాయి. ఈ మూడు పార్టీలు చివరి వరకు హోరాహోరీగా పోటీ పడిన చివరలో మాత్రం బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యనే పోటీ కొనసాగింది. ఈసారి రాష్ట్రంలో తమదే అధికారం, గోలకొండ కోటపైన కాషాయ జండా ఎగరటం ఖాయమని చెప్పుకుంటూ వొచ్చిన బిజెపి ఒక అంకె సీట్లకే పరిమితం అవనుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో బిజెపి నాలుగా స్థానాలను గెలుచుకోగా, ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది.
ఈసారి కాస్తా పెంచుకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థానాలను మాత్రం బిజెపి సాధించుకోలేదన్న విషయాన్ని దాదాపు పదికిపైగా ఎగ్జిట్‌పోల్స్‌ సంస్థలు ప్రకటించాయి. ఈ సంస్థలన్నీ బిజెపికి రెండు నుంచి పదమూడు స్థానాకు మధ్యనే సాధించుకుంటుందన్న లెక్కలు చూపిస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ నేతలు మాత్రం 18 నుండి 22 స్థానాల్లో గెలుస్తామంటున్నారు. దీన్నిబట్టి బిజెపి ఇంతకాలం అధికారంలోకి వొస్తామన్న కలలు కల్లలే అన్నది అర్థమవుతున్నది. దీంతో అసలైన పోరాటం బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మద్యనే సాగిందన్నది దీనివల్ల స్పష్టమవుతున్నది. ఈ సంస్థలు అధికార బిఆర్‌ఎస్‌కు 31 నుండి ఎక్కువలో ఎక్కువగా 56 స్థానాలవరకు రావచ్చని లెక్కలు వేశాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 60 ఉండాల్సి ఉంటుంది. అయితే బిఆర్‌ఎస్‌ అరవై స్థానాలకు చేరుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నది ఎగ్జిట్‌పోల్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కాగా తమకు 70 స్థానాలకు మించి వొస్తాయంటోంది బిఆర్‌ఎస్‌. ఈ ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు సరికాదని, తమ గెలుపు తద్యం అంటుంది ఆ పార్టీ. ఈ అంకెల గారడి చూసి పరేషన్‌ కావొద్దు, ఆగమాగం కాకుండా ప్రశాంతంగా ఉండాలని, హ్యాట్రిక్‌తో బిఆర్‌ఎస్సే అధికారంలోకి వొస్తుందన్న ధీమాను స్వయంగా ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తొందర పడకుండా ఫలితాలు వొచ్చిన తర్వాతే మనం సంబురాలు చేసుకుందామని పార్టీ నాయకులకు చెప్పినట్లు కూడా తెలుస్తున్నది. ఇకపోతే అన్ని ఎగ్జిట్‌పోల్‌ సంస్థలు కాంగ్రెస్‌ను టాప్‌లో చూపించాయి.
ఇండియా టివి, సీఎన్‌ఎక్స్‌ అయితే అన్నిటి కన్నా ఎక్కువగా 63 నుండి 79 స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని చెప్పింది. టుడేస్‌ చాణక్య 71 స్థానాలను,  టైమ్స్‌ నౌ`ఈటీజ్‌ అయితే 60 నుండి 70 స్థానాలవరకు కాంగ్రెస్‌కు రావొచ్చని అంచనా వేసింది. ఇండియా టుడే` యాక్సిస్‌ మై ఇండియా 60 నుండి 70 స్థానాలను చూపించింది. అన్నిటికన్నా తక్కువగా జన్‌కీ బాత్‌ 48 నుండి 64కు పరిమితం చేసింది. ఒక వైపు ఎక్సిట్‌పోల్‌ ఫలితాలు, రెండో వైపు రాష్ట్రంలో ఎక్కడ విన్నా కాంగ్రెస్‌ అన్న మాటలతో కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలకు సిద్దపడుతున్నారు. దానికన్నా ముందు ఆదివారం ఫలితాలు వెల్లడి కావడంతోనే గెలిచిన అభ్యర్ధులను ముందుగా కాపాడుకునే కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఉంది. మ్యాజిక్‌ ఫిగర్‌కు కాస్తా దగ్గరలో బిఆర్‌ఎస్‌ ఉంటే తమ అభ్యర్ధులను ఎగురవేసుకుపోయే ప్రమాదముందని కాంగ్రెస్‌ జాగ్రత్త పడుతున్నది. అందుకు ఈ బాధ్యతను కర్ణాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్‌కు అధిష్టానం అప్పగించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే గెలుస్తారనుకుంటున్న తమ అభ్యర్ధులతో బిఆర్‌ఎస్‌లో టచ్‌లో ఉందన్న బాంబు పేల్చాడు శివకుమార్‌.
బిఆర్‌ఎస్‌ నేతలు ఎవరితోనైతే మాట్లాడారో వారే తనకు స్వయంగా చెప్పారంటున్నారాయన. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు క్యాంపు రాజకీయాలకు తెరలేపబోతున్నారు. గెలిచిన అభ్యర్ధులను వెంటనే బెంగుళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఏర్పాటు విషయాలపై స్పష్టత వొచ్చిన తర్వాతే వారిని తెలంగాణకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. బిఆర్‌ఎస్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా కాంగ్రెస్‌ అధిష్టానం రంగంలోకి దిగుతున్నారు. ఫలితాలు వెల్లడవుతున్న క్రమంలోనే  కాంగ్రెస్‌ అగ్రనేతలంతా రాజధానిలో తిష్ట వేయబొతున్నారు. ఇదిలా ఉంటే అనుకోని రీతిలో హంగ్‌ వస్తే ఎలా అన్నదానిపైన కూడా చర్చ జరుగుతుంది. వొచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీచేస్తామని చెప్పి, తమతో ఒక్క మాట కూడా చెప్పకుండా 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కెసిఆర్‌కు ఆ పక్షాలు మద్దతిచ్చే పరిస్థితి అయితే లేదు. ఎంఐఎం కూడా పూర్తి స్థానాలను గెలచుకోదంటున్నారు. అయిదు స్థానాలకే ఆ పార్టీ పరిమితం కావచ్చని లెక్కలు చెబుతున్నాయి. బిజెపి ఎలాగూ మద్దతివ్వదు. ఈ పరిస్థితిలో హంగ్‌ ఏర్పడితే  బిఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా జరుగుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page