– భౌతిక కాయానికి మంత్రి పొన్నం నివాళి
– ప్రభుత్వం, ఆర్టీసీ నుంచి ఆర్థిక సాయం
– ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : చిల్లర వివాదంలో గత నెల 25న నడుస్తున్న బస్సు నుంచి ప్రయాణికురాలు తోసేయడంతో బస్సు కింద పడి తీవ్ర గాయాలతో పది రోజులుగా హైదరాబాద్లో చికిత్స పొందుతున్న మణుగూరు డిపోకు చెందిన కండక్టర్ గుండ్ల ప్రవళిక మంగళవారం రాత్రి మృతిచెందింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిలు ఉస్మానియా హాస్పిటల్కు వెళ్లారు. మార్చురీ వద్ద ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. ప్రవళిక తల్లిని పరామర్శించి వారికి ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం, ఆర్టీసీ నుండి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యాంకు నుండి రూ.కోటి ప్రమాదా బీమా అందనున్నాయి. కండక్టర్ మృతికి సంతాప సూచకంగా మణుగూరు డిపోలో బంద్ పాటించారు.
ఆర్టీసీ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం బాధాకరం 
ఆర్టీసీ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది.. ఈ సంఘటన జరగగానే యాజమాన్యం తరఫున హాస్పిటల్కు వెళ్లి మంచి చికిత్స అందించే ప్రయత్నం చేశాం అని మంత్రి పొన్నం తెలిపారు. కానీ దురదృష్టవశాత్తూ కండక్టర్ ప్రవళిక దూరమైందన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు కలుగజేస్తది.. అదే సందర్భంలో కార్మికుల సంక్షేమం, భద్రత ముఖ్యం అని చెప్పారు. ఇలాంటి అంశాల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ సంఘటనలో దోషిపై హత్యా యత్నం కింద ఉన్న కేసు ఇప్పుడు హత్య కేసుగా నమోదు చేసి తగిన విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగొద్దన్నారు. ఒకవేళ తమ సిబ్బంది ఎక్కడైనా పొరపాటుగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం కానీ మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకుని తోసివేయడం వల్ల ఇవాళ ఒక కుటుంబం రోడ్డున పడ్డది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి ఆర్టీసీ అండగా ఉంటుందని చెప్పారు. సభ్యురాలిని కోల్పోయిన బాధను ఎవరూ తొలగించలేమన్నారు. చాలా క్రమశిక్షణతో కాకీ బట్టల సంస్థగా ఆర్టీసి ముందుకు వస్తదని, క్రమశిక్షణ తప్పకుండా తాము వాళ్ళను కూడా కోరుతానని తెలిపారు. ప్రయాణికుల ద్వారా కూడా ఏమైనా అసౌకర్యం కలిగితే మనం కూడా చట్టం ముందు ఫిర్యాదు చేద్దామన్నారు.
ముఖ్యమంత్రి విచారం
మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి
కండక్టర్ పవళిక మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రవళిక మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో ప్రవళిక కుటుంబం ఒంటరిది కాదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





