- బిజెపి ఆందోళనలో ఎంపి సోయం బాపూరావు
- బుల్‌డోజర్లు వస్తున్నాయన్న ఎమ్మెల్యే రాజాసింగ్
- బండి సంజయ్, ఈటెలలు వ్యక్తులు కాదు ..శక్తులని వ్యాఖ్య
- ముగ్గురం…63 మందిమై వస్తాం..నిన్ను నిలదీస్తాం అన్న రఘునందన్
దొర అహంకారంతో సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారని ఆదిలాబాద్ బిజెపి ఎంపీ సోయం బాపూరావు అన్నారు. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. అంబేడ్కర్ రాజ్యాంగానికి జరిగిన అవమానమన్నారు. ముఖ్యమంత్రి తానా అంటే.. స్పీకర్ తందాన అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిని బయటపెడతారన్న కారణంగానే ముగ్గురు ఎమ్మెల్యేలను బయటకు పంపారని అన్నారు. తెలంగాణ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి రప్పించటంలో మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపారని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని విషయాల్లో సాయం చేస్తోందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ప్రధాని మోదీ పుణ్యమే అని అన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని సోయం బాపూరావు స్పష్టం చేశారు. ఇందిరాపార్కు వద్ద జరిగిన బిజెపి దదీక్షలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అవినీతి పాలనను అణచివేసేందుకు రాష్టాన్రికి అమిత్ షా బుల్డోజర్లను గిప్ట్‌గా పంపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక్కో బుల్డోజర్ రాబోతోందని ఆయన చెప్పారు.
ఇందిరా పార్క్‌లో చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌తో యుద్దానికి బీజేపీ సైనికులంతా సిద్ధం కావాలని రాజా సింగ్ పిలుపునిచ్చారు. అక్రమ కేసులతో బీజేపీ నేతలను, కార్యకర్తలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ చేయలేదన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవాలని చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ రాజ్యం ఉంటే.. ఢిల్లీలో బీజేపీ రాజ్యం ఉందని గుర్తుంచుకోవాలని రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అవినీతి దొంగలను అణచివేసేందుకు బుల్డోజర్లు రాబోతున్నాయని రాజా సింగ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాష్ట బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యక్తులు కాదని, శక్తులని, వారి సారథ్యంలో కేసీఆర్‌పై కొట్లాడుతామని చెప్పారు. రావణ వధ మాదిరిగా.. టిప్రుల్ ఆర్ చేతిలో సీఎం కేసీఆర్‌కు అదే గతి
పడుతుందని, తెలంగాణలో ఆయన పాలనకు త్వరలోనే అంతం తప్పదని అన్నారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తమను సస్పెండ్ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సొంత నిర్ణయం తీసుకునే ధైర్యం సభాపతికి లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు కలసి పోటీచేయనున్నాయని జోస్యం చెప్పారు. భట్టి విక్రమార్కను ఏ పార్టీ నుంచి రాజ్యసభకు పంపుతారో చెప్పాలన్నారు.
తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం నడవాలంటే ప్రజలు సంఘటితం కావాలని రఘునందనరావు పిలుపిచ్చారు. కేసీఆర్‌పై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుందన్నారు. దుబ్బాక.. హుజురాబాద్ ప్రజలు చూపిన చైతన్యాన్ని తెలంగాణ ప్రజలు అందిపుచ్చుకోవాలన్నారు. పీకేలు, ఏకే 47లు టీఆర్‌ఎస్‌ను కాపాడలేవన్నారు. ఇప్పుడున్న ముగ్గురం..అరవై ముగ్గురంగా మారి నీవు చేసిన విధంగానే నిన్ను బోనులో నిలబెడతామని కెసిఆర్‌ను హెచ్చరించారు. అప్పుడు ప్రభుత్వం మాదే ఉంటుందని…. పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. గజ్వెల్‌లో నిన్ను నిలదీసే రోజు వస్తుందని అన్నారు.
పార్టీ అనుమతి తీసుకుని అన్ని కేంద్రాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలు నిర్వహిస్తామన్నారు. నల్ల కండువాలు వేసుకుంటే సభ నుంచి సస్పెండ్ చేయటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఒకరినొకరు పొగుడుకోవటానికి అసెంబ్లీ వేదికైందని రఘునందనరావు ఎద్దేవా చేశారు. ఇదిలావుంటే ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు బీజేపీ తల పెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు ఎక్కటేలకు అనుమతి ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు.. తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్‌లో బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకోగా? పోలీసులు అనుమతి నిరాకరించారు.. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీజేపీ నేతలు.. ప్రజాస్వామ్యం గొంతు నులిమే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.. ఇందిరా పార్క్ వద్ద సీఎం ధర్నా చేస్తే ఒప్పు? బీజేపీ దీక్ష చేస్తే తప్పా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. చివరకు ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చారు.. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు.