టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’కు రాష్ట్ర బిజెపి గురువారం శ్రీకారం చుట్టింది . తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ళ కాలంలో ఇక్కడి ప్రజలు ఆశించిన దానికి భిన్నమైన పాలన జరుగుతున్న నేపథ్యంలో ఇక ఎంతమాత్రం ఈ ప్రభుత్వాన్ని కొనసాగించరాదన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర బిజెపి వర్గాలు ఈ యాత్రను ప్రారంభిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ అమ్మవారి ఆశిస్సులతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ పాదయాత్రను కొనసాగించబోతున్నారు. గురువారం ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఈ యాత్రను ప్రారంభించారు.. ప్రజలతో మమేకమై వారి సాధక బాధలను స్యయంగా తెలుసుకోవడానికై చేపట్టిన ఈ పాదయాత్రల్లో ఇది రెండవది. ఇంతకు క్రితం ఆగస్టు 28న మొదటివిడుతగా చేపట్టిన ఈ యాత్ర విజయవంతమయింది. దాని ముగింపు హుజురాబాద్‌లో జరగడం, హుజురాబాద్ బై ఎలక్షన్‌లో ఆ పార్టీ ఘన విజయం సాధించడంతో బండి సంజయ్‌కి మంచిపేరు వచ్చింది. అదే ఊపులో ఇప్పుడు రెండవ విడుత ప్రజా సంగ్రామ పాదయాత్రకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 36 రోజుల పాటు సాగిన మొదటి విడుత పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్ 18 అసెంబ్లీ, ఆరు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది జిల్లాలను చుట్టబెట్టారు.
ఈ సందర్భంగా ఆయన దాదాపుగా 34 సభల్లో ప్రసంగించడంద్వారా ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వేలెత్తి చూపే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు పేదలకు ఎలా చేరకుండా పోతున్నాయన్నది లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేశారు. వివిధ గ్రామాలగుండా పాదయాత్ర జరిపినప్పుడు ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చారు. కేంద్ర, రాష్ట్రానికి చెందిన అనేక పథకాలు వారికి చేరకపోవడంపట్ల ప్రభుత్వాన్ని నిలదీశారు. పంతుళ్ళులేని బడులు, కూలడానికి సిద్దంగా ఉన్న పాఠశాల భవనాలు, అందుబాటులోలేని వైద్యం ఇలా ఆయన దృష్టికి వచ్చిన అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగు పడుతాయని ఆశించిన అనేక మందికి నిరాశ, నిస్రృహ ఎదురవుతున్నది. ఈ ఎనిమిదేళ్ళకాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకోసం చకోర పక్షుల్లా ఎదురు చూడడమేగాని ఉద్యోగాలను పొందిందిలేదు. వయస్సుదాటి, ఉద్యోగార్హత కోల్పోయిన జీవులెన్నో..! రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చిందిలేదు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానన్నమాట పక్కకు పెట్టి కుటుంబ పాలన సాగుతోందిక్కడ. రాష్ట్రం ఏర్పడినప్పుడు అరవైవేల కోట్ల రూపాయల అప్పు ఉంటే, ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉంది. అంత డబ్బు ఏమైంది. ఎక్కడ ఖర్చుచేశారు. ప్రజలకు చెప్పాల్సిన అవసరముంది. వీటన్నిటినీ ప్రజాక్షేత్రంలో మరోసారి పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకే రెండవ పాదయాత్రగా ఆ పార్టీ చెబుతోంది.
వాస్తవంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ ఇతర పార్టీలుకూడా ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికను అమలు పరుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో విడుతల వారీగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఆయన యాత్ర సందర్భంగా కూడా అనేక అంశాలు వెలుగుచూస్తున్నాయి. అలాగే ఇప్పటికే రెండవ దఫా ప్రజా ప్రస్థానం పేర వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రను కొనసాగిస్తూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంపైన, కెసిఆర్‌పైన విమర్షల బాణాలను సంధిస్తున్నది.. రానున్న 2023 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ఈ పార్టీలన్నీ ఇప్పటినుండే యుద్ద క్షేత్రంలో అడుగు పెట్టాయనే అనుకోవచ్చు. సంజయ్ చేపడుతున్న రెండవ విడుత పాదయాత్ర అష్టాదశ శక్తి పీఠంలో ఒకటైన జోగులాంబ అమ్మ సన్నిధినుండి ప్రారంభం కానుంది. 31 రోజుల పాటు సాగే ఈయాత్రకోసం ఆ పార్టీ ముప్పై నిర్వహణకమిటీలను ఏర్పాటు చేసింది. అయితే వేసవిదృష్ట్యా పాదయాత్ర మద్యమద్య బ్రేక్ పడనుంది.
ఉదయం ఎనిమిదినుంచి పదకొండున్నర గంటలవరకు, సాయంత్రం నాలుగునుంచి ఎనిమిది గంటలవరకు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. విశ్రాంతి సమయంలో ఆయా గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించి కుల, చేతివృత్తిదారులు, ప్రజలతో సమావేశమై వారి ఇబ్బందులను స్యయంగా తెలుసుకోవడం జరుగుతుంది. దీనితోపాటు ఈ నెల 7 నుండి 20 వరకు నిర్వహించనున్న సామాజిక న్యాయ పక్షం కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ పాదయాత్ర సందర్బంగా అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించవచ్చు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టిఆర్‌ఎస్ పాలనపై విసుగుచెంది లేదా రాజకీయ ప్రాధాన్యత లేని ఉద్యమకారులు అనేకులు బిజెపిలోకి చేరే అవకాశం ఉందనుకుంటున్నారు. గ్రామాల్లో అలాంటివారిని గుర్తించి తమ పార్టీలోకి ఆహ్వానించే ఏర్పాట్లను కూడా ఆ పార్టీ సిద్దం చేసుకుంటోంది. మొత్తంమీద ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర సంచలనాత్మకంగానేఉంటుందను కుంటున్నారు.