తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు

తెలంగాణలో రాజకీయం సెగలుకక్కుతోంది. మునుపెన్నడూ లేనంతగా రాజకీయపార్టీల మధ్య వైశమ్యాలు చోటుచేసుకున్నాయి. ఏ రాజకీయ పార్టీని చూసినా ఏదో అపనిందను మోస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆయా పార్టీల నాయకులమధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తారతమ్యాలు మరిచి ఒకరిపై ఒకరు ఆరోపణలేకాకుండా దాడులు పాల్పడుతున్నారు. ఆఖరికి విచారణ సంస్థలు రంగప్రవేశం చేసేవరకు ఈ గొడవలు చేరుకున్నాయి. ఒకపక్క ఇడి దాడులు, మరోపక్క ఐటి శోధనలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది. దీంతో తెలంగాణలో శాంతిభద్రతలు లోపించాయన్నది ఇప్పుడు ప్రధాన అంశంగా మారుతున్నది. మరో ఏడాదిలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగనుండగా ఇప్పటినుండే రాజకీయ వాతావరణం రణరంగంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారపార్టీని గద్దెదించాలన్న వ్యూహంగానే పనిచేస్తున్నాయి. వీలైతే ముందస్తు ఎన్నికలకైనా సిద్ధమేనంటున్నాయి. ఈలోగా శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నదన్న మిషతో రాష్ట్రంలో రాష్ట్రపతిపాలనను పెట్టించాలన్న దిశగా కూడా ఆయా పార్టీలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్న వాతావరణం కనిపిస్తున్నది.

ప్రధానంగా టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీల మధ్య ఇటీవల కాలంలో పచ్చిగడ్డివేస్తే భగ్గుమన్నట్లు తయారైంది. ధాన్యం కొనుగోలు వ్యవహారంతో మొదలైన ఈ రెండు పార్టీలమధ్య ఘర్షణ విచారణ సంస్థల ప్రయేయం, కోర్టు కేసులవరకు కొనసాగుతున్నది. కేంద్రాన్ని ఎప్పుడైతే రాష్ట్రం వివిధ విషయాల్లో నిలదీయటం ప్రారంభించిందో అప్పటినుండి అ రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. కేంద్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు టిఆర్‌ఎస్‌ ‌పార్టీని బిఆర్‌ఎస్‌ ‌పార్టీగా మారుస్తూ ప్రకటించిన నేపథ్యంనుండి కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణాది ప్రాంతంలో తమ ఆధిపత్యం కోసం తెలంగాణను టార్గెట్‌ ‌చేసుకున్న బిజెపి, కేంద్రంలో తమ గద్దెకు టిఆర్‌ఎస్‌ అధినాయకుడు ఎసరు పెట్టడాన్ని ఏమాత్రం సహించలేకపోతోంది. అప్పటినుండి టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది బిజెపి. బిజెపి విధానాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలియజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, బిజెపి వ్యతిరేకులను ఒక్కతాటిపైకి తీసుకురావాలని విశ్వప్రయత్నం చేశాడు. ఆ విషయమై రాష్ట్రంలోనే దీక్ష చేపట్టడం గమనార్హం. ఇది బిజెపికి మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఇదే సమయంలో ఎవరి బలమెంతన్నది బేరీజు వేసుకోడానికన్నట్లుగా మునుగోడు ఉప ఎన్నిక ఈ రెండు పార్టీలకు యుద్ధక్షేత్రంగా మారింది. ఆ ఎన్నికలను ఈ రెండు పార్టీలుకూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో ఇక టిఆర్‌ఎస్‌ ‌పని అయిపోయిందని బిజెపి చెప్పాలనుకుంది. కాని, ఆ అవకాశం ఆ పార్టీకి లేకుండా పోయింది. పైగా మునుగోడు ఎన్నికల సందర్భంగానే నలుగురు టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలను కొనుగోలు చేయడానికి పథకం రచించిందన్న అపవాదను బిజెపి మూటగట్టుకుంది. దాన్ని బిజెపి కొట్టిపారేస్తున్నప్పటికీ సిట్‌ ‌దర్యాప్తుల్లో వెలుగు చూస్తున్న కొన్ని అంశాలు దాల్‌ ‌మే కుచ్‌ ‌కాలాహై అనిపించేవిగా ఉన్నాయి. ఈ కేసు చివరకు ఎటు దారితీస్తుందో తెలియదుకాని, అంతే చిక్కుముడి కేసు ఒకటి టిఆర్‌ఎస్‌ ‌మెడకు చుట్టుకుంది.

దేశంలో సంచలం లేపిన లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో సాక్షాత్తు సిఎం కెసిఆర్‌ ‌కూతురు కవితతోపాటు, ఏపిలోని మరికొందరు రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వొచ్చాయి. ఇదిప్పుడు టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఇబ్బందిగా మారింది. లిక్కర్‌ ‌కేసులో ఎంఎల్సీ కవిత ప్రమేయం ఉన్న ట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ) తాజా రిమాండ్‌ ‌రిపోర్టులో వెల్లడించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే బిజెపి, టిఆర్‌ఎస్‌ల మధ్య మాటలు తూటాల్లాపేలుతుంటే పై రెండు కేసులు ఆ పార్టీలను మరింత రెచ్చగొట్టేట్లుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ తాజా సంఘటన రాష్ట్రాన్ని మరో కుదుపు కుదిపేసింది. ఆ పార్టీ అధినేత్రి వైఎస్‌ ‌షర్మిల మహబూబాబాద్‌ ‌జిల్లా నర్సంపేట ప్రాంతంలో పర్యటన పెద్ద గొడవకు దారితీసింది. ఈ గొడవలో ఆమె ప్రయాణిస్తున్న వాహనాలు ధ్వంసమైనాయి. ఇదికూడా ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ ఘర్షణగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పైన అసత్య ఆరోపణలు చేసిందంటూ స్థానికులు ఆమె పాదయాత్రను తీవ్రంగా ప్రతిఘటించడంలో భాగంగా జరిగిన ఘర్షణలో వాహనాలు దగ్ధమైనాయి. కాగా షర్మిల వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్‌ ‌చేస్తూ విచ్చలవిడిగా మాట్లాడటాన్ని సవాల్‌ ‌చేస్తూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌, ‌తెలంగాణ అభిమానులు విరుచుకుపడతున్నారు.

బిజెపి కనుసన్నల్లో కావాలనే శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకే రెచ్చగొట్టే ప్రసంగాలను షర్మిల చేస్తున్నదన్నది టిఆర్‌ఎస్‌ ‌నాయకుల ఆరోపణ. ఒకపక్క సిబిఐ, ఈడీలతో తమ నాయకులను భయపెడుతూనే, మరో పక్క కేంద్రం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని టిఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వొచ్చిన ఈ ఎనిమిదేళ్ళలో తొమ్మిది రాష్ట్రాలను కబళించిందని, తెలంగాణలో కూడా అదే కుతంత్రాన్ని పన్నుతోందని తెరాస శ్రేణులు ఆరోపిస్తుండగా, అవినీతి అంతమే తమ పంతమని బిజెపి అంటోంది. ఏదిఏమైనా రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘర్షణ వాతావరణం చూస్తుంటే మరోసారి ముందస్తు ఎన్నికలు వొచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాదని కొట్టిపారేస్తున్నా, రాష్ట్రంలో ఆరు నెలల్లో ఎన్నికలు ఖాయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ‌కుమార్‌ అం‌టున్నారు. అయిదవ విడుత పాదయాత్రలో భాగంగా ఆయన ముథోల్‌ ‌నియోజకవర్గంలోని గుండెగాం గ్రామంలో ఈ వ్యాఖ్య చేశారు. ఇతర రాజకీయ పార్టీలుకూడా దాన్నే దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయా అన్న అనుమానానికి తావేర్పడుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page