తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి

సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. వరి ధాన్యం కొనుగోలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అకాల వర్షంతో రైతులు నష్టపోయారని అన్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, రాజకీయ ప్రయోజనాలే తప్ప తెలంగాణ రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్త శుద్ధి లేదన్నారు. కనీసం రైతులకు గన్నీ సంచులను కూడా సమకూర్చడం లేదని లేఖలో మండిపడ్డారు. ఐకేపీ కేంద్రాలను సకాలంలో ప్రారంభించని ప్రభుత్వం వైఫల్యం వల్లే ఇవాళ రైతులు తీవ్రంగా నష్టపోయారని లేఖలో బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు.

అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 74 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించి, 20 రోజులు గడుస్తున్నా కేవలం 2500 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారని చెప్పారు. ఇప్పటి వరకు కనీసం 10 శాతం ధాన్యం కొనుగోలు కూడా జరగలేదన్నారు. ఐకేపీ కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవడంతో తక్కువ ధరకే దలారులకు పంటను అమ్ముకుని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస ఏర్పాట్లు చేయలేదని, ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నష్టపోయిన రైతుల గురించి ఆలోచించాల్సిన ఆర్థికశాఖ మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి, ఇతర మంత్రులు ఎఫ్‌సీఐ తనిఖీలపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎఫ్‌సీఐ తనిఖీలు జరిగితే మంత్రికి వొచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. కషన్ల బాగోతం బయటపడుతుందని భయమా..? అని బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page