- మోడీ ఏ మొహం పెట్టుకుని వొస్తున్నారు
- ప్రజలను అవమానించినందుకు ఏం సమాధానం ఇస్తారు
- దక్షిణాదిపై సవతితల్లి ప్రేమ చూపుతూ ఇక్కడ సమావేశాలా
- బిజెపి కార్యవర్గ సమావేశాలపై మండిపడ్డ రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : బిజెపి కార్యవర్గ సమావేశాలతో మరోమారు దక్షిణాది రాష్ట్రాలను బోల్తాకొట్టించే కుట్రజరుగుతుందని పిసిపి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణాదిని అన్ని రంగాల్లో విస్మరించిన బిజెపి ఇక్కడడి ప్రజలకు ఏం సమాధానం చెబుతుందని అన్నారు. గురువారం నాడిక్కడ ఆయన వి•డియాతో మాట్లాడుతూ మోసాల్లో బిజెపి ఆరితేరిందన్నారు. తెలంగాణ పక్రియనే తప్పుపట్టిన మోడీ ఈ సమావేశాల్లో ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. అలాగే తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారో ఆ పార్టీ నేతలు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే నేషనల్ పార్టీలు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తాయని, మరి తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. కాకినాడ సభలో బీజేపీ పార్టీ ఒక్క వోటు రెండు రాష్ట్రాలని చెప్పి మోసం చేసిందన్నారు. ఎన్ని అవాంతరాలు వొచ్చినా యూపీఏ హయాంలో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన తర్వాత సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. అయితే..అనాడు తెలంగాణ రాష్ట్ర పక్రియను బీజేపీ వాళ్లు అడ్డుకోవాలని ప్రయత్నాలు చేశారని అన్నారు. తెలంగాణ బిల్లు పక్రియ పూర్తయ్యే వరకూ సోనియాగాంధీ చాలా కృషి చేశారన్నారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీదేనని, అలాంటి సోనియాను పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ తప్పుపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ ఏర్పాటు పక్రియను మోడీ తప్పుపట్టారంటూ మండిపడ్డారు. ఎనిమిదేళ్ల తర్వాత లోక్ సభలో రాష్ట్ర పక్రియను, మనుగడను మోడీ అవమానించారని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ తెలంగాణకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్నారు. నిధుల విషయం గురించి తాము లోక్ సభలో ప్రస్తావించినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచేలా ప్రధాని మోడీ మాట్లాడి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఇచ్చిన హావి•లను ఒక్కటైనా నెరవేర్చారా..? అని ప్రశ్నించారు. ఆంధప్రదేశ్‌కు కూడా హోదా ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర మనుగడను, ప్రజల ఉనికికి ప్రశ్నార్థకం చేస్తూ, అవమానించిన ప్రధాని మోడీ తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వొస్తున్నారని ప్రశ్నించారు.
దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఉత్తర భారతదేశానికి మాత్రం ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉప రాష్ట్రపతి పదవికాలం పూర్తయ్యాక తెలుగు వ్యక్తి అయిన వెంకయ్య నాయుడుని ఇంటికి సాగనంపే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. వెంకయ్య నాయుడుని అవమానకర రీతిలో కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి..తెలుగువాళ్లను ప్రధాని నరేంద్రమోడీ అవమానించారని మండిపడ్డారు. కేబినెట్‌లో శాఖల కేటాయింపుల్లోనూ ఉత్తర భారతేశానికి చెందిన ఎంపీలకే కీలక శాఖలు కట్టబెట్టారని, దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్లకు మాత్రం ప్రాధాన్యత లేని శాఖలను కేటాయించారని చెప్పారు. ఆంధప్రదేశ్‌కు ఒక్కరు కూడా కేంద్రమంత్రి లేరని, తెలంగాణ రాష్ట్రానికి (కిషన్ రెడ్డి) ఉన్నా ఉపయోగం లేదన్నారు. రాజకీయాల్లో, వ్యాపార రంగల్లోనూ తెలుగువాళ్లను అధమస్థాయి పౌరులుగా చూస్తున్నారని ఆరోపించారు.