ఆరు నుంచి ఎనిమిదికి చేరిన మహిళా ప్రతినిధులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈ పర్యాయం వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో నలుగురు తొలిసారిగా ఎన్నికైనవారే ఉండటం విశేషం. కొత్తగా విజయం సాధించినవారిలో కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, పాలకుర్తిలో మామిడాల యశస్విని, నారాయణ్‌పేట్‌లో పర్నికా రెడ్డి ఉండగా, ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మి ఉన్నారు.
ఇకపోతే గంలో కాంగ్రెస్ నుంచి బిఆర్‌ఎస్‌లో చేరి నర్సాపూర్‌లో నిలబడ్డ సునితా లక్ష్మారెడ్డి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ తూర్పులో కొండా సురేఖ, ములుగులో సీతక్క, కోదాడలో పద్మావతి రెడ్డి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గత ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి, గొంగిడి సునిత, హరిప్రియా నాయక్, రేఖా నాయక్, సీతక్క, పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఏడుగురు మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది. వారిలో లాస్య నందిత, కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి మాత్రమే విజయం సాధించారు.