తెలంగాణలో అధికారం మారినా… అప్పుల తిప్పలు, ఆర్థిక సందిగ్ధతలు మాత్రం మారలేదు సరేకదా, మరింత జటిలంగా మారుతున్నాయి. ఒకవైపు ఎన్నికల లబ్ధి కోసం గుప్పించిన ఆరు గ్యారెంటీల అమలు భారం, మరోవైపు గత ప్రభుత్వ హయాం నుండి వారసత్వంగా వొచ్చిన అప్పుల ఊబి ప్రస్తుత పాలకుల మెడకు చుట్టుకుంటున్నది . ఈ రాజకీయ చదరంగంలో ఇప్పుడు అత్యంత సంక్లిష్టమైన సమస్యగా మారింది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణల సంక్షోభం. ఈ ఏడాది రాష్ట్రంలో దాదాపు 9,700 మందికి పైగా ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నరు. గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం, నిరుద్యోగుల నిరసనలను చల్లబరచడానికి వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచింది. కానీ, ఆ తాత్కాలిక ఉపశమన కాలం ముగిసి, ఇప్పుడు ఒకేసారి వేలాది మంది రిటైర్ అవుతుండటంతో… గ్రాట్యుటీ, పెన్షన్ల రూపంలో వేల కోట్ల రూపాయల తక్షణ చెల్లింపుల భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడింది. ఇది ముమ్మాటికీ గత ప్రభుత్వ రాజకీయ వ్యూహాల లోపమే అయినప్పటికీ, ఇప్పుడు దీనిని ఎలా అధిగమిస్తారన్నది ప్రస్తుత పాలకుల సమర్థతకు పరీక్షగా నిలిచింది.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) నివేదికల ప్రకారం తెలంగాణ రెవెన్యూ లోటు రూ. 9,235 కోట్లకు చేరడం వెనుక కేవలం ఆర్థిక కారణాలే లేవు, బలమైన రాజకీయ కారణాలూ ఉన్నాయి. వోటు బ్యాంకు రాజకీయాల కోసం బడ్జెట్ వనరులలో సింహభాగాన్ని ఉచిత పథకాలకే (నగదు బదిలీలు) మళ్లించాల్సి వొస్తున్నది . దీంతో రాష్ట్ర ప్రగతికి బాటలు వేసే పెట్టుబడి వ్యయం దారుణంగా కుంటుపడుతున్నది.. కాగ్ నివేదికలు హెచ్చరిస్తున్నా, పాలకుల ప్రాధాన్యతలు మాత్రం కేవలం తదుపరి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు తగ్గడం, రాష్ట్ర సొంత ఆదాయ వనరులు మందగించడం చూస్తుంటే తెలంగాణ ఆర్థిక రథం రక్షణ లేని లోయ వైపు దూసుకుపోతున్నది.
తెలంగాణ పన్నుల ద్వారా వొచ్చే ఆదాయం ఆశాజనకంగా ఉన్నప్పటికీ… అనుత్పాదక వ్యయాలు, ఉచిత పథకాలకు జరుగుతున్న నగదు బదిలీల వల్ల పెట్టుబడి వ్యయం కుంటుపడుతున్నది . ప్రస్తుత బడ్జెట్ అంచనాలలో సైతం ఆరు గ్యారెంటీల కొరకే దాదాపు 21%-24% రెవెన్యూ ఆదాయాన్ని కేటాయించాల్సి వొస్తున్నది . ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల భారం రాష్ట్రాన్ని రక్షణ లేని ఆర్థిక లోయలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తున్నది .
తెలంగాణ ఉద్యమంలో సింహభాగం పాత్ర పోషించిన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు నేడు తమ సొంత హక్కుల కోసం ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సి రావడం పెద్ద రాజకీయ వైరుధ్యం. ఆరు విడతల కరువు భత్యం (డీఏ) బకాయిలు పెండింగ్ ఉన్నాయి. కొత్త పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సుల అమలుపై ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. వీటి అమలుపై ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి తీవ్రమవుతున్నది . బడ్జెట్లో పెన్షన్ల కోసం కేటాయించిన నిధులు తొలి త్రైమాసికంలోనే సగానికి పైగా కరిగిపోవడం పాలకుల ముందస్తు ప్రణాళికా రాహిత్యానికి నిదర్శనం. నిధుల కొరతను కప్పిపుచ్చుకోవడానికి తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రయోజనాలపై ఆర్డినెన్స్ తేవడం వంటి చర్యలు కేవలం కాలం వెళ్లదీసే రాజకీయ ఎత్తుగడలే తప్ప, సమస్యకు శాశ్వత పరిష్కారం కావు .
బడ్జెట్ లో పెన్షన్ల కోసం కేటాయించిన రూ. 14,736 కోట్లలో ఇప్పటికే దాదాపు సగానికి పైగా నిధులు తొలి త్రైమాసికంలోనే ఖర్చయిపోయినట్లు గణాంకాలు చెబుతున్నయి. హైకోర్టు సైతం విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించాలని పదే పదే ఆదేశిస్తున్నది . ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రయోజనాలపై ఆర్డినెన్స్ తేవడం వంటి చర్యలు తీసుకున్నప్పటికీ, అవి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే కానీ శాశ్వత పరిష్కారాలు కావు. గత ప్రభుత్వ ముందస్తు ప్రణాళికా రాహిత్యం, ఇటు ప్రస్తుత ప్రభుత్వ ఎన్నికల హామీల ఒత్తిడి…ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నది రాష్ట్ర ఖజానా మాత్రమే. ఇక్కడ ఏ ఒక్కరినో తప్పుపట్టడం కంటే, దశాబ్దాలుగా సాగుతున్న వోటు బ్యాంకు రాజకీయాల వల్లే ఈ ఆర్థిక అసమతుల్యత ఏర్పడిందన్నది నగ్నసత్యం. ఇప్పుడు కావాల్సింది రాజకీయ విమర్శలు కావు, పారదర్శకమైన ఆర్థిక పునర్నిర్మాణం మాత్రమే. గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ శ్వేతపత్రాలు విడుదల చేయడానికే పరిమితం కాకుండా, ప్రస్తుత పాలకులు తమ సంస్కరణల వైఖరిని స్పష్టం చేయాలి.కేవలం భూముల అమ్మకాలు, మద్యం ఆదాయం పైనే ఆధారపడే ధోరణిని వీడి… దీర్ఘకాలిక పారిశ్రామిక, ఐటీయేతర పెట్టుబడులను ఆకర్షించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.
ఈ రంగాల నుండి స్థిరమైన రాబడి వొచ్చేలా చూడాలి. తెలంగాణ ఆర్థిక రథాన్ని సరైన పట్టాలెక్కించాలంటే ప్రభుత్వం తక్షణమే కొన్ని కఠినమైన, సంస్కరణాత్మక నిర్ణయాలు తీసుకోక తప్పదు.కేవలం అప్పుల పైనే ఆధారపడకుండా, సంక్షేమ పథకాలలో లబ్ధిదారుల అర్హతలను పునఃసమీక్షించి దుర్వ్యయాన్ని అరికట్టాలి. పదవీ విరమణ పొందే ఉద్యోగుల క్లెయిములను ఒకే విడతలో కాకుండా బాండ్ల రూపంలోనో లేదా వడ్డీతో కూడిన దశల వారీ చెల్లింపుల రూపంలోనో సర్దడానికి ఉద్యోగ సంఘాలతో సానుకూల చర్చలు జరపాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో… దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవలందించి విశ్రాంతి తీసుకునే ఉద్యోగుల హక్కులను కాపాడటమూ అంతే ముఖ్యం. పాలకులు రాజకీయా లబ్ధిని పక్కనబెట్టి, దీర్ఘకాలిక ప్రణాళికలతో వ్యవహరించకపోతే… భవిష్యత్ తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వొస్తుంది… ఎన్నికల రాజకీయ కోణంలో చూస్తే బకాయిలు అందని రిటైర్డ్ ఉద్యోగస్తుల కుటుంబాల ఆగ్రహాని





